అమ్మనాన్నా వదిలేశారు...పోలీసులు ఆదుకున్నారు!
ఢిల్లీలోని సమయ్‌పూర్ మెట్రోస్టేషన్ ప్రాంతంలో ముగ్గురు చిన్న పిల్లలను ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు, రెండేళ్ల బాబు… దిక్కులేని అనాథలుగా బతుకుతుండగా…పిల్లవాడిని ఆ పిల్లల బామ్మగా చెబుతున్న పెద్దావిడ తీసుకువెళ్లింది. ఆడపిల్లలను కూడా తీసుకువెళ్లమని ఇరుగుపొరుగువారు కోరగా…తనకు స్థోమతలేదని, మీలో ఎవరైనా పెంచుకోండి…అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పిల్లలు ఆకలితో నీరసించి ఒళ్లంతా పుళ్లతో బలహీనంగా ఉండగా… పోలీసులు వారిని […]
ఢిల్లీలోని సమయ్‌పూర్ మెట్రోస్టేషన్ ప్రాంతంలో ముగ్గురు చిన్న పిల్లలను ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు, రెండేళ్ల బాబు… దిక్కులేని అనాథలుగా బతుకుతుండగా…పిల్లవాడిని ఆ పిల్లల బామ్మగా చెబుతున్న పెద్దావిడ తీసుకువెళ్లింది. ఆడపిల్లలను కూడా తీసుకువెళ్లమని ఇరుగుపొరుగువారు కోరగా…తనకు స్థోమతలేదని, మీలో ఎవరైనా పెంచుకోండి…అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నారు.
పిల్లలు ఆకలితో నీరసించి ఒళ్లంతా పుళ్లతో బలహీనంగా ఉండగా… పోలీసులు వారిని రోహిణిలోని బిఆర్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చి ఒక ఆడ, ఒక మగ కానిస్టేబుళ్లను వారికి కాపలాగా ఉంచారు. పోలీసులు పిల్లల ఇరుగుపొరుగువారి నుండి సేకరించిన సమాచారం ప్రకారం… పిల్లల తల్లి మూడునెలల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. వారి తండ్రి పచ్చి తాగుబోతు కాగా…భార్యని అనుమానించి కొడుతుండేవాడు. అతను దగ్గరల్లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. అయితే తల్లి వెళ్లిపోయిన కొన్నాళ్లకు తండ్రి కూడా కనిపించకుండా పోయాడు. ఆ పిల్లలు అప్పుడప్పుడు బయటకు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో అడుక్కుని తింటూ బతుకుతున్నారు. ఈ లోపల పిల్లల బామ్మ వచ్చి మగపిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది.
చివరికి ఆడపిల్లలిద్దరూ ఒంటినిండా పుళ్లతో, గాయాలపై ఈగలు ముసురుతూ… అనారోగ్యంతో ఏడుస్తుంటే ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలపై ఎవరో యాసిడ్ లాంటి ద్రావణం పోసినట్టుగా ఉందని, పోలీసులు ఆదుకోకపోతే వారు చనిపోయేవారని…వారు ఉంటున్న ఇంటి ఓనరు తెలిపింది. పిల్లలకు చికిత్స చేస్తున్న వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని, గాయాలను శుభ్రం చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు కోలుకున్నాక సంక్షేమ గృహానికి పంపుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రిలో వారితో ఉంటున్న కానిస్టేబుళ్లు…పిల్లలకు బట్టలు, ఆహారం, బొమ్మలు, ఆర్థిక సహాయం లాంటివన్నీ అందుతున్నాయని…వాళ్లు తమనే కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని చెప్పారు.