నారాయణ కాలేజిలోనే... విద్యార్థిని అనుమానాస్పద మృతి!
రెండు రోజుల వ్యవధిలో నారాయణ కాలేజిలో మరో ఆత్మహత్య. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం శశికాంత్ నగర్‌లోని నారాయణ కాలేజిలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న గెడ్డం భారతి (17) అనుమానాస్పద స్థితిలో కాలేజిలోనే మృతి చెందింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం రాజోలు మండలం చింతపల్లికి చెందిన భారతి కాలేజి హాస్టల్లోనే ఉండి చదువుకుంటోంది. ఆమె తల్లి ఉపాధి కోసం కువైట్కు వెళ్లగా తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవటంతో భారతి, తాతయ్య గెడ్డం చంద్రశేఖర్ వద్ద […]
రెండు రోజుల వ్యవధిలో నారాయణ కాలేజిలో మరో ఆత్మహత్య. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం శశికాంత్ నగర్‌లోని నారాయణ కాలేజిలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న గెడ్డం భారతి (17) అనుమానాస్పద స్థితిలో కాలేజిలోనే మృతి చెందింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం రాజోలు మండలం చింతపల్లికి చెందిన భారతి కాలేజి హాస్టల్లోనే ఉండి చదువుకుంటోంది. ఆమె తల్లి ఉపాధి కోసం కువైట్కు వెళ్లగా తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవటంతో భారతి, తాతయ్య గెడ్డం చంద్రశేఖర్ వద్ద ఉంటోంది. ఆయనే భారతిని నారాయణ కాలేజిలో చేర్పించారు. భారతి గురువారం ఉదయం కాలేజి రీడింగ్ రూములో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కాగా అంతకుముందు రెండురోజుల క్రితమే ఆమె ఇంటికి వెళ్లి వచ్చింది.
పోలీసులకు సమాచారం అందటంతో వారు వచ్చి మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఒంటరితనం భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భారతి సుసైడ్ లేఖలో పేర్కొందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు చూపలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక తోటి విద్యార్థులను బయటకు రాకుండా చేసిన యాజమాన్యం, పోలీసుల తీరుపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మనవరాలు ఆత్మహత్యపై స్పందించిన భారతి తాతయ్య చంద్రశేఖర్ తన మనవరాలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్లిందని, ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తెల్లవారుజామున భారతి మరణించగా ఉదయం పదిదాటే వరకు తమకు సమాచారం ఇవ్వలేదని, తాము రాకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని చెబుతూ, కాలేజి యాజమాన్యంపై తమకు అనుమానం ఉందన్నారు. భారతి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎస్ఎఫ్ఐ, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్లో ఎలాంటి వసతులూ లేవని, ఆర్ఐఓ అనుమతి లేకుండానే కాలేజిని నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.