పరువుపోతుందని...కన్నకూతురి హత్య!
పిల్లలు మాట వినకపోతే….ఏం చేయాలి…అనే విషయంపై మానసిక నిపుణులతో విస్తృతంగా చర్చలు జరపాల్సిన సమయం వచ్చింది. అలాగే పరువా, పిల్లలా…ఏది కావాలో తేల్చుకోవాల్సి వచ్చినపుడు… తల్లిదండ్రుల ఆలోచనా విధానం ఎలా ఉండాలి…. అనేది కూడా ఇప్పడు సమాజం ముందు పెద్ద ప్రశ్నగా నిలిచింది. వీటిని సామాజిక సమస్యలుగా భావించి పరిష్కారాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఓ తల్లి, కూతురు తమ మాట వినటం లేదని ఆమెని హతమార్చింది. పెళ్లయి ఒక పాప కూడా ఉన్న వ్యక్తితో […]
పిల్లలు మాట వినకపోతే….ఏం చేయాలి…అనే విషయంపై మానసిక నిపుణులతో విస్తృతంగా చర్చలు జరపాల్సిన సమయం వచ్చింది. అలాగే పరువా, పిల్లలా…ఏది కావాలో తేల్చుకోవాల్సి వచ్చినపుడు… తల్లిదండ్రుల ఆలోచనా విధానం ఎలా ఉండాలి…. అనేది కూడా ఇప్పడు సమాజం ముందు పెద్ద ప్రశ్నగా నిలిచింది. వీటిని సామాజిక సమస్యలుగా భావించి పరిష్కారాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.
విజయవాడలో ఓ తల్లి, కూతురు తమ మాట వినటం లేదని ఆమెని హతమార్చింది. పెళ్లయి ఒక పాప కూడా ఉన్న వ్యక్తితో 16ఏళ్ల తన కూతురు ప్రేమలో పడటంతో పరువుపోతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లి ఇంత దారుణానికి ఒడిగట్టింది. కృష్ణా జిల్లా, వీరులపాడు మండలం, జుజ్జూరుకి చెందిన మైసూరు జానీ, బీబీజానీలకు ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్న కుమార్తె నజ్మా నగరంలోని ఒక ఫర్నిచర్ షాపులో పనిచేస్తోంది. ఆమె దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. అతను వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో ఉంటున్నాడు.
ఈవిషయం తెలుసుకున్న బీబీ జానీ కూతురిని మందలించింది. వద్దని చెప్పింది. కానీ ఆమె వినలేదు. తన కూతురి బతుకు పాడుచేయవద్దని దీపక్‌ని సైతం వేడుకుంది. అతను కూడా వినకపోగా తమకు వివాహం చేయాలని లేదా తామిద్దరూ దిగిన ఫొటోలను నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం దీపక్ బండిమీద నజ్మా ఇంటికి వచ్చింది. ఆరోజు కూడా బీబీజానీ నజ్మాను తీవ్రంగా మందలించింది. దాంతో నజ్మా ఆమెను ఇష్టం వచ్చినట్టుగా తిట్టి తాను మారనని చెప్పింది. అంతే ఆవేశం, ఆక్రోశం తట్టుకోలేకపోయిన బీబీజానీ అదేరోజు నిద్రపోతున్న నజ్మా మొహంపై దిండుతో అదిమి ఆమె ప్రాణాలు తీసింది.
నజ్మా మరణంపై దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు మృత దేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించి తరువాత తల్లిదండ్రులకు అందజేశారు. వారు అంత్యక్రియలు జరిపించారు. అయితే గురువారం విలేకరులతో మాట్లాడిన బీబీజానీ జరిగిన విషయాలన్నీపూసగుచ్చినట్టుగా చెప్పింది. పరువుపోతుందనే కూతురిని చంపేశానని ఏడుస్తూ అంగీకరించింది. బీబీజానీ తానే హత్య చేసినట్టుగా చెప్పటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు