మోడీతో ఢీ... ఆత్మగౌరవ నినాదంతో గుజరాత్ దళితుల పోరాటం!
గుజరాత్‌లోని ఊనాలో జులై 11న నలుగురు దళిత యువకులపై జరిగిన దాడి… రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా దళితులను ఏకం చేసి ఒక్క తాటిపైకి తెచ్చింది. ఊనాలో గోవు చర్మం వలిచారనే కారణంతో నలుగురు యువకులను తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. మనదేశంలో మతం పేరుతో జరుగుతున్న అరాచకాలకు, అమానవీయ ఘటనలకు అంతులేకుండా పోతున్నది. వ్యక్తిగత స్వార్థం, సౌలభ్యం కోసం రాక్షసదాడులకు పాల్పడే వారు పెరుగుతున్నారు. గో సంరక్షణ పేరుతో ఊనాలో పశుత్వం తాండవించింది. బిజెపి అధికారంలోకి […]
గుజరాత్‌లోని ఊనాలో జులై 11న నలుగురు దళిత యువకులపై జరిగిన దాడి… రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా దళితులను ఏకం చేసి ఒక్క తాటిపైకి తెచ్చింది. ఊనాలో గోవు చర్మం వలిచారనే కారణంతో నలుగురు యువకులను తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. మనదేశంలో మతం పేరుతో జరుగుతున్న అరాచకాలకు, అమానవీయ ఘటనలకు అంతులేకుండా పోతున్నది. వ్యక్తిగత స్వార్థం, సౌలభ్యం కోసం రాక్షసదాడులకు పాల్పడే వారు పెరుగుతున్నారు. గో సంరక్షణ పేరుతో ఊనాలో పశుత్వం తాండవించింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి దాడులు సర్వత్రా జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గో రక్షకుల పేరుతో పుట్టుకొస్తున్న వారు…గో సంరక్షణ పేరుతో తమ స్వలాభం చూసుకుంటున్నారు.
తన సొంత రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా, వీటిని ఖండించడానికి ప్రధాని మోడీకి 25రోజుల కాలం పట్టింది. ఆయన ఈ అరాచకాలను కేవలం ఖండించడం కాకుండా గో రక్షకులుగా పేర్కొంటున్న వారిని అసాంఘిక వ్యక్తులుగా చెప్పాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు…ప్రతి ఎన్నికలకు ముందు గో రక్షణ గురించి ప్రసంగాలు చేసే మోడీ… అలా ఎలా చేయగలరు మరి. అసలు జంతు రక్షణ అనేది ఒక సాధారణ అంశంగా భావించకుండా ప్రతిసారి గో రక్షణని ప్రత్యేక అంశంగా తీసుకువస్తున్నారు. ఇది హిందుత్వ శక్తులకు హిందువులను, ఇతర వర్గాలవారినుండి వేరుచేసేందుకు ఒక ఎజెండాగా మారిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కూడా గోవులను, పందులను చంపడం అనే అంశమే… మతపరమైన అల్లర్లకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను వెల్లడించిన రచన, సీరియల్ తమస్…గుర్తుంది కదా?
ఇప్పుడు మనం మళ్లీ మతం పేరుతో జనం కొట్టుకున్న ఆనాటి రోజుల్లోకి, స్వాతంత్య్రం ముందు రోజుల్లోకి వెళ్లిపోయాం. ముజఫర్‌నగర్, దాద్రి ఘటనలు కళ్లముందు కదలాడుతుండగానే ఊనా ఘటన మనముందుకొచ్చింది. వందల సంవత్సరాలుగా సహనంతో భరిస్తున్న దళితులకు ఇలాంటి పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే గుజరాత్ దళితులు ఒక అంతిమ నిర్ణయానికి వచ్చారు. జరిగిందేదో జరిగిపోయింది. ఎలాగైనా స్వేచ్ఛను పొందాలని, సంకెళ్లను వదిలించుకోవాలని వారు భావిస్తున్నారు. హిందూ మతం తమ తలలపై మోపిన భారాన్ని దించుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఆవులు ఇతర జంతువుల చర్మాలను ఒలవటం, చేతులతో మురికిని ఎత్తిపోయటం లాంటి హీనమైన పనులకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బతకాలని ఆశిస్తున్నారు.
ఇప్పుడు దళితులకు ఎవరైనా అండగా నిలవటం అంటే… మానవత్వంలో వారికున్న నమ్మకాన్ని రుజువు చేసుకోవడమే. అందుకే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ల నుండి కూడా మరిన్ని దళిత సంఘాలు వచ్చి దళిత అస్థిత్వ ర్యాలీలో చేరుతున్నాయి. దళితుల ఆత్మగౌరవం నినాదంతో ఈ ర్యాలీ ఈ నెల 5న అహ్మదాబాద్‌లో మొదలైంది. ఇది ఆగస్టు 15కి ఊనా చేరుకుని అక్కడ దళితుల శక్తిని లోకానికి నిరూపించనుంది. దళితుల ఆగ్రహాన్ని, ఆత్మగౌరవాన్ని దిక్కలు పిక్కటిల్లేలా చాటనుంది. దళితులు ముక్తకంఠంతో గుజరాత్ నమూనా…విఫలమైందని చెప్పబోతున్నారు. ఇంతకుముందు ఎన్నడూ వినబడని…ఆవు తోకని మీరే పట్టుకోండి… మా భూమిని మాకివ్వండి… అనే నినాదం అక్కడ మారుమ్రోగుతున్నది.
దేశంలోనే కాదు…ప్రపంచవ్యాప్తంగా దళితులకు అండదండలు లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, హేతువాదులు, మేధావులు, విద్యార్థులు దళితుల పోరాటానికి తమ మద్ధతుని ప్రటిస్తున్నారు. జర్మనీ, కెనడా, మెల్ బోర్న్ లనుండి దళితులపై దాడులను నిరసిస్తూ ఖండనలు వెలువడుతున్నాయి. మానవతావాదులు దళితులకు అండగా నిలుస్తున్నారు. కొంతమందయితే ఈ అకృత్యాలకు అద్దం పట్టేలా హిందూ తాలిబన్…అని కూడా వర్ణిస్తున్నారు.
జవనరి 17న హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికా వేముల 14వ తేదీన దళిత్ మార్చ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ 70వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున…శతాబ్దాలుగా సంకెళ్లతో బానిసత్వాన్ని అనుభవిస్తున్నవారు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దిశగా అడుగులు వేయటం కనబడుతోంది.
Click on Image to Read: