భారత్‌లో మొట్టమొదట హెచ్ఐవి వైరస్‌ని గుర్తించిన మహిళ ఈమే...సెల్లప్పన్ నిర్మల!
ముప్పయ్యేళ్ల క్రితం భారత్లో హెచ్ఐవి వైరస్‌ని కనుగొన్నారు. ఆరుగురు సెక్స్ వర్కర్ల రక్తపు నమూనాల్లో హెచ్ఐవి వైరస్ ఉన్నట్టుగా తేలింది. అయితే ఈ భయంకరమైన వ్యాధిని కనుగొనటం వెనుక…ఒక యువ మహిళా శాస్త్రవేత్త కృషి ఉంది. భారత్కి హెచ్ఐవి వైరస్ వచ్చేసిందని మొట్టమొదట కనుగొని…దేశాన్ని అప్రమత్తం చేసిన ఆ మహిళకు దేశంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆమె పేరు సెల్లప్పన్ నిర్మల. 1985లో 32ఏళ్ల వయసున్న నిర్మల చైన్నైలోని మెడికల్ కాలేజిలో మైక్రోబయాలజీ విద్యార్థిగా ఉన్నారు. తాను […]
ముప్పయ్యేళ్ల క్రితం భారత్లో హెచ్ఐవి వైరస్‌ని కనుగొన్నారు. ఆరుగురు సెక్స్ వర్కర్ల రక్తపు నమూనాల్లో హెచ్ఐవి వైరస్ ఉన్నట్టుగా తేలింది. అయితే ఈ భయంకరమైన వ్యాధిని కనుగొనటం వెనుక…ఒక యువ మహిళా శాస్త్రవేత్త కృషి ఉంది. భారత్కి హెచ్ఐవి వైరస్ వచ్చేసిందని మొట్టమొదట కనుగొని…దేశాన్ని అప్రమత్తం చేసిన ఆ మహిళకు దేశంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆమె పేరు సెల్లప్పన్ నిర్మల.
1985లో 32ఏళ్ల వయసున్న నిర్మల చైన్నైలోని మెడికల్ కాలేజిలో మైక్రోబయాలజీ విద్యార్థిగా ఉన్నారు. తాను సమర్పించాల్సిన సిద్ధాంత వ్యాసం కోసం…ఏ అంశాన్ని ఎంపిక చేసుకోవాలా… అని ఆమె ఆలోచిస్తున్న సమయం అది. అప్పుడే… నిర్మల ప్రొఫెసర్, మెంటర్ అయిన సునీతి సాల్మన్ ఆమెకో సలహా ఇచ్చారు. అంతకుముందే 1982లో అమెరికాలో ఎయడ్స్ కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి. అప్పటికి మన వైద్య అధికారులు దానిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో హెచ్ఐవి అంటే కేవలం లైంగిక విశృంఖలత్వం, హోమో సెక్సువాలిటీ ఎక్కువగా ఉన్న పశ్చిమదేశాల్లోనే వస్తుందని…మనకు అది వచ్చే అవకాశం లేదని పత్రికలు రాస్తున్నాయి.
కానీ అప్పటికే హెచ్ఐవి వైరస్ భారత్ చేరిందనే వార్తలను సైతం కొన్ని పత్రికలు రాశాయి. అయితే చెన్నై తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా సాంప్రదాయ వాసులే ఉంటారు…అనే ఉద్దేశంతో ముంబయిలో వందల మంది రక్తపు నమూనాలు సేకరించి పరీక్షించారు. అయితే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా తెలిసి ఉండటంతో నిర్మల… ఈ అంశాన్ని తన సిద్ధాంత వ్యాసానికి ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి సునీతి సాల్మన్ మరీ మరీ చెప్పడంతో ఆమె అంగీకరించారు.
హెచ్ఐవి రిస్క్ ఎక్కువగా ఉన్న సెక్స్ వర్కర్లు, గేలు, ఆఫ్రికా విద్యార్థులు తదితరుల నుండి 200 రక్తపు శాంపిళ్లు సేకరించాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికి నిర్మలకు ఈ విషయంపై ఎలాంటి అవగాహన లేదు. ముంబయి, డిల్లీ, కోల్‌కతాల్లో ఉన్నట్టుగా చెన్నైలో రెడ్ లైట్ ఏరియాలు లేకపోవడంతో తాము శాంపిళ్లు ఎక్కడనుండి సేకరించాలో నిర్మలకు అర్థం కాలేదు. దాంతో ఆమె లైంగిక వ్యాధుల చికిత్సకు మహిళలు ఎక్కువగా వచ్చే మద్రాస్ జనరల్ ఆసుపత్రికి తరచుగా వెళుతుండేవారు. వారిలో చాలామంది… అభాగ్యులైన మహిళలు, సెక్స్ వర్కర్లు ఆశ్రయం పొందే విజిలెన్స్ హోమ్ నుండి వస్తుండేవారు. సెక్స్ వర్కర్లుగా అరెస్టయినవారిని రిమాండ్ హోములోనే ఉంచుతుండేవారు. ఎందుకంటే వారికి బెయిల్ పొందే ఆర్థిక స్థోమత కూడా ఉండేది కాదు. నిర్మల సెక్స్ వర్కర్లను కలిసేందుకు రోజూ రిమాండ్ హోమ్కి వెళుతుండేవారు.
