పగలు పారిశుధ్య కార్మికుడు... సాయంత్రం వేళ మృదంగ విద్వాంసుడు!
తమిళనాడు, మధురైకి చెందిన ఇళంగోవన్ వాడపళంజిలోని దళిత కాలనిలో నివసిస్తుంటాడు. అతను పగలంతా తన వృత్తిని నిర్వహిస్తూ… రోడ్లను శుభ్రం చేస్తుంటాడు. సాయంత్రమయ్యే సరికి వీనులవిందైన మృదంగ వాయిద్యాన్ని వినిపిస్తూ… కళాకారుడిగా మారిపోతాడు. నాలుగు తరాలుగా వారి కుటుంబంలో వారు ఈ విధంగానే తమ వృత్తికి, తమలోని ప్రవృత్తికి న్యాయం చేస్తూ వస్తున్నారు. ఇళంగోవన్ పగలు ఖాకీ షర్టు, లుంగీ ధరించి తన పనిలో ఉంటాడు. మున్సిపాలిటీ కార్మికునిగా చెత్తని ఎత్తుతుంటాడు. సాయంత్రమయ్యేసరికి సిల్క్ షర్టు […]
తమిళనాడు, మధురైకి చెందిన ఇళంగోవన్ వాడపళంజిలోని దళిత కాలనిలో నివసిస్తుంటాడు. అతను పగలంతా తన వృత్తిని నిర్వహిస్తూ… రోడ్లను శుభ్రం చేస్తుంటాడు. సాయంత్రమయ్యే సరికి వీనులవిందైన మృదంగ వాయిద్యాన్ని వినిపిస్తూ… కళాకారుడిగా మారిపోతాడు. నాలుగు తరాలుగా వారి కుటుంబంలో వారు ఈ విధంగానే తమ వృత్తికి, తమలోని ప్రవృత్తికి న్యాయం చేస్తూ వస్తున్నారు.
ఇళంగోవన్ పగలు ఖాకీ షర్టు, లుంగీ ధరించి తన పనిలో ఉంటాడు. మున్సిపాలిటీ కార్మికునిగా చెత్తని ఎత్తుతుంటాడు. సాయంత్రమయ్యేసరికి సిల్క్ షర్టు పంచె ధరించి నుదుట విబూది, కుంకుమతో మృదంగ విద్యాంసునిగా మారిపోతాడు. స్కూలు చదువుని మధ్యలో మానేసిన ఇళంగోవన్ తరతరాలుగా తమ కుటుంబంలో వస్తున్న కళలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.
ఇళంగోవన్… 12ఏళ్ల వయసు నుండి మృదంగం నేర్చుకోవటం ప్రారంభించాడు. మధురైలోని రామస్వామి ఆయన గురువు. అయితే తండ్రి అరుముగమ్ మధురై కార్పొరేషన్‌లో పనిచేస్తూ 45ఏళ్ల వయసులో మరణించడంతో ఇళంగోవన్‌కి ఆయన ఉద్యోగం వచ్చింది. దాంతో అప్పటినుండి ఉద్యోగం, మృదంగం… అనే రెండు పడవల మీద అతను సమర్ధవంతంగా ప్రయాణం చేస్తున్నాడు. తనకు తన కళ ఎంత ముఖ్యమో…తమ కుటుంబానికి అన్నం పెడుతున్న ఉద్యోగం కూడా అంతే ముఖ్యమంటాడతను. ఉదయాన్నే ఐదుంపావుకి నిద్ర లేవటంతో ఇళంగోవన్ దినచర్య మొదలవుతుంది. 18కిలోమీటర్లు బైక్‌మీద ప్రయాణించి మధురై సిటీకి చేరుకుని అక్కడ పశ్చిమ జోన్‌లోని రోడ్లను శుభ్రంచేసే డ్యూటీ చేస్తాడు. మధ్యాహ్నం మూడుకి ఇంటికి తిరిగి వచ్చి…సాయంత్రం ఏడుకల్లా మృదంగ విద్యాంసుడిగా మారిపోతాడు.
దైవపరమైన కార్యక్రమాలకు మాత్రమే తాను మృదంగ వాయిద్యాన్ని సమకూరుస్తున్నట్టుగా ఇళంగోవన్ తెలిపాడు. అయితే అది కూడా తనకు సమయం ఉంటేనే ఒప్పుకుంటానని… కచేరీల కోసం ఉద్యోగానికి హాజరు కాకపోవటం ఎప్పుడూ ఉండదని అతను చెప్పాడు. మధురై రోడ్లమీద చీపురుతో కనిపించే ఇళంగోవన్…ముంబయి, చెన్నైలాంటి నగరాల్లో వినాయక చవితి లాంటి పండుగల్లో మృదంగ విద్యాంసుడిగా కళాభిమానులను అలరిస్తున్నాడు.
44 ఏళ్ల వయసులో తాత కూడా అయిపోయిన ఇళంగోవన్, తన తరువాత తరాలు కూడా మృదంగ కళని ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాడు. అతని ఎనిమిదేళ్ల మేనల్లుడు లోకేష్ ప్రస్తుతం మేనమామ అడుగుజాడల్లో నడుస్తూ మృదంగంలో శిక్షణ పొందుతున్నాడు.
Click on Image to Read: