డిపార్ట్‌మెంట్‌లో అవినీతి పరులున్నారు... అయినా సరే రామకృష్ణారెడ్డిదే తప్పు!
కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మ హత్య కేసులో పోలీసుల వైఖరి తేటతెల్లమైంది. ప్రతిపక్షాలు, ప్రజల ఆందోళనలే నిజమయ్యాయి. రామకృష్ణారెడ్డి అవినీతి పరుడని సర్టిఫికేట్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో కలిసి అక్రమవసూళ్లకు పాల్పడ్డాడని ఆ విషయం బయటపడుతుందన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విచారణాధికారి అకున్ సబర్వాల్ డీజీపికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. రామకృష్ణారెడ్డి స్టేషన్ పరిధిలో ఇసుక, బొగ్గు లారీల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడని, అలా వసూలు చేసిన డబ్బును ఉన్నతాధికారులతో కలిసి పంచుకున్నాడని […]
BY sarvi18 Sept 2016 6:40 AM IST
X
sarvi Updated On: 18 Sept 2016 7:17 AM IST
కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మ హత్య కేసులో పోలీసుల వైఖరి తేటతెల్లమైంది. ప్రతిపక్షాలు, ప్రజల ఆందోళనలే నిజమయ్యాయి. రామకృష్ణారెడ్డి అవినీతి పరుడని సర్టిఫికేట్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో కలిసి అక్రమవసూళ్లకు పాల్పడ్డాడని ఆ విషయం బయటపడుతుందన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విచారణాధికారి అకున్ సబర్వాల్ డీజీపికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. రామకృష్ణారెడ్డి స్టేషన్ పరిధిలో ఇసుక, బొగ్గు లారీల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడని, అలా వసూలు చేసిన డబ్బును ఉన్నతాధికారులతో కలిసి పంచుకున్నాడని నివేదిక ఇచ్చారన్న వార్తలపై స్థానికులు మండిపడుతున్నారు. వ్యక్తి చనిపోయాక అవినీతి ఆరోపణలు అంటగడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మామూళ్ల విషయంలో ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు రామకృష్ణారెడ్డి. చనిపోయిన ఎస్సై ఆరోపించిన పోలీసు అధికారుల పేర్లను ఎఫ్.ఐ.ఆర్‌లో ప్రస్తావించకపోవడాన్ని సవాలు చేస్తూ ఎస్.ఐ భార్య ధనలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ తన నివేదికలో రామకృష్ణారెడ్డే అవినీతిపరుడు, శాఖాపరమైన విచారణకు భయపడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని పేర్కొన్నాడన్న వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రామకృష్ణారెడ్డి తన ఆత్మహత్య లేఖలో ప్రస్తావించిన డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యల ఇతర సిబ్బందిని వదిలేసి చనిపోయిన ఎస్సై ఒక్కడే అవినీతి పరుడనే ప్రచారం జరగడంపై స్థానిక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారులతో కలిసి వసూళ్లకు పాల్పడినపుడు ఇతని ఒక్కనిపైనే ఎందుకు చర్యలు తీసుకుంటారో? ప‌్రజలకు అర్థం కావడం లేదు. డిపార్ట్‌మెంట్లో అవినీతిపరులున్నారని అంగీకరించినపుడు వారిపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతా కలిసి వసూళ్లకు పాల్పడిన విషయం నిజమని పోలీసులు అంగీకరించినపుడు.. వేధింపులు నిజమేనన్నవిషయం ఎందుకు ఒప్పుకోవడంలేదని నిలదీస్తున్నారు.
సీఎం సొంత జిల్లా.. అందులోనూ కేసీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో తొలుత కేసు దర్యాప్తు విశ్వసనీయతపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. విచారణాధికారి ఏఎస్పీ ప్రతాపరెడ్డి.. ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణారెడ్డిదే తప్పని 12 గంటల్లో తేల్చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో కేసు పర్యవేక్షణాధికారిగా రంగంలోకి దిగిన అకున్ సబర్వాల్ నివేదిక కూడా ప్రతాపరెడ్డి మాటలనే తలపించినట్లు ఉందన్న వార్తలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ముద్దాయిలను వదిలేసి బాధితుడినే నిందితుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని మొదటి నుంచి వాదిస్తూ వస్తోన్న ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు ఈ వార్తలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
Click on Image to Read:
Next Story