జక్కన్న సినిమా రివ్యూ
రివ్యూ: జక్కన్న రేటింగ్: 1.75/5 తారాగణం: సునీల్, మన్నర చోప్రా, కబీర్ దుహన్ సింగ్, సత్యప్రకాష్, పృధ్వీ, సప్తగిరి, కారుమంచి రఘు, సత్య, నాగినీడు, చిత్రం శ్రీను, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం: దినేష్ నిర్మాత: ఆర్. సుదర్శన్ రెడ్డి దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల వన్ నెంబర్‌లో వంకాయ ఉండదు… టెన్ నెంబర్‌లో టెంకాయ ఉండదు… ఈ సినిమాలో స్టోరీ ఉండదు…. సునీల్‌కు కష్టాలు తీరేలా లేవు. స్టోరీ ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నాడో, లేక అతనికి చెప్పిన […]
రివ్యూ: జక్కన్న
రేటింగ్: 1.75/5
తారాగణం: సునీల్, మన్నర చోప్రా, కబీర్ దుహన్ సింగ్, సత్యప్రకాష్, పృధ్వీ, సప్తగిరి, కారుమంచి రఘు, సత్య, నాగినీడు, చిత్రం శ్రీను, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: దినేష్
నిర్మాత: ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
వన్ నెంబర్‌లో వంకాయ ఉండదు… టెన్ నెంబర్‌లో టెంకాయ ఉండదు… ఈ సినిమాలో స్టోరీ ఉండదు….
సునీల్‌కు కష్టాలు తీరేలా లేవు. స్టోరీ ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నాడో, లేక అతనికి చెప్పిన స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ తప్పిదమో తెలీదు గానీ వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సినిమాలలో సగటు ప్రేక్షకుడిని నవ్వించే పాత్రలతో సాఫిగా వెళ్లిపోతున్న తన కెరీన్‌ను చూసి తనే నవ్వుకునేలా (ఈ సినిమాలు ఎలా చేశానురా బాబు) సాగుతుంది ఇప్పుడు ఆయన ప్రయాణం. జక్కన్నతోనైనా కొంతలో కొంతైనా కోలుకుంటాడు అనుకున్నారు సినీ క్రిటిక్స్. ఈ మద్యే రిలీజ్ అయిన అల్లరి నరేష్ సెల్ఫీరాజా సినిమా విషాదాన్ని మర్చిపోయేలోపే, సునీల్ జక్కన్నతో మరోసారి జనాల్ని జడిపించాడనే చెప్పాలి . ప్రపంచ యుద్ధాలనైనా అపవచ్చేమో కానీ తెలుగు సినిమాల్లో పంచ్ డైలాగ్‌ల పర్వాన్ని(పేరడీలను) ఆపలేకపోతున్నారు మన రైటర్స్, దర్శకులు అంటున్నారు సినిమా చూసిన సగటు ప్రేక్షకులు.
కథలోకి వెళ్తే చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన చీమ, పావురం, వేటగాడి కథను (వేటగాడి బారి నుంచి పావురాన్ని రక్షించడానికి చీమ చేసే సాయం) స్టోరిలైన్‌గా తీసుకుని సినిమా మొత్తం సాగదీసేశారు. స్కూల్‌లో మాస్టార్ (నాగినీడు.. సునీల్ తండ్రి) చెప్పిన కథను విన్న సునీల్‌కూడా జీవితంలో అలాగే ఉండాలనుకుంటాడు. ఎదుటివారు ఎంత చిన్న సాయం చేసినా దాన్ని మరిచి పోకుండా తనవంతుగా వాళ్లకు ఏదో ఒక సాయం చేయాలనుకుంటాడు. అలా చిన్నప్పుడు తనను చంపబోయిన డేగా (జి.వి.సుధాకర్ నాయుడు) అనే రౌడీ నుంచి కాపాడి సునీల్‌కి బైరాగి (కబీర్ దుహన్ సింగ్) అనుకోకుండా సాయం చేస్తాడు. అలా బైరాగి (కబీర్ దుహన్ సింగ్) చేసిన సాయానికి ప్రతిఫలంగా ఎలా సాయం చేస్తాడు, అదేవిధంగా హీరోయిన్‌ను (మన్నర చోప్రా) చూసి ప్రేమలో పడటం, ఆమెను లవ్‌లో పడేయడానికి ఎలా ముందుకు వెళ్తాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరిలైన్ మంచిదే కావొచ్చు కాని డైరెక్టర్ సినిమాను తెరకెక్కించడానికి అందులో కధనం లేదు. అతిచేస్తే ఏదైనా ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే జరిగింది. వరుసపెట్టి పంచ్ డైలాగ్‌లతో సినిమాను పరిగెత్తించాలనుకొని ప్రేక్షకులను డైలమాలో పడేశారు డైరెక్టర్.
కట్టప్ప (పృధ్వీ) పోలీస్ ఆఫీసర్‌గా ఎప్పటిలాగే పేరడీ డైలాగ్‌లను చెప్పినా, సప్తగిరి కుంగ్ఫూ మాస్టార్‌గా వేసిన పంచ్ డైలాగులు, పేరడీలకు మొదట్లో నవ్వు తెప్పించినా ఆ తరువాత వరుసపెట్టి చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.సినీమాలమీద కొంచెం అవగాహన ఉన్నఎవరైనా ఈ సినిమా చూస్తున్నప్పుడు పాత సినిమా స్టోరీలను కచ్చితంగా ఒకసారి నెమరు వేసుకుంటారు. ఒకటి బైరాగి పాత్ర టెంపర్ స్టోరిని గుర్తుచేస్తుంది. రెండోది అప్పుడెప్పుడో రవితేజతో శ్రీనువైట్ల తెరకెక్కించిన వెంకీ సినిమాను గుర్తుచేస్తోంది క్లైమాక్స్. సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒకపాట బాగుంది. పాటల చిత్రీకరణ మొత్తం విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించారు. లోకేషన్స్ బాగున్నాయి. హీరోయిన్ మన్నర చోప్రాకు ఈ సినిమాలో నటించడానికి పెద్ద స్కోప్ లేదు. హీరోయిన్ మన్నర చోప్రా కుంక్ఫూ స్టూడెంట్‌గా మెప్పించాలని చూసినా అక్కడ తగిన స్టోరీ లేదు. పాటలకు మాత్రమే పరిమితమైందని చెప్పాలి. ఈ సినిమాలో ఇంకా సత్యప్రకాష్, పృధ్వీ, సప్తగిరి, కారుమంచి రఘు, సత్య, నాగినీడు, చిత్రం శ్రీను, పోసాని కృష్ణమురళి పాత్రలు మొదట్లో నవ్వించారు గానీ చివరికి ప్రేక్షకుల ముందు వారే నవ్వుల పాలయ్యారు. అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్ ఉన్నా నటనతో పండించలేకపోయారు.
సినిమా మొత్తం సునీల్ చెప్పే ఒక్క మెయిన్ డైలాగ్ “నాకు సాయం చేస్తే వాళ్ల జీవితంతో నేను వ్యవసాయం చేస్తాను… దున్నేస్తాను”. థియేటర్‌లోని ప్రేక్షకులను కూడా సినిమా మధ్యలోనే వెళ్లిపోయేలా “దున్నిపడేశాడనే” చెప్పాలి. ఫైనల్‌గా ఏ సినిమాకైన కథ ముఖ్యం… ఇందులో అదే మిస్ అయింది.
– సర్వేశ్వర్ రెడ్డి