Telugu Global
Others

మూడు తరాల దళితుల జీవన సమరం

 “అరేయ్ నర్సిగా! దొర రమ్మంటుండు.” నర్సిగాడు దొర దగ్గరికెళ్లాడు. నర్సిగాడిని చూడగానే దొర మొఖం కందగడ్డలా మారిపోయింది. గుడ్లురిమాడు. “లం… కొడ్కా, పంది నా కొడ్కా! సర్కార్ కు చెప్పులిచ్చి భూమి కొట్టేస్తావురా?” “నీ గులాపోణ్ని దొర. నీ బాంచన్. అంతపని జేస్తనా! తమర్ని నమ్ముకోని బత్కెటోణ్ని, నీ కాళ్ల కాడ బత్కెటోణ్ని. తప్పైంది దొరా!” “లం… కొడ్కా. అంటరానోడ్వి! యాభై ఎకరాలు ఏం జేస్తవురా? భూస్వామివైపోయి నా పక్కన కూసోవాలనుకుంటున్నావురా?” “లేదు దొర. అసుంటి పాపం […]

మూడు తరాల దళితుల జీవన సమరం
X

RV Ramarao “అరేయ్ నర్సిగా! దొర రమ్మంటుండు.”

నర్సిగాడు దొర దగ్గరికెళ్లాడు.

నర్సిగాడిని చూడగానే దొర మొఖం కందగడ్డలా మారిపోయింది. గుడ్లురిమాడు.

“లం… కొడ్కా, పంది నా కొడ్కా! సర్కార్ కు చెప్పులిచ్చి భూమి కొట్టేస్తావురా?”

“నీ గులాపోణ్ని దొర. నీ బాంచన్. అంతపని జేస్తనా! తమర్ని నమ్ముకోని బత్కెటోణ్ని, నీ కాళ్ల కాడ బత్కెటోణ్ని. తప్పైంది దొరా!”

“లం… కొడ్కా. అంటరానోడ్వి! యాభై ఎకరాలు ఏం జేస్తవురా? భూస్వామివైపోయి నా పక్కన కూసోవాలనుకుంటున్నావురా?”

“లేదు దొర. అసుంటి పాపం ఎట్ల జేస్త? అంటరానోణ్ని భూస్వామినెట్లైత. దేవుడూకుంటాడు. నా కండ్లుపోతై. నీ కాల్మొక్త దొర!”

“లం.. కొడ్క నీకు ఇనాం ఇచ్చిన భూమిలకెంచి రెండెకరాలు ఉంచుకో. దున్నుకోని బత్కు పో.

నరసయ్య ప్రాణం కుదుటపడింది. రెండెకరాలైనా మిగిలినందుకు సంతోషపడ్డాడు. అంతకన్నా ఎక్కువగా దొర ఆగ్రహం నుంచి తప్పించుకున్నందుకు సంతోషించాడు.

ఇదంతా కథ కాదు. వాస్తవ జీవితం. కరీం నగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో నర్సయ్య, అదే నర్సిగాడు మాదిగ కులానికి చెందిన వాడు. అయిదవ నిజాం మీర్ తహ్నియాత్ ఖాన్ అఫ్జల్ ఉద్దౌలా సర్కార్ కు చెప్పుల జత కుట్టిచ్చాడు. అతనికి వచ్చిన పని అదే. నిజాం మెచ్చి నరసయ్యకు యాభై ఎకరాల భూమి ఇనాం గా ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. కాని యెలుకటి గ్రామ దొర వెలమ కులానికి చెందిన వాడు. ఒక మాదిగకు యాభై ఎకరాల భూమి రావడమేమిటని కన్నెర్ర చేశాడు. రెండెకరాలు వదిలేసి మిగదంతా కాజేసి కాని శాంతించలేదు.

డాక్టర్ వై.బి.సత్యనారాయన రాసిన “మై ఫాదర్ బాలయ్య” గ్రంథం ఇలా ఆరంభం అవుతుంది. దొర ఆగ్రహానికి గురైన నరసయ్య ముని మనవడే సత్యనారాయణ. సత్యనారాయణ తాత పేరు కూడా నరసయ్యే. చివరకు సత్యనారాయణ తాత నరసయ్య తన భార్య శవాన్ని వీపుకు కట్టుకుని ఆరేళ్ల కొడుకు బాలయ్యను ఈడ్చుకుంటూ వెళ్లి గొయ్యి తవ్వి భార్యకు అంతిమ సంస్కారం చేసి పొట్ట చేతపట్టుకుని వంగపల్లి గ్రామం శాశ్వతంగా వదిలి బతుకుదెరువుకోసం తరలి పోయాడు.

ఆ బాలయ్య కుమారుడే వై.బి.సత్యనారాయణ. సత్యనారాయణ అసలు పేరు సత్తయ్య. కాని అతను బాగా చదవడం గ్రహించిన హెడ్ మాస్టారు సత్తయ్య పేరును మెట్రిక్ పరిక్షకు వెళ్లడానికి ముందు సత్యనారాయణగా మార్చేశారు.

అలా తండ్రితో పాటు వంగపల్లి గ్రామం వదిలి వచ్చిన బాలయ్య నెమ్మదిగా రైల్వేలో ఉద్యోగం సంపాదించి బతుకు వెళ్ల దీశాడు. బాలయ్య పెద్దగా చదువుకున్న వాడు కాదు. అలాగని నిరక్షరాస్యుడూ కాదు. బడి చదువులకు నోచుకోలేదు. కాని రామాయణ, మహా భారతం కూడా చదివాడు. దళితులు ఈ గ్రంథాలు చదవడం అప్పుడు నిషేధం. చదివితే అరిష్టం ఎదురవుతుందనే వారు. దళితులు కూడా ఈ మాటే నమ్మే వారు. కాని బాలయ్య ఆ భావనను ఎదిరించాడు. చదువుకుంటే తప్ప బతుకులకు నిష్కృతి లేదన్న నమ్మకం ఉన్న వాడు. బాలయ్య తండ్రితో పాటు సొంత ఊరు వంగపల్లి వదిలి వలస పోకపోతే, చదువే తమ జీవితాలకు వెలుగు చూపుతుందని నమ్మకపోతే వై.బి సత్యనారాయణ ఈ గ్రంథం రాయడానికి అవకాశం వచ్చేదే కాదు. బహుశః ఆయన కుటుంబం ఇంకా ఆ పల్లెలోనే అంటరానితనం కాడి కింద పడి నలిగిపోతూనే ఉండేదేమో.

దీన్నిబట్టి విధిలేని పరిస్థితుల్లో దళితులు వలస వెళ్లడం, భూస్వాముల ధాష్టీకానికి ఆవల ఏదో ఉపాధి చూసుకుని బతకడం, చదువు విలువ గ్రహించడం వల్లే సత్యనారాయణ కుటుంబం రూపాంతరం చెందింది. సత్యనారాయణ తండ్రి రైల్వేలో పని చేస్తూ ఎంత కష్టపడైనా పిల్లలను చదివించాలనుకోవడం వల్ల సత్యనారాయణతో పాటు ఆయన సోదరులిడ్డరు పి.హెచ్ డి. చేయగలిగారు. బాలయ్యది గంపెడు సంసారం. పిల్లలను చదివించడంకోసం రైల్వే ఉద్యోగంతో పాటు కూలి పని చేశాడు. ఆయన భార్య కూడా పొలాల్లో కూలీగా పని చేసి సంపాదించారు. పిల్లలను చదివించడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నారు.

