సీటు సాధించినా కోర్సు పూర్తి చేయటం లేదు....ఐఐటిల్లో పెరుగుతున్న డ్రాపౌట్లు!
దేశంలోని ప్రముఖ ఐఐటి, ఐఐఎమ్ విద్యాసంస్థల్లో సీటుని సాధించడం తేలికకాదు. ఎంతో పోటీని, ఒత్తిడిని తట్టుకుని… ప్రతిష్టాత్మకంగా భావించే ఆయా సంస్థల్లో సీటు పొందాల్సి ఉంటుంది. అయితే ఇంత కష్టపడి సీటు సాధించినా చదువు పూర్తిచేయకుండా బయటకు వచ్చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఐఐటిలు, ఐఐఎమ్‌ల నుండి గత రెండేళ్లుగా రెండువేల మంది విద్యార్థులు చదువుని మధ్యలో ఆపేసినట్టుగా తెలుస్తోంది. ఢిలీ ఐఐటి నుండి అత్యధికంగా 2014-2016 మధ్యకాలంలో 699మంది విద్యార్ధులు చదువుని మధ్యలోనే వదిలేశారు. […]
దేశంలోని ప్రముఖ ఐఐటి, ఐఐఎమ్ విద్యాసంస్థల్లో సీటుని సాధించడం తేలికకాదు. ఎంతో పోటీని, ఒత్తిడిని తట్టుకుని… ప్రతిష్టాత్మకంగా భావించే ఆయా సంస్థల్లో సీటు పొందాల్సి ఉంటుంది. అయితే ఇంత కష్టపడి సీటు సాధించినా చదువు పూర్తిచేయకుండా బయటకు వచ్చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఐఐటిలు, ఐఐఎమ్‌ల నుండి గత రెండేళ్లుగా రెండువేల మంది విద్యార్థులు చదువుని మధ్యలో ఆపేసినట్టుగా తెలుస్తోంది.
ఢిలీ ఐఐటి నుండి అత్యధికంగా 2014-2016 మధ్యకాలంలో 699మంది విద్యార్ధులు చదువుని మధ్యలోనే వదిలేశారు. దీని తరువాత ఎక్కువగా డ్రాపౌట్లు ఉన్న విద్యా సంస్థలు ఖరగ్‌పూర్ ఐఐటి, బాంబే ఐఐటి. ఈ కోర్సులను మధ్యలో వదిలేసిన వారిలో చాలామంది పిహెచ్‌డి చేస్తున్నవారేనని బాంబే ఐఐటి డైరక్టర్ దేవాంగ్ ఖాఖర్ అన్నారు. పిహెచ్‌డి పూర్తి చేసేందుకు తగిన శక్తి సామర్ధ్యాలు లేకపోవటం వల్లనే ఇలా జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇక ఐఐఎమ్‌ల విషయానికి వస్తే డ్రాపౌట్ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.
2003-05 మధ్యకాలంలో 37మంది విద్యార్థులు చదువుని మధ్యలోనే ఆపేయగా, తరువాత రెండేళ్లలో అది 69కి పెరిగింది. 2014-16 నాటికి ఈ సంఖ్య 114గా ఉంది. సరిగ్గా చదవలేకపోవడమే ఇందుకు కారణమని కోల్‌కతా ఐఐఎమ్ ఫ్యాకల్టీ మెంబరు ఒకరు తెలిపారు. రాయ్‌పూర్ ఐఐఎమ్ నుండి రెండేళ్లలో అత్యధికంగా 20మంది చదువుని మధ్యలో ఆపేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి విద్యాసంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగా జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ఒక సెకండియన్ విద్యార్థిని మెంటర్‌గా ఇస్తూ ఐఐఎమ్-ఎ అనే ప్రోగ్రామ్‌ని ప్రవేశపెట్టారు. చాలా ఐఐఎమ్‌లలో ఇలాంటి పధకాలు ఉన్నాయి. పిల్లలకు మానసిక ధైర్యాన్నిచ్చి, మార్గనిర్దేశకం చేసేందుకు, వారు ఎమోషనల్‌గా బలహీనం కాకుండా ఉండేందుకు కౌన్సెలింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రిజర్వేషన్ ద్వారా సీట్లను పొందినవారే కాకుండా, ఇతర విద్యార్ధులు సైతం సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ విద్యాసంస్ధల ప్యాకల్టీ సభ్యులు చెబుతున్నారు. కొత్తలో రిజర్వేషన్ ద్వారా వచ్చిన విద్యార్థుల్లో జంకు, బిడియం, భయం లాంటి లక్షణాలు ఉన్నా వారి చదువు పూర్తయ్యే సరికి అవన్నీ మాయమై పోయేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ విద్యా సంస్థల వర్గాలు చెబుతున్నాయి.