ఆఖరి క్షణంలో ఆ పెళ్లి ఆగింది...ఆమె బతికిపోయింది!
కొన్ని గంటల్లో పెళ్లయిపోతుంది అనగా పెళ్లి కూతురు తరపువారికి పెళ్లి కొడుకు (30)కి హెచ్ఐవి ఉన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే పెళ్లిని ఆపేశారు. తమిళనాడులోని తిరువన్నమలైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా పెళ్లికొడుకు ఫొటోలు ఉన్న బ్యానర్లని అతని తరపువారు అట్టహాసంగా ఊరంతా చాలా చోట్ల ఉంచారు. వాటిపై అతని ఫొటోని చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి జిల్లా కలెక్టరుకి, రెవెన్యూఅధికారికి ఆదివారం రాత్రి ఫోన్ చేసి…వరుడి పేరు, జరుగుతున్న పెళ్లి వివరాలు చెప్పి, […]
కొన్ని గంటల్లో పెళ్లయిపోతుంది అనగా పెళ్లి కూతురు తరపువారికి పెళ్లి కొడుకు (30)కి హెచ్ఐవి ఉన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే పెళ్లిని ఆపేశారు. తమిళనాడులోని తిరువన్నమలైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా పెళ్లికొడుకు ఫొటోలు ఉన్న బ్యానర్లని అతని తరపువారు అట్టహాసంగా ఊరంతా చాలా చోట్ల ఉంచారు. వాటిపై అతని ఫొటోని చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి జిల్లా కలెక్టరుకి, రెవెన్యూఅధికారికి ఆదివారం రాత్రి ఫోన్ చేసి…వరుడి పేరు, జరుగుతున్న పెళ్లి వివరాలు చెప్పి, అతనికి హెచ్ఐవి ఉందని, చికిత్స పొందుతున్నాడని తెలిపాడు. వెంటనే స్పందించిన కలెక్టర్..ఎస్పికి, మెడికల్ సర్వీసెస్ జాయింట్ డైరక్టర్కి ఫోన్ చేసి ఆ వ్యక్తి గురించి వాకబు చేయమని చెప్పారు. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను కలిసి ఈ సంగతిని చెప్పాల్పిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలోని సంబంధిత విభాగపు రికార్డులను పరీక్షించగా అందులో ఆ వ్యక్తి 2014, జులై 30 నుండి హెచ్ఐవికి చికిత్స చేయించుకుంటున్నట్టుగా ఉంది. సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మెడికల్ రిపోర్టులపై ఉన్న ఫోన్నెంబరుతో.. అతనికి అధికారులు కాల్ చేయగా…ఓ గంటలో తానే వచ్చి కలుస్తానని చెప్పాడు. కానీ అతను రాలేదు. మరోవైపు రెవెన్యూ అధికారులు పెళ్లి కుమార్తె సోదరి నెంబరుని చిక్కించుకుని ఆమెకు విషయం చెప్పగా ఆమె నమ్మలేదు. అప్పటికే వరుడు…పెళ్లి కుమార్తె తరపువారితో… తనతో విభేదాలున్నవారు పెళ్లిని ఆపడానికి పుకార్లు సృష్టిస్తున్నారని వాటిని నమ్మవద్దని చెప్పి ఉండటంతో… వారు అదంతా అబద్దమని అనుకున్నారు. దాంతో మెడికల్ ఆఫీసర్, డిఎస్పి, తహసిల్దార్ స్వయంగా వెళ్లి నిజం వివరించారు. అప్పుడు విషయం అర్థమైన పెళ్లి కూతురి తరపువారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. తమ కుమార్తె జీవితాన్ని కాపాడినందుకు పెళ్లి కూతురి తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రికి రాత్రి తామంతా వెంట వెంటనే స్పందించి…చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కిందని కలెక్టరు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి కూతురి కుటుంబం పోలీసుల రక్షణతో తమ గ్రామాన్ని చేరుకుంది. వధువుకి తమ గ్రామానికి చెందిన బంధువైన యువకుడితో అదే రోజు వివాహం జరిగింది.