రేప్‌ల ఘనతలో మనది నాల్గవస్థానం.... అమెరికాలో ఇళ్లలోనే అత్యాచారాలు!
ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మనదేశం నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. దీని తరువాత వరుస స్థానాల్లో దక్షిణ ఆఫ్రికా, స్వీడన్, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంక, ఇథోపియా ఉన్నాయి. అమెరికా…ఇంట్లోనే అత్యాచారాలు అమెరికాలో రేప్ బాధితుల్లో 91శాతం మహిళలు ఉంటే… 9శాతం పురుషులు ఉంటున్నారు. 99శాతం రేపిస్టులు మగవారు. మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన జాతీయ సర్వేలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 33మంది […]
ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో మనదేశం నాల్గవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. దీని తరువాత వరుస స్థానాల్లో దక్షిణ ఆఫ్రికా, స్వీడన్, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, శ్రీలంక, ఇథోపియా ఉన్నాయి.
అమెరికా…ఇంట్లోనే అత్యాచారాలు
అమెరికాలో రేప్ బాధితుల్లో 91శాతం మహిళలు ఉంటే… 9శాతం పురుషులు ఉంటున్నారు. 99శాతం రేపిస్టులు మగవారు. మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన జాతీయ సర్వేలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 33మంది పురుషుల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా అత్యాచార ప్రయత్నానికి, లేదా అత్యాచారానికి గురయినవారేనని తేలింది. ఇక్కడ బయట జరిగే రేప్లకంటే ఇంట్లో జరుగుతున్నవే ఎక్కువ.
దక్షిణ ఆఫ్రికా …ప్రపంచానికి రేప్‌ల రాజధాని
రేప్లు అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో రెండోస్థానంలో ఉంది. దీన్ని ప్రపంచానికి రేప్‌ల రాజధానిగా చెబుతారు. ఒక్క 2012లోనే 65వేల లైంగిక నేరాలు నమోదయ్యాయి. గత ఏడాది 4వేలమంది మహిళలను ఒక సర్వేలో ప్రశ్నించగా ప్రతి ముగ్గురిలో ఒకరు రేప్కి గురయ్యామని చెప్పారు. ఇక్కడి మెడికల్ రీసెర్చి కౌన్సిల్ చేసిన సర్వేలో 25శాతానికి పైగా మగవారు తాము రేప్ చేసినట్టుగా అంగీకరించారు. సగంకంటే ఎక్కువమంది తాము ఒకరికంటే ఎక్కువమందిని రేప్ చేశామని చెప్పారు. ప్రతి నలుగురిలో ఒకరు టీనేజీలోనే ఈ నేరానికి పాల్పడ్డామని ఒప్పుకున్నారు. పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ రేప్ నేరానికి రెండేళ్ల శిక్ష విధిస్తారు.
స్వీడన్…వేగంగా పెరుగుతున్న లైంగిక నేరాలు
యూరప్ దేశాల్లో స్వీడన్లోనే రేప్లు ఎక్కువ. ఇక్కడ ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు అత్యాచార బాధితురాలే. 2009లో ఇక్కడ 15,700 లైంగిక నేరాలు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8శాతం పెరిగాయి. 2009లో అంతకుముందు పది సంవత్సరాలతో పోలిస్తే…లైంగిక నేరాలు 58శాతం పెరిగాయి.
భారత్…తెలిసినవారే కబళిస్తున్నారు!
భారత్లోనూ లైంగిక నేరాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ అత్యాచారం అనేది మహిళల పట్ల జరుగుతున్న సాధారణ నేరంగా మారిపోయింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2012లో భారత్లో 24, 923 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇంకా నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసుల్లో 24,470 కేసుల్లో నేరస్తులు తండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారే కావటం గమనార్హం. 98శాతం కేసుల్లో బాధితురాలికి నేరస్తుడు తెలిసినవాడే అయి ఉంటున్నాడు. ప్రతి 22 నిముషాలకు ఒక రేప్ కేసు నమోదవుతోంది.
యుకె…అభివృద్ధిలో గొప్పలు…మహిళలకు తప్పని తిప్పలు
అభివృద్ధి చెందిన ఈ దేశంలో అత్యాచారాలూ ఎక్కువే. 2013 జనవరిలో ఇక్కడి న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ స్టాటిస్టిక్స్ సంస్థ, హోమ్ శాఖ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇంగ్లండ్ వేల్స్ల్లో ప్రతి ఏటా దాదాపు 85వేల మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఏటా నాలుగు లక్షల మంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒక రకంగా లైంగిక హింసను భరించినవారే.
జర్మనీ…అత్యాచారాలూ…హత్యలు!
జర్మనీ టెక్నాలజీలో ముందడుగు వేస్తున్న దేశంగా చెప్పుకుంటున్నా మానవత్వంలో ఎంత వెనుక బడి ఉందో అక్కడి అత్యాచారాల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో… ఇప్పటివరకు 2లక్షల 40వేలమంది మహిళలు, అమ్మాయిలు రేప్ నేరాల్లో ప్రాణాలు కోల్పోయారు. జర్మన్ కేథిలిక్లు రేప్ బాధితులకు గర్భం రాకుండా మందులు తీసుకోవడాన్ని అనుమతించారు.
ఫ్రాన్స్…1980వరకు రేప్ నేరమే కాదు!
ఫ్రాన్స్లో 1980 వరకు రేప్ని నేరంగా పరిగణించేవారు కాదు. ఇక్కడ ఇటీవలే మహిళల రక్షణ విషయంలో దృష్టిపెడుతున్నారు. 1980లకు పూర్వం అత్యాచారాలకు 19వ శతాబ్దపు నాటి నైతిక విలువల సూత్రాల ప్రకారం శిక్షలు ఉండేవి. లైంగిక వేధింపులను నేరంగా పరిగణించే చట్టం 1992లోనే అమల్లోకి వచ్చింది. ఏటా 75వేలమంది అత్యాచారానికి గురవుతున్నారు. పదిశాతం మంది మాత్రమే పోలీసుల వరకు వెళుతున్నారు.
కెనడా…అత్యాచారాలు ఎక్కువ…ఫిర్యాదులు తక్కువ!
ఇక్కడ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ నమోదై ఉన్న రేప్‌ల సంఖ్య 25,16,918. అయితే ఇక్కడ ఆరుశాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దాన్ని బట్టి మొత్తం రేప్ నేరాల్లో ఇవి ఆరుశాతం మాత్రమేనన్న మాట. బ్రిటీష్ కొలంబియా న్యాయ సంస్ధ లెక్కల ప్రకారం ప్రతి 17మంది మహిళలల్లో ఒకరు రేప్కి గురవుతున్నారు.
శ్రీలంక…చట్టం పట్టుకోదు!
శ్రీలంకలో ప్రజా పోరాటం ముగిశాక కూడా భద్రతా దళాలు అత్యాచారాలు, హింసకు పాల్పడుతూనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం…సర్వేలో ప్రశ్నించినవారిలో 14.5శాతం మంది జీవితంలో ఏదోఒక సమయంలో రేప్ చేశామని చెప్పారు. రేప్ చేసిన మగవారిలో 96.5శాతం మంది ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనలేదని తెలుస్తోంది. 65.8శాతం రేపిస్టులు తమకు పశ్చాత్తాపంకాని, బాధగాని లేదని చెప్పారు. 64.9శాతం మంది రేపిస్టులు ఒకసారి కంటే ఎక్కువగా నేరానికి పాల్పడ్డారు.
ఇథోపియా…అమ్మాయిలను అపహరించి రేప్…పెళ్లి!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 60శాతం మంది మహిళలు ఈ దేశంలో లైంగిక హింసను ఏదోఒక రూపంలో భరిస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటం ఎక్కువ. ఇక్కడి మగవారు స్నేహితుల సహాయంతో అమ్మాయిలను అపహరించి తీసుకువెళ్లటం సర్వసాధారణ విషయం. ఇందుకు వారు గుర్రాలను కూడా ఉపయోగిస్తుంటారు. అపహరించిన అమ్మాయిని దాచిపెట్టి…ఆమె గర్భం ధరించేవరకు అత్యాచారం చేస్తారు. 11ఏళ్ల అమ్మాయిలను కూడా ఇలా ఎత్తుకుపోతుంటారు. ఇథోపియా మిలటరీపై కూడా అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.
Click on Image to Read: