తల్లి సమాధిని కర్చీఫ్‌గా వేసిన టీడీపీ ఎమ్మెల్యే
అవినీతి అక్రమాల విషయంలో చంద్రబాబు వైఖరిని చూసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలకు ఎనలేని ఆత్మవిశ్వాసం కలుగుతోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు రెండేళ్ల కాలంలో అనేక నేరాలు చేసినా చంద్రబాబు వారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్న వైనం చూసి మరికొందరు ఎమ్మెల్యేలు స్పూర్తి పొందుతున్నారు. బరి తెగించి భూములను మింగేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూకబ్జాల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని […]
అవినీతి అక్రమాల విషయంలో చంద్రబాబు వైఖరిని చూసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలకు ఎనలేని ఆత్మవిశ్వాసం కలుగుతోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు రెండేళ్ల కాలంలో అనేక నేరాలు చేసినా చంద్రబాబు వారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్న వైనం చూసి మరికొందరు ఎమ్మెల్యేలు స్పూర్తి పొందుతున్నారు. బరి తెగించి భూములను మింగేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూకబ్జాల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. ప్రభుత్వ అవసరాల కోసం దీన్ని ఉంచారు. ఇందుకు సంబంధించి ఆర్‌సీ నంబరు బీ.119/2007 పేరిట మార్చి 14వ తేదీన 2007లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అయితే ఇందులోని 20.76 ఎకరాల నిషిద్ధ భూమిని పోలంరెడ్డి మింగేశారు. అది కూడా తప్పుడు పత్రాలతో పక్కాగా కాజేశారు. త్వరలో రిటైర్ అవుతున్న తహసీల్దార్ దగ్గరుండి ఈ తంతుకు సహకరించాడు.
మొత్తం 20. 76 ఎకరాల్లో పదిఎకరాల భూమిని తన తండ్రి వెంకురెడ్డి పేరు మీద, మిగిలిన భూమిని తన అత్త పద్మావతి పేరు మీద 2004లోనే కొన్నట్టు పత్రాలు సృష్టించేశారు. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేసింది మాత్రం చెప్పలేదు. నిషిద్ధ భూమి అని తెలిసినా స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు…ఈ ఏడాది ఏప్రిల్ 18న 1బీలో నమోదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యుల పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలను కూడా ఇచ్చేశారు. 2004 నుంచే ఈ భూమిని కబ్జా చేసేందుకు పోలంరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వైఎస్ హయాంలో పప్పులు ఉడకలేదు. కిరణ్‌కుమారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో చాలా సన్నిహితంగా పోలంరెడ్డి మెలిగారు. కానీ భూ కబ్జాకు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి సహకరించలేదని చెబుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో టీడీపీ ఎమ్మెల్యే అయిన పోలంరెడ్డి తన కోరలకు పదును పెట్టారు. తహసీల్దార్ సాయంతో 20.76 ఎకరాల భూమిని తండ్రి, అత్త పేరు మీద ధారదత్తం చేసుకున్నారు.
పోలంరెడ్డి మరో విచిత్రమైన కబ్జా కూడా చేశారు. నార్తురాజుపాళెంలో 60 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. సర్వే నెంబర్ 324/3లో మూడు ఎకరాల పోరంబోకు భూమి ఉండగా అందులో 60 సెంట్ల ముక్కను మింగేశారు. కబ్జా చేసిన భూమిలో సాధారణంగా విలువైన నిర్మాణాలు చేసేందుకు వెనుకాడుతారు. కానీ పోలంరెడ్డి మాత్రం ఏకంగా తన తల్లి కృష్ణమ్మ సమాధిని ఆ కబ్జా భూమిలోనే కట్టేశారు. కొద్ది రోజులకు తన చిన్నాన్న సమాధిని కూడా అక్కడే నిర్మించారు. ఈ పరిణామంతో నార్తురాజుపాళెం వాసులు ఆశ్చర్యపోతున్నారు. భూములు కబ్జా చేయడం ఏమిటి?. పవిత్రమైన తల్లి సమాధిని ఆ కబ్జా భూముల్లో నిర్మించడం ఏమిటిని ముక్కున వేలేసుకుంటున్నారు.
పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీటి విషయంలోనే కాదు తమ చెప్పుచేతల్లో ఉండని వారి ఆస్తులపైనా ఇలాగే కక్ష సాధిస్తుంటారు. అప్పటి వరకు తనకు అండగానిలిచిన వారైనా సరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే పోలంరెడ్డి తన పొగరు చూపిస్తారు. ఆయా కుటుంబాల భూములకు లేనిపోని లిటిగేషన్లు పెట్టి మానసికంగా హింసించి ఆనందిస్తుంటారన్న పేరు కూడా ఈయనకు ఉంది. అందులోనూ విలువైన భూములు కనిపిస్తే పోలంరెడ్డి తన మాట తానే వినరట. పోరంబోకు భూములన్నా పోలంరెడ్డికి భలే ఇష్టమని చెబుతుంటారు. తాజాగా ఆక్రమించిన 20.76 ఎకరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుంటే పోలంరెడ్డి మరిన్ని ప్రభుత్వ భూములను కబ్జా పెట్టేయడం ఖాయమని అధికారులే చెప్పుకుంటున్నారు.
Click on Image to Read: