Telugu Global
National

దళితులకు దగ్గరవుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి, దాని అనుబంధ హిందూ సంస్థలకు దళితులు దూరమవుతున్నారు. హిందూ సంస్థలు చేస్తున్న గో రాజకీయాలు, మనువాద రాజకీయాలు, భారతీయ సంస్కృతినే దెబ్బతీస్తున్న ఫ్యాసిస్ట్‌ ధోరణులు దళితులను ఏకం చేస్తున్నాయి. దళితులలో ఎప్పుడూ లేనంత అస్థిత్వ భయం పట్టుకుంది. దాంతో ఎన్నడూ లేనంత సంఘటితంగా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. గుజరాత్‌లో ఆ సెగ ఏకంగా మోడీకే తగులుతోంది. దానిని ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావులు గుర్తించారు. ముస్లింలు, క్రిస్టియన్‌లు, దళితులు ఏకమైతే భారత రాజకీయాల్లో ఏం […]

దళితులకు దగ్గరవుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌
X

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి, దాని అనుబంధ హిందూ సంస్థలకు దళితులు దూరమవుతున్నారు. హిందూ సంస్థలు చేస్తున్న గో రాజకీయాలు, మనువాద రాజకీయాలు, భారతీయ సంస్కృతినే దెబ్బతీస్తున్న ఫ్యాసిస్ట్‌ ధోరణులు దళితులను ఏకం చేస్తున్నాయి. దళితులలో ఎప్పుడూ లేనంత అస్థిత్వ భయం పట్టుకుంది. దాంతో ఎన్నడూ లేనంత సంఘటితంగా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. గుజరాత్‌లో ఆ సెగ ఏకంగా మోడీకే తగులుతోంది. దానిని ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావులు గుర్తించారు. ముస్లింలు, క్రిస్టియన్‌లు, దళితులు ఏకమైతే భారత రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లకే అందరికన్నా ఎక్కువ తెలుసు. అందుకే కుల రాజకీయాలనుంచి కొత్త మత రాజకీయాలవైపు దృష్టి మళ్లించారు.

ప్రతి దళితుడికి అంబేద్కర్‌ ఆదర్శం. ఆయనే వాళ్లకు గురువు, దేవుడు. ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో దళితులు చదువుకుంటున్నారు. చదువుతోపాటే అంబేద్కర్‌ను అధ్యయనంచేస్తున్నారు. అంబేద్కర్‌ ఆశయాలను, ఆదర్శాలను అర్ధంచేసుకుంటున్నారు. అంబేద్కర్‌ క్రైస్తవ మతం తీసుకోకుండా బౌద్ధం ఎందుకు స్వీకరించాడో తెలుసుకుంటున్నారు. చదువుకున్న దళితులు ఎక్కువమంది క్రిస్టియానిటీ వైపు కాకుండా బౌద్ధం వైపు మళ్లుతున్నారు. దళిత సంఘాలలో బౌద్ధాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్నారు. కులవ్యవస్థపట్ల, హిందూమతం పట్ల ద్వేషంతో కుల అసమానతలు లేని బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు.

సరిగ్గా ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తనకు అనుకూలంగా మల్చుకోదల్చుకుంది. హిందూమతానికి విరుద్ధమైన బౌద్ధం నుంచి కొన్ని మంచి విషయాలను స్వీకరించి తన మతంలో కలుపుకుంది హైందవం. అలాగే బుద్ధుణ్ణి మహా విష్ణువు అవతారాల్లో ఒకటిగా చేసిపారేసింది. కానీ ఏ హిందూ పూజారీ బౌద్ధాన్ని ఇష్టపడడు. మనువాదులు బుద్ధుడిని ఒక అవతారంగా పైకి అంగీకరిస్తూనే లోపల బుద్ధుని బోధనలను ద్వేషిస్తారు. ఇపుడు వీళ్లకు మరోసారి బుద్ధుని అవసరం పడింది. భారత రాజకీయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చక్రం తిప్పడానికి బుద్ధుని అరువు తెచ్చుకోక తప్పనిపరిస్థితి ఏర్పడింది.

దళితులను బౌద్ధంవైపు ఆకర్శించే పనిని ఇపుడు దళితమేధావుల నుంచి, బుద్ధిస్టుల నుంచి మనువాదులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు తమ భుజస్కందాలమీద వేసుకుంటున్నారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. దళితులు క్రైస్తవం వైపు వెళ్లకూడదు. బౌద్ధంవైపు వెళితే బౌద్ధంకూడా హిందుత్వంలో ఒక భాగం అని వాళ్లను భ్రమ పెట్టవచ్చు. మనమంతా ఒకటే అని వాళ్లను ఓట్లవరకైనా కలుపుకుపోవచ్చు. అదీ ఆలోచన.

ఈ ఆలోచనలో భాగంగా భారతీయ బౌద్ధ సంఘం అధ్యక్షుడు బంతే సంఘప్రియ రాహుల్‌ను రంగంలోకి దింపింది. ఈయన వెనక బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ్‌ జాటియా ఉన్నారు. వీళ్లు దళితులలో బౌద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. దళిత బౌద్ధ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే వీటికి దళితుల నుంచి ప్రోత్సాహంలేదు. అందువల్ల ఇటీవల గుజరాత్‌లోని ఉనా లో గో రక్షకులచేతిలో దెబ్బలుతిన్న నలుగురు దళితులను బౌద్ధంవైపు ఆకర్షించి (రోహిత్‌ వేముల కుటుంబం కూడా ఇటీవలే బౌద్ధాన్ని స్వీకరించింది), వాళ్లతో కలిపి యూపీ, గుజరాత్‌లలో పెద్ద ర్యాలీ నిర్వహించనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి గ్రామం గుండా ఈ యాత్ర సాగి మే 26వ తారీఖున గుజరాత్‌లోని ఝునాఘర్‌లో ముగిసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈలోగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి దళిత కుటుంబాన్ని కలిసి బుద్ధుని గురించి, ఆయన బోధనల గురించి వివరించే ఏర్పాట్లను ఆర్‌ఎస్‌ఎస్‌ దళిత విభాగం చేపట్టింది.

First Published:  21 Sept 2016 11:24 PM GMT
Next Story