ఒక పల్లెటూరిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఆమెకు వారిని కలవటం ఇబ్బందిగా ఉండేది. కానీ ఆమె భర్త వీరప్పన్ రామమూర్తి మాత్రం నిర్మలను ప్రోత్సహిస్తుండేవారు. అడుగడుగునా ఆమెకు వెన్నంటి ఉండేవారు. రిమాండ్ హోమ్ వద్ద తన స్కూటర్మీద దింపుతుండేవారు. వారిద్దరూ అప్పుడే తమ వృత్తుల్లోకి వచ్చారు. వారికప్పుడు ప్రతిరూపాయి విలువైనదే. అయినా సొంత ఖర్చుతో నిర్మల ఈ పరిశోధనకు ఉపక్రమించారు.
అలా మూడునెలల కాలంలో నిర్మల 80మంది మహిళల రక్తపు నమూనాలను తీసుకోగలిగారు. అప్పుడు ఆమెకు రక్షణగా వాడుకునే గ్లవుజులు గానీ ఇతర పరికరాలు గానీ లేవు. బ్లడ్ శాంపిళ్లు ఇచ్చే మహిళలకు అవి… ఆమె ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ఎయిడ్స్ అంటే ఏమిటో కూడా వారికి తెలియదు. వారంతా నిరక్షరాస్యులు… చెప్పినా అర్థం చేసుకోలేరు. నిర్మల సుఖవ్యాదులపై పరిశోధనలు చేస్తున్నారని వారు అనుకునేవారు.
రక్తపు నమూనాలు సేకరించాక…ఇక వాటిని పరీక్షించాల్సిన సమయం వచ్చింది. అందుకు ల్యాబ్ కావాలి. అప్పుడుకూడా తన మెంటర్ సునీతి సాల్మన్… నిర్మలకు సహాయం చేశారు. సునీతి సాల్మన్ భర్త గుండె ఊపిరితిత్తుల సర్జన్. ఆయన నుండి పొందిన పరికరాలతో ఒక చిన్న ప్రయోగశాలని వారు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సాల్మన్, నిర్మల కలిసి రక్తం నుండి సీరం ని వేరు చేశారు. పరీక్షలు చేయాలంటే సీరం… రక్తం నుండి వేరు కావాల్సి ఉంది. ఆ తరువాత వాటిని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక నిర్మల… తన ఇంట్లోని ఫ్రిజ్లో ఉంచారు.
ఆ తరువాత చేయాల్సిన ఎలిసా టెస్టింగ్ సదుపాయాలు చెన్నైలో లేవు. దాంతో సునీతి సాల్మన్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజిలో ఆ ఏర్పాటు చేశారు. 1986 ఫిబ్రవరిలో ఆ శాంపిల్స్ని నిర్మల, ఆమె భర్త ఒక ఐస్ బాక్సులో పెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వైరాలజి డిపార్ట్మెంట్ డైరక్టర్ జాకబ్ టి జాన్ నిర్మలకు సహాయం చేసేందుకు ఇద్దరు జూనియర్ డాక్టర్లను ఇచ్చారు. వారు పి జార్జ్ బాబు, ఎరిక్ సిమోస్.
ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నరకు పరీక్షలు మొదలుపెట్టారు. మధ్యాహ్నం కరెంటు పోవటంతో అంతా టీకోసం బయటకు వెళ్లారు. తరువాత డాక్టర్ జార్జిబాబు, నిర్మల మొదట ల్యాబ్లోకి వచ్చారు. జార్జిబాబు ప్రయోగాలు నిర్వహిస్తున్న పరికరం మూతని తీసి వెంటనే పెట్టేశారు. దాని మూత తీయవద్దు… అని నిర్మలతో అన్నారు. కానీ నిర్మల తీసి చూశారు… ఆరు నమూనాలు పసుపు రంగులోకి తిరిగి ఉన్నాయి. అంటే హెచ్ఐవి అని ధృవీకరించే రుజువు అది. ఆమె నిర్ఘాంత పోయారు. అలా జరుగుతుందని నిర్మల ఊహించలేదు. ఆ తరువాత డాక్టర్ సిమోస్ కూడా వచ్చి చెక్ చేశారు. కొన్ని పాజిటివ్ పలితాలు ఉన్నాయని అంటూ… ఈ విషయాన్ని జాకబ్ టి జాన్ కి చెప్పడానికి పరిగెత్తారు.
జాన్ వచ్చి చూసి…ఈ శాంపిల్స్ని ఎక్కడ నుండి తెచ్చారు…అని నిర్మలని అడిగారు. నిర్మల వివరాలు చెప్పాక…ఆ విషయంపై తర్జన భర్జనలు అయ్యాక….ఈ విషయాలు బయట ఎక్కడా చెప్పబోమని నిర్మల, ఆమె భర్త రామమూర్తి ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇది చాలా సున్నిత విషయమని ఎవరికీ చెప్పవద్దని అక్కడి డాక్టర్లు వారికి చెప్పి పంపారు. చెన్నైకి వచ్చాక ఈ విషయాలన్నీ నిర్మల… సునీతి సాల్మన్కి చెప్పారు.
ఆ తరువాత సునీతి సాల్మన్, బాబు, సిమోస్లతో కలిసి నిర్మల తిరిగి విజిలెన్స్ హోమ్కి వెళ్లారు. అక్కడ తిరిగి ఆ ఆరుగురు మహిళల రక్తపు శాంపిళ్లు తీసుకున్నారు. వాటిని తీసుకుని సిమోస్ అమెరికా వెళ్లారు. అక్కడ జరిపిన వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్‌లో…హెచ్ఐవి వైరస్ ఇండియా వచ్చిందని నిర్దారణ అయ్యింది.
ఈ వార్తని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చికి చేరవేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి, తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి హెచ్వి హండేకి కూడా తెలియజేశారు. ఈ చేదువార్తని హండే ఆ ఏడాది మే నెలలో అసెంబ్లీలో ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల, సునీతి సాల్మన్ విజిటర్స్ గ్యాలరీలోనే కూర్చుని ఉన్నారు. చాలామంది దీన్ని నమ్మలేదు. కొంతమంది ఈ పరీక్షలు ఎలా చేశారని ప్రశ్నించారు. కొంతమందయితే డాక్టర్లే పొరపాటు పడ్డారన్నారు. ముఖ్యంగా సాల్మన్ మహారాష్ట్రకు చెందిన వారు కావటంతో ఆమెపై మరిన్ని విమర్శలు వచ్చాయి.
సునీతి సాల్మన్ గత సంవత్సరమే మరణించారు. దీనిపై ఆమె కుమారుడు సునీల్ సాల్మన్ మాట్లాడుతూ…నిజంగా జనం మా అమ్మ పట్ల తీవ్రంగా ఆగ్రహాన్ని చూపించారు. ఒక ఉత్తర భారత మహిళ వచ్చి…మేము చెడ్డవాళ్లమని చెబుతుందా…అనే ఆవేశాన్ని చాలా మంది వ్యక్తం చేశారని సునీల్ అన్నారు. ఆ తరువాత అధికారులు తీవ్రంగా స్పందించడం…. నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం అంతా జరిగిపోయింది. అత్యంత త్వరగా భారత్లోని నలుమూలలా హెచ్ఐవి వ్యాపించడం కూడా జరిగింది.
1990-2000 మధ్య కాలంలో మనదేశంలో ఈ వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టారు. మనదేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా 52 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని చాలా సంవత్సరాలు భావించాము. 2006 లెక్కల ప్రకారం అందులో సగం వరకు ఉండవచ్చని తేలింది. నేటికీ 21 లక్షలమంది హెచ్ఐవికి గురయినవారు ఉన్నారని అంచనా.
నిర్మల ఆ తరువాత తన అధ్యయనాన్ని కొనసాగించారు. ఆమె మార్చి 1987లో తమిళనాడులో ఎయిడ్స్పై నిఘా… అనే అంశంతో తన థీసిస్ సమర్పించారు. తరువాత పరీక్షలు రాశారు…పాసయ్యారు. చెన్నైలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్రోగ్రాంలో చేరి సేవలు అందించి 2010లో రిటైర్ అయ్యారు.
ఏవో కొన్ని పేపరు వార్తలు తప్ప నిర్మల సాధించిన విజయంపై …ఆమెకు ఎక్కువగా గుర్తింపు, పేరు రాలేదు. మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఎప్పుడైనా బాధగా అనిపించిందా… అని అడగ్గా…నేను పల్లెటూరిలో పుట్టి పెరిగాను. అక్కడ ఇలాంటి విషయాల్లో పొంగిపోవటం, కుంగిపోవటం ఉండదు. నాకు వచ్చిన అవకాశంపై నేను సంతోషంగా ఉన్నాను. సమాజానికి నేనూ ఎంతోకొంత మంచి చేసినందుకు ఆనందిస్తున్నాను…అన్నారు.