వైద్యం కోసమని వచ్చారు...డాక్టరునే దోచుకెళ్లారు!
కర్ణాటక బెంగలూరులోని ఓకలిపురాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఎనిమిదన్నరకు డాక్టర్ సుబ్రమణి (40) తన క్లినిక్ కెజెఎం హెల్త్ సెంటర్లో ఉన్నారు. పేషంట్లు తగ్గటంతో ఆయన విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. ఈ లోపల ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. అందులో ఒకరు కాస్త అనారోగ్యం ఉన్నట్టుగా ఉన్నాడు. తనకు తలనొప్పిగా కళ్లు తిరుగుతున్నట్టుగా ఉందని చెప్పాడు. దాంతో సుబ్రమణి అక్కడ ఉన్న స్టూలుమీద కూర్చోమని చెప్పారు. ఆయన పరీక్ష చేయడానికి సిద్ధమవుతుండగా పేషంటులా వచ్చిన […]
కర్ణాటక బెంగలూరులోని ఓకలిపురాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఎనిమిదన్నరకు డాక్టర్ సుబ్రమణి (40) తన క్లినిక్ కెజెఎం హెల్త్ సెంటర్లో ఉన్నారు. పేషంట్లు తగ్గటంతో ఆయన విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. ఈ లోపల ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. అందులో ఒకరు కాస్త అనారోగ్యం ఉన్నట్టుగా ఉన్నాడు. తనకు తలనొప్పిగా కళ్లు తిరుగుతున్నట్టుగా ఉందని చెప్పాడు. దాంతో సుబ్రమణి అక్కడ ఉన్న స్టూలుమీద కూర్చోమని చెప్పారు. ఆయన పరీక్ష చేయడానికి సిద్ధమవుతుండగా పేషంటులా వచ్చిన ఆ వ్యక్తి…. కత్తి తీసి డాక్డరుని బెదిరించి డబ్బు బయటకు తీయమన్నాడు.
మరొక వ్యక్తి ఒక బ్యాగుతీసి క్యాష్ డ్రాలోంచి డబ్బుతీసి అందులో వేసుకున్నాడు. డాక్టరు మెడలో ఉన్న బంగారు గొలుసుని కూడా లాక్కున్నారు. విచిత్రమేమిటంటే…ఇదంతా జరుగుతున్నపుడు సుబ్రమణి 17ఏళ్ల కుమారుడు బయట టూ వీలర్ దగ్గర ఉన్నాడు. అతను ఆ ఇద్దరిని చూశాడు కూడా. వాళ్లు వచ్చినపుడు క్లినిక్లో ఉన్న అతను…మామూలు పేషంట్లేనేమో అనుకుని బయటకు వెళ్లిపోయాడు. అంతే కాదు…బయట మరొక పేషంటు కూడా ఉన్నాడు. వారికి లోపల ఏం జరుగుతుందో తెలియదు. దొంగలు దొంగతనం ముగించుకుని బయట వారికోసం ఎదురుచూస్తున్న మరొక వ్యక్తితో కలిసి తాపీగా వెళ్లిపోయారు. సుబ్రమణి వెంటనే సిటీ పోలీసులకు ఫోన్ చేశాడు కానీ…దగ్గరలోని శ్రీరాం పురా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తాను స్టేషన్లో ఒక్కడినే ఉన్నానని ఎలాంటి సహాయం చేయలేనని చెప్పాడు. దొంగలు వెళ్లిన గంటకు పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ దొంగలకు తను, తన దినచర్య, క్లినిక్… అన్నీ తెలిసినట్టుగా ప్రవర్తించారని…వారు తాను నగదు దాచే ప్రదేశాన్ని గుర్తుపట్టారని డాక్టర్ సుబ్రమణి పోలీసులకు తెలిపారు.