ఇంతకీ నంది అవార్డులను… ఏ తెలుగు రాష్ట్రం ఇవ్వాలి?
ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత పరిష్కారం కాని సమస్యల్లో ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు కూడా ఉన్నాయి. వీటిని కొన్ని సంవత్సరాలుగా నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై చర్చించేందుకు ఈ ఏప్రిల్‌లో ఒక కమిటీని సైతం నియమించింది. గతనెలలో జరిగిన మీటింగ్‌లో…తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో కనుక…2014, 2015 అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవచ్చని, అంతకుముందు పెండింగ్‌లో ఉన్న 2012, 2013 అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే సరిపోతుందనే […]
ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత పరిష్కారం కాని సమస్యల్లో ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు కూడా ఉన్నాయి. వీటిని కొన్ని సంవత్సరాలుగా నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై చర్చించేందుకు ఈ ఏప్రిల్‌లో ఒక కమిటీని సైతం నియమించింది. గతనెలలో జరిగిన మీటింగ్‌లో…తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో కనుక…2014, 2015 అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవచ్చని, అంతకుముందు పెండింగ్‌లో ఉన్న 2012, 2013 అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే సరిపోతుందనే అనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే 2016 అవార్డులను ఎవరు ఇవ్వాలనే ప్రశ్న అలాగే ఉండి పోయింది. దీనిపై రెండు రాష్ట్రాలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని సినీరంగాలవారు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు అనే పేరుని వినియోగిస్తుంటే….తెలంగాణ ప్రభుత్వం ఈ పేరుని మార్చే ఆలోచనలో ఉంది. గత నెలలో జరిగిన సమావేశంలోనే… నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లాగే తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డుల పేరుతో ఇవ్వవచ్చనే సలహాని కమిటీలోని ఒక సభ్యుడు ఇచ్చారు. దీనిపై కమిటీ మళ్లీ చర్చించనుంది.
రాష్ట్రాలు రెండుగా విడిపోయినా సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ సినిమాలు నిర్మించడం, విడుదల కావటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, నూతనంగా తాము అవార్డులను ఇవ్వటం మొదలుపెడితే ఏ సినిమాలు, ఏ నటులకు అవార్డులు ఇవ్వాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇవన్నీకాకుండా రాష్ట్రాలు రెండున్నా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సంఘం ఒకటే పనిచేస్తోంది. సెన్సార్ బోర్డు వారి ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండటం వలన సినిమాలు ఇక్కడే సెన్సారవుతున్నాయి. మొత్తానికి సినిమా పరిశ్రమని విడగొట్టి అవార్డులు ఇవ్వటం రెండు రాష్ట్రాలకు సయామీ (అవిభక్త) కవలలను విడగొట్టినంత కష్ట సాధ్యంగా మారేలా ఉంది.