ఇంగ్లీషు రాలేదని ఒత్తిడి... శ్రీచైతన్య కాలేజి విద్యార్థి హాస్టల్లోనే ఆత్మహత్య!
చదువులకోసం పిల్లలు తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి…అనే ప్రశ్నకు ఇంకా మనదగ్గర సమాధానం లేదు. చదువుల ఒత్తిడితో పిల్లలు ఉరికొయ్యలకు….బదులులేని ప్రశ్నల్లా వేలాడుతున్నారు. పదివరకు తెలుగుమీడియంలో చదువుకుని, ఇంటర్లో ఇంగ్లీషు మీడియంలో చేరిన ఓ విద్యార్థికి…ఇంగ్లీషు రాకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిన పనిలేదని ఎవరూ ధైర్యం చెప్పలేకపోయారు. అందుకే ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఖమ్మంలోని శ్రీచైతన్య కాలేజిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, నూతన్‌కల్ మండలం, విరసనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ […]
చదువులకోసం పిల్లలు తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి…అనే ప్రశ్నకు ఇంకా మనదగ్గర సమాధానం లేదు. చదువుల ఒత్తిడితో పిల్లలు ఉరికొయ్యలకు….బదులులేని ప్రశ్నల్లా వేలాడుతున్నారు. పదివరకు తెలుగుమీడియంలో చదువుకుని, ఇంటర్లో ఇంగ్లీషు మీడియంలో చేరిన ఓ విద్యార్థికి…ఇంగ్లీషు రాకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిన పనిలేదని ఎవరూ ధైర్యం చెప్పలేకపోయారు. అందుకే ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
శనివారం ఖమ్మంలోని శ్రీచైతన్య కాలేజిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, నూతన్‌కల్ మండలం, విరసనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ డూప్‌లా, అనసూర్యల కుమారుడు వీరన్న ఖమ్మంలోని శ్రీచైతన్య కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను కాలేజి హాస్టల్లో ఉంటున్నాడు. పదివరకు తెలుగుమీడియంలో చదివిన వీరన్నకు ఇంగ్లీషు భాష పట్టుబడలేదు. దాంతో అతను భయపడిపోయాడు. ఇటీవల సెలవులకు ఇంటికి వెళ్లినపుడు అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇంటి నుండి కాలేజికి వస్తూ పురుగుల మందు డబ్బా తెచ్చుకున్నాడు. శనివారం ఉదయం కాలేజి హాస్టల్లోనే పురుగుల మందు తాగాడు. తోటి విద్యార్థులు చూసి సమాచారం ఇవ్వటంతో కాలేజి యాజమాన్యం వీరన్నను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు అతను మరణించినట్టుగా చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఖమ్మం చేరుకుని కొడుకు మృతదేహం చూసి బోరుమని విలపించారు. మృతుని బంధువులు కాలేజి ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. విద్యార్థి స్థాయిని పట్టించుకోకుండా ఒత్తిడి పెడుతున్నారని, శ్రీ చైతన్య కాలేజి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని, విద్యార్థి తల్లిదండ్రులకు నష్టపరిషారం చెల్లించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాలేజి ఎదుట ఆందోళన చేశారు. అయితే కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసంపై పోలీసులు వీరన్న కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వారికి మద్ధతు తెలిపిన విద్యార్థి సంఘాల నేతలపై కేసులు నమోదు చేశారు.