ప్రవీణ్‌కుమార్ నిద్రలేవడం వెనుక ఉద్దేశం వేరే ఉందా?
ఇటీవల వైసీపీ చేసిన గడపగడపకు కార్యక్రమం ద్వారా ఆ పార్టీకి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. పార్టీ నేతల కమిట్‌మెంట్‌ను లెక్కకట్టేందుకు ఈ కార్యక్రమం బాగానే ఉపయోగపడిందని చెబుతుంటారు. ఇలా బుక్ అయిన వారే తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. 2012లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఈయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తనకు పార్టీతో ఏం పని అన్నట్టుగానే వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో వైసీపీ అనేక […]
ఇటీవల వైసీపీ చేసిన గడపగడపకు కార్యక్రమం ద్వారా ఆ పార్టీకి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. పార్టీ నేతల కమిట్‌మెంట్‌ను లెక్కకట్టేందుకు ఈ కార్యక్రమం బాగానే ఉపయోగపడిందని చెబుతుంటారు. ఇలా బుక్ అయిన వారే తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. 2012లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఈయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తనకు పార్టీతో ఏం పని అన్నట్టుగానే వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో వైసీపీ అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాత్రం గడపదాటలేదు. ఇదే సమయంలో గడపగడపకు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంటే తంబళ్లపల్లెలో మాత్రం పడకేసింది. తమ నియోజకవర్గానికి నాయకుడు ఉన్నాడా లేడా అన్న అనుమానంతో కేడర్ తికమకపడింది. దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటే పనికాదని నిర్ధారణకు వచ్చిన జగన్… అప్పటికప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది ఆ పార్టీకి .
రెండేళ్ల పాటు సుప్తావస్థలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరగణం ఇప్పుడు మేల్కొంది. తాముండగా ద్వారకానాథ్ రెడ్డికి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. ద్వారకానాథ్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం దాదాపు సహాయనిరాకరణ చేస్తోంది. ద్వారకానాథ్ రెడ్డిని తప్పించాలని నియోజకవర్గంలోని బి.కొత్తకోట.. మొలకలచెరువు మండలాలలో ప్రవీణ్..కలిచెర్ల వర్గీయులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రవీణ్‌కే నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. నియోజకవర్గంలో తాను కాకుండా మరో నాయకుడు ఎవరొస్తారులే అన్న నిర్లక్ష్య ధోరణితో రెండేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని ప్రవీణ్ కుమార్ రెడ్డి… ఇప్పుడు తాను పార్టీ కోసం పనిచేస్తున్నా అంటే ఎలా నమ్మాలంటున్నారు ఆ పార్టీ నేతలు. ద్వారకానాథ్ రెడ్డిని నియమించబట్టి ఇప్పటికైనా ప్రవీణ్ కుమార్ రెడ్డి నిద్రలేచారు గానీ… అలాగే వదిలిపెట్టి ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చేవరకు ఇలాగే సుప్తావస్థలో ఉండేవారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబం తిరిగి అటువైపు వేళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆ ఆలోచనతోనే రెండేళ్లపాటు పార్టీ కార్యక్రమాలను ప్రవీణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోలేదని చెబుతున్నారు. సైలెంట్‌గా పార్టీ మారితే కిక్ ఏముంటుంది అందుకే ఇప్పుడు నియోజకవర్గ సమన్వయ కర్తగా ద్వారకానాథ్ రెడ్డిని నియమించడంపై రచ్చ చేసేందుకు ప్రవీణ్ ప్రయత్నిస్తున్నారని కొందరి అభిప్రాయం.
Click on Image to Read: