బాహుబలి క్యారెక్టర్ వర్సెస్ పవన్ కల్యాణ్ నాయకత్వం...
నాయకుడు కూడా ఒక మనిషే. కానీ నాయకుడిగా ఉండాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. సంక్షోభసమయంలోనూ సమూహానికి స్పూర్తి నింపే శక్తి నాయకుడిలో కనిపించాలి. బహుబలి సినిమా యుద్ధ పోరాటం జరుగుతుండగా ఒక దశలో బహుబలి సైన్యం వెన్నుచూపి పారిపోతుంది. కాళికేయ సైన్యం విజృంభణ ధాటికి బహుబలి సైన్యం చెల్లాచెదురై పరుగులు తీస్తుంది. అక్కడే బహుబలి పాత్ర నాయకత్వ లక్షణం బయటపడుతుంది. యుద్ధరంగంలో ఉంటే చావు తప్పదనుకుని సైన్యం పరుగులు తీస్తున్న చివరి క్షణాల్లో బహుబలి ”అసలు మరణం […]
నాయకుడు కూడా ఒక మనిషే. కానీ నాయకుడిగా ఉండాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. సంక్షోభసమయంలోనూ సమూహానికి స్పూర్తి నింపే శక్తి నాయకుడిలో కనిపించాలి. బహుబలి సినిమా యుద్ధ పోరాటం జరుగుతుండగా ఒక దశలో బహుబలి సైన్యం వెన్నుచూపి పారిపోతుంది. కాళికేయ సైన్యం విజృంభణ ధాటికి బహుబలి సైన్యం చెల్లాచెదురై పరుగులు తీస్తుంది. అక్కడే బహుబలి పాత్ర నాయకత్వ లక్షణం బయటపడుతుంది. యుద్ధరంగంలో ఉంటే చావు తప్పదనుకుని సైన్యం పరుగులు తీస్తున్న చివరి క్షణాల్లో బహుబలి ”అసలు మరణం అంటే ఏంటి” అని సైన్యాన్ని బాహుబలి ప్రశ్నిస్తాడు. ”పారిపోవడమే మరణం, పోరాటాన్ని విరమించడమే మరణం” అంటూ సైన్యంలో మాయమైన మానసిక శక్తిని తిరిగి రప్పిస్తాడు. అదే నాయకత్వ లక్షణం. యుద్ధంలో నాయకుడంటే సైన్యం కంటే నలుగురిని ఎక్కువగా చంపడం కాదు. సైన్యంలో ధైర్యం నింపే లక్షణం ఉండాలి. బహుబలి క్యారెక్టర్ రాజుల కాలం నాటి కథ అయినప్పటికీ… ఇప్పటి రాజకీయాలకు కూడా అన్వయించవచ్చు.
తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే… ఎన్నికల సమయంలో మీ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తా అని నమ్మించిన పవన్ ఇప్పుడు మాట మార్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వల్లే కానప్పుడు నా ఒక్కడితో హోదా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నాయకుడిగా తనను తాను చూసుకోవాలనుకున్న పవన్ నోటి నుంచి రావాల్సిన మాటలు కావివి. వేల మంది సైన్యమే ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను అని బాహుబలి అనుకుని ఉంటే సీన్ ఎంత కామెడీగా మారిపోయేది?. ఇప్పుడు పవన్ సంగతి కూడా అలాగే తయారైంది. ఎన్నికలకు ముందు ప్రచారంలో పవన్ కల్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ గుర్తుందా?. ”చిమ్మచీకటి.. సరిగ్గా కనబడదు. రోడ్డంతా రాళ్లు.. దారి కన్పించదు. చెప్పుల్లేవు.. అయినా నడవాలి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి” అంటూ ఎన్నికల ప్రచారంలో కళ్లు పెద్దవి చేసుకుని పవన్ చెప్పారు. మరి ఇప్పుడేమైంది ఆ మొక్కవోని ధైర్యం?. చిమ్మచీకటి ఉన్నా సరే ముందుకుసాగాలన్న నీతి బోధలు ఏమయ్యాయి?. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పుడు పవన్ స్పందిస్తానంటున్నారు.
కేంద్ర పెద్దలేమైనా రాజకీయం తెలియని మూర్ఖులా?. హోదా ఇవ్వం అని నేరుగా చెప్పడానికి. అలా చెప్పి ప్రజల్లో చులకనవ్వడానికి!. ఈ మూడేళ్లే కాదు… ఇంకో పదేళ్లు గడిచినా సరే కేంద్రం నేరుగా హోదా ఇవ్వబోం అని చెప్పదు. అలా చెప్పే వరకు ఆగుదామని పవన్ కల్యాణ్ చెప్పడం అంటే ఫైటింగ్ సమయంలో నిద్రమాత్ర మింగి పడకసీన్ వేయడమే!. ఎంపీలు, ఎమ్మెల్యేలే ఏమీ చేయలేనప్పుడు హోదా కోసం నేను మాత్రం ఏం చేయగను అని చెప్పడం సరికాదు. తెలుగు ప్రజల తరపున ప్రశ్నిస్తా, ప్రభుత్వాలు తప్పు చేస్తే చీల్చేస్తా అని భీకర శబదాలు చేసిన పవన్ ఇలా చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. బహుశా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్న దానిపై నిర్ణయం చేసే శివగామి( బహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్ర) ఉండి ఉంటే పవన్ కల్యాణ్ పలాయన పదాలు విని ఆయనకు ఏ పోస్టు ఇచ్చేదో!.
Click on Image to Read: