అధికార పార్టీలో నయీం గుబులు!
నయీం పీడ విరగడైనా.. అతనితో కలిసి సావాసం చేసిన వారిలో భయం మాత్రం పోవడం లేదు. నయీం బతికి ఉన్నపుడు అతనితో కలిసి దందాలు చేసిన వారి పేర్లు మెల్లిగా బయటికి వస్తున్నాయి. వీరిలో అధికార పార్టీకి చెందిన వారు ఉండటం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించడం సంచలనం రేకెత్తించింది. నయీం ఎన్‌కౌంటర్ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన.. […]
BY sarvi5 Sept 2016 4:37 AM IST
X
sarvi Updated On: 5 Sept 2016 7:01 AM IST
నయీం పీడ విరగడైనా.. అతనితో కలిసి సావాసం చేసిన వారిలో భయం మాత్రం పోవడం లేదు. నయీం బతికి ఉన్నపుడు అతనితో కలిసి దందాలు చేసిన వారి పేర్లు మెల్లిగా బయటికి వస్తున్నాయి. వీరిలో అధికార పార్టీకి చెందిన వారు ఉండటం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించడం సంచలనం రేకెత్తించింది. నయీం ఎన్‌కౌంటర్ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన.. అతని కీలక అనుచరుడు శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరిట భువనగిరి పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు రిజిష్టర్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మల్ రెడ్డి రంగారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. నయీంతో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. మంచిరెడ్డి తన నియోజకవర్గంలో నయీంతో కలిసి పలు భూదందాలు సాగించాడని భారీగా ఆస్తులు కూడబెట్టాడని, వీటి విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని ఆయన ఆరోపించాడు. ఈ విషయంలో తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే ఇబ్రహీం పట్నం చౌరస్తాలో చర్చకు రావాలని సవాలు విసిరాడు.
ఈ ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. తనకు నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశాడు. ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలేనని కొట్టిపారేశాడు. ఇటీవలి కాలంలో నయీం కేసులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పేరు వెల్లడికావడం ఇది రెండోసారి. ఇటీవల మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పేరు బయటికి వచ్చింది. తాజాగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో నయీం నేరాల్లో అధికార పార్టీ నేతలకు సైతం వాటా ఉందన్న విమర్శలు పార్టీ ప్రతిష్టను కొంత మసకబారుస్తోంది. మరోవైపు మరింత మంది ప్రజాప్రతినిధులకు నయీంతో సంబంధాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందన్న విషయం అంతు చిక్కడం లేదు.
Next Story