స్వచ్ఛభారత్ టాయిలెట్లు కడుతున్నారు సరే... వాటిని ఎవరు శుభ్రం చేయాలి? " బెజవాడ విల్సన్
ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా నిర్మిస్తున్న టాయిలేట్లు ఇంకా …మనుషులు చేతులతో మలమూత్రాలను ఎత్తిపోసే విధానంలోనే ఉండటంపై మెగసెసె అవార్డు గ్రహీత సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ మండిపడ్డారు. ప్రభుత్వం టాయిలెట్లను నిర్మిస్తుంది సరే…అయితే వాటినెవరు శుభ్రం చేస్తారో తెలపాలన్నారు. జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కన్వీనర్ అయిన విల్సన్ ఢిల్లీలోని జాకిర్ హుసెన్ కాలేజిలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కులం, అసమానతలపై సాగిన ప్రసంగంలో విల్సన్ పలు అంశాలను ఎత్తి చూపారు. స్వచ్ఛభారత్ అభియాన్ […]
ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా నిర్మిస్తున్న టాయిలేట్లు ఇంకా …మనుషులు చేతులతో మలమూత్రాలను ఎత్తిపోసే విధానంలోనే ఉండటంపై మెగసెసె అవార్డు గ్రహీత సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ మండిపడ్డారు. ప్రభుత్వం టాయిలెట్లను నిర్మిస్తుంది సరే…అయితే వాటినెవరు శుభ్రం చేస్తారో తెలపాలన్నారు. జాతీయ సఫాయి కర్మచారి ఆందోళన్ కన్వీనర్ అయిన విల్సన్ ఢిల్లీలోని జాకిర్ హుసెన్ కాలేజిలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కులం, అసమానతలపై సాగిన ప్రసంగంలో విల్సన్ పలు అంశాలను ఎత్తి చూపారు.
స్వచ్ఛభారత్ అభియాన్ పథకం కింద 12కోట్ల టాయిలెట్లు నిర్మిస్తున్నారని, కానీ సెప్టిక్ ట్యాంకుల నిర్మాణంలో… నీటిని బయటకు పంపే… పంపులను వాడకపోవటం వలన… ఇప్పటికీ ట్యాంకులను మనుషులే శుభ్రం చేయాల్సి ఉంటుందని…మరి ఆ పని ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. భారత్ క్రయోజెనిక్ ఇంజిన్లను నిర్మిస్తుందని, చంద్రునిమీదకు రాకెట్లను పంపుతుందని…కానీ టాయిలేట్లను చేతులతో శుభ్రంచేసే పనిని తప్పించే టెక్నాలజీ గురించి మాత్రం ఆలోచించదని ఆయన అన్నారు.
ఈ సమస్యని అసలు గుర్తించడమే లేదని చెబుతూ… తన స్కూలు పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చెప్పిన అంటరాని తనం గురించిన పాఠాలు లేవని…కానీ గాంధీజీ ఏం చెప్పారు… అనేది మాత్రమే ఉందని అన్నారు. గాంధీజీ మహిళా పారిశుధ్య కార్మికులను తల్లులతో పోల్చారని..తమ బిడ్డలకు చేసే సేవలుగానే వారి సేవలను పరిగణించాలని అన్నారని…ఇప్పటికీ సాటిమనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తిపోస్తున్న వారి ఆత్మగౌరవం గురించి మనం పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు.
మనదేశంలో టెర్రరిస్టుల దాడుల్లో మరణించినవారికంటే సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి సంఖ్య నాలుగురెట్లు ఎక్కువగా ఉందన్నారు. కానీ టెర్రరిజం గురించి చూపుతున్న శ్రద్ధలో సగం కూడా ప్రభుత్వం ఈ సమస్యపై చూపటం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు భారత్ ముందున్న అతి పెద్ద సమస్యలు రెండని, అందులో ఒకటి కులం, రెండవది పితృస్వామ్యమని, కానీ ఏ రాజకీయ నాయకుడు ఈ సమస్యలను గురించి చర్చించడని…ఈ రెండింటినీ దేనికది విడదీసి చూడలేమని రెండింటిపై కలిపి పోరాటం చేయాలని విల్సన్ అన్నారు.
చేతులతో మురికిని ఎత్తిపోసే సమస్య మనదేశంలో మిగిలిన వాటితో పోలిస్తే చిన్నదే కావచ్చని అయితే స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా దీన్నే నివారించలేక పోతున్నపుడు ఇక దేశంలోని మతఛాందస వాదాలను ఎలా పోగొట్టగలమని విల్సన్ ప్రశ్నించారు.
దేశంలో 44 శాతం మందికి పోషకాహారమే అందని పరిస్థితి ఉంటే…ప్రజలు ఏం తినకూడదో చెబుతున్నారని, కట్టుకునేందుకు సరైన బట్టలు లేని దేశంలో ప్రజలు ఏం ధరించాలో ఏం ధరించకూడదో చెబుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు తమకు నచ్చినది తినలేనపుడు, తమకు ఇష్టమైనట్టుగా దుస్తులు ధరించలేనపుడు ఇక స్వాతంత్య్రానికి అర్థమేముందని విల్సన్ ప్రశ్నించారు.