సత్యనారాయణ 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. కెమిస్ట్రీ పట్టా పుచ్చుకున్నారు. పి.హెచ్ డి చేశారు. మొదట నిర్మల్ లోని జూనియర్ కళా శాలలో ప్రైవేటు కళాశాలలో పని చేశారు. 33వ ఏట ధర్మవంత్ కళాశాల ప్రిన్సిపల్ అయ్యారు. ఆయన సోదరుల్లో ఒకరు డా. అబ్బాసాయులు ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్. సత్యనారాయణ కుటుంబాన్ని వలస, చదువు గట్టెక్కించడమే కాదు సామాజిక వెలి కూపం నుంచి చాలా వరకు బయటికి లాగాయి.

my father balaiahఇప్పుడు సత్యనారాయణ సంతానం విదేశాల్లో ఉన్నారు. అందుకే సత్యనారాయణ మనవలకు అంటరాని తనం అగచాట్లు ఏమిటో తమ ముందు తరాల వారు కుల వివక్ష కారణంగా ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు. తన ముద్దుల మనవరాలికి ఈ కథ చెప్పడం కోసమే వై.బి. సత్యనారాయణ “మై ఫాదర్ బాలయ్య” గ్రంథం రాశారు. దీని అంతరార్థం దళితుల సామాజిక జీవిత నేపథ్యాన్ని భావి తరాలకు తెలియజెప్పడమే.

ఈ గ్రంథం వెలువడింది 2011లోనే అయినా కబాలి సినిమా మొదటి సీన్ లో రజినీ కాంత్ ఈ గ్రంథం చదువుతుండడంతో ఈ గ్రంథం ఎక్కువ మంది దృష్టిలోకి వచ్చింది. సత్యనారాయణ ఈ గ్రంథాన్ని ఇంగ్లీషులో రాయడం కూడా గ్రంథ ప్రాచుర్యానికి మరో కారణం. ఇప్పుడీ గ్రంథం మీద హైదరాబద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో, పుణే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. యేల్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఈ గ్రంథ ప్రతులు కనిపిస్తున్నాయి.

ma nana balaiahఈ గ్రంథాన్ని పి.సత్యవతి తెలుగులోకి “మా నాయన బాలయ్య” పేరుతో అనువదించారు. ఇది 2013లో వెలువడింది. ఆ తర్వాత 2014లో కన్నడ, 2015లో హిందీ అనువాదాలు వెలువడ్డాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా బెంగాలీ, మరాఠీ అనువాదాలు వెలుగు చూడనున్నాయి.

ఇది మూడు తరాల దళిత కుటుంబ ప్రస్థానం. కథ అంతా ఒక కుటుంబం చుట్టే తిరిగినా అది సగటు దళితుల జీవన గాథ. “మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి.” అంటారు ఎండ్లూరి సుధాకర్.

“తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన – మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది.” అంటారు శాంతా సిన్హా.

ఉద్యోగ విరమణ తర్వాత బాలయ్య తను పుట్టిన ఊరు వంగపల్లి వెళ్లి తన రెండెకరాల భూమిని సాగు చేసుకుని బతుకుదామనుకున్న ప్రయత్నం నెరవేరక పోవడం దళితుల బతుకులో మార్పు ఇంకా అసంపూర్ణంగానే ఉందని అర్థం అవుతుంది. దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. ఆర్. శంకరన్ రాసిన ముందుమాట ఈ గ్రంథానికి అదనపు ఆకర్షణ.

రైల్వేలు, గనులు, మిల్లులు మొదలైన వాటిలో కింది స్థాయి ఉద్యోగాలైనా దళితులకు దక్కడానికి అవకాశం కల్పించాయి. సాపేక్షికంగా అంటరానితనాన్నించి దూరం చేశాయి. చదువు వల్ల దళితుల జీవన విధానంలో మెరుగైన మార్పులు రావడానికి అవకాశం ఉందని, పట్టణ జీవితం కులవివక్ష తప్పించుకోవడానికి తోడ్పడిందని మూడు తరాల దళితుల ఆత్మ కథ “ మై ఫాదర్ బాలయ్య” రుజువు చేస్తోంది.

-ఆర్వీరామా రావ్

Click on Image to Read:

swami sachidananda

Nathuram Gadsey

Gujarat Files

First Published:  22 Aug 2016 5:51 AM IST
Next Story