సబ్జా గింజల్లో... ఎన్ని ఔషధ గుణాలో!
సబ్జా గింజలు మనందరికీ తెలుసు. తీపి తులసి, ఫాలుదా అని పిలిచే ఈ గింజల్లో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వీటికి, ఇళ్లలో పూజించే తులసికి సంబంధం లేదు. నల్లగా కన్నీటి బిందువు ఆకారంలో ఉండే ఈ గింజల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, శరీరానికి అవసరమైన కొవ్వులు, పీచు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కేలరీలు లేకపోవటం విశేషం. ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి. వీటిని నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గింజలు […]
సబ్జా గింజలు మనందరికీ తెలుసు. తీపి తులసి, ఫాలుదా అని పిలిచే ఈ గింజల్లో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వీటికి, ఇళ్లలో పూజించే తులసికి సంబంధం లేదు. నల్లగా కన్నీటి బిందువు ఆకారంలో ఉండే ఈ గింజల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, శరీరానికి అవసరమైన కొవ్వులు, పీచు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కేలరీలు లేకపోవటం విశేషం. ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి.
వీటిని నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గింజలు నమలడానికి వీలుగా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం రెండు టీస్పూన్ల సబ్జా గింజలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని వేడినీటిలో నానబెట్టి తీసుకోవటం వలన ఇవి బాగా ఉబ్బి, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చక్కగా విడుదల కావటమే కాకుండా జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజైములు ఉత్పత్తి అవుతాయి.
ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండటం వలన…ఈ ఆసిడ్లు శరీరంలో కొవ్వుని కరిగించే జీవక్రియని వేగవంతం చేస్తాయి. అంతే కాక ఇందులో ఉన్న పీచు ఆకలిని తగ్గిస్తుంది. ఈ కారణంగా సబ్జా గింజలు బరువుని తగ్గిస్తాయని చెప్పవచ్చు.
ఇవి శరరంలో వేడిని తగ్గిస్తాయి. వేసవిలో ఇవి మరింత మేలు చేస్తాయి.
మధుమేహంకి ఇవి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారే వేగాన్ని ఇవి నియంత్రించడం వలన మధుమేహం అదుపులో ఉంటుంది. గ్లాసు పాలల్లో ఈ గింజలను వేసుకుని తాగటం వలన ఆరోగ్యకరమైన చక్కని డ్రింక్‌ని తాగినట్టే.
రాత్రి నిద్రపోయే ముందు పాలలో వీటిని వేసుకుని తాగితే మలబద్దకం నివారణ అవుతుంది. ఇందులో ఉన్న ఒలేటైల్ ఆయిల్, పేగుల నుండి గ్యాస్‌ని బయటకు పంపి జీర్ణశక్తిని పెంచుతుంది.
పంక్షన్లలో ఎక్కువగా తిన్నపుడు పడే ఇబ్బందులను ఇవి తొలగిస్తాయి. శరీరంనుండి విషాలను బయటకు పంపుతాయి. కడుపు మంటని తగ్గిస్తాయి.
సబ్జా గింజలు తీసుకోవటం వలన దగ్గు జలుబు తగ్గుతాయి.
ఇవి చర్మం, జుట్టులకు సైతం మేలు చేస్తాయి. వీటిని పొడి చేసి కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి వాడితే ఆ మిశ్రమం చర్మవ్యాధులను విరుగుడుగా పనిచేస్తుంది. వీటిని పానీయంగా తీసుకోవటం వలన జుట్టుకి అవసరమైన విటమిన్ కె, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
అయితే పిల్లలు, గర్భిణులకు వీటిని ఇవ్వకూడదు. నీటిలో బాగా నానకపోతే పిల్లలకు గొంతుకు అడ్డుపడే ప్రమాదం ఉంది. గర్భిణుల్లో ఇవి ఈస్ట్రోజన్ ని తగ్గించే అవకాశం ఉంది. అందుకే గర్భిణులు, అనారోగ్యాలతో ఉన్నవారు వీటిని వాడేముందు డాక్టరుని సంప్రదించడం మంచిది.