సదావర్తిపై మాణిక్యాల విచిత్రమైన సవాల్
ఏపీలో మండలస్థాయి ఊర్లలోనే సెంటు భూమి లక్షల్లో పలుకుతోంది. మరి చెన్నైనగరంలో భూముల విలువ ఎంతుంటుందో ఎవరైనా ఊహించగలరు. కానీ ఏపీ దేవాదాయల శాఖమంత్రి మాణిక్యాలరావు లెక్కలు చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. సదావర్తి భూముల అక్రమ వేలంపై ఎట్టకేలకు స్పందించిన మాణిక్యాలరావు… దానిపై వివరణ ఇచ్చారు. దాన్ని వివరణ అనేకంటే చంద్రబాబు ఒత్తిడితో చేస్తున్న బుకాయింపు అంటే బాగుంటుంది. ఎందుకంటే వేలం పాట నిబంధనల ప్రకారమే నిర్వహించామని చెప్పారు. అంతటితో ఆగలేదు. తొలుత ఎకరం 50లక్షలు అని […]
ఏపీలో మండలస్థాయి ఊర్లలోనే సెంటు భూమి లక్షల్లో పలుకుతోంది. మరి చెన్నైనగరంలో భూముల విలువ ఎంతుంటుందో ఎవరైనా ఊహించగలరు. కానీ ఏపీ దేవాదాయల శాఖమంత్రి మాణిక్యాలరావు లెక్కలు చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. సదావర్తి భూముల అక్రమ వేలంపై ఎట్టకేలకు స్పందించిన మాణిక్యాలరావు… దానిపై వివరణ ఇచ్చారు. దాన్ని వివరణ అనేకంటే చంద్రబాబు ఒత్తిడితో చేస్తున్న బుకాయింపు అంటే బాగుంటుంది.
ఎందుకంటే వేలం పాట నిబంధనల ప్రకారమే నిర్వహించామని చెప్పారు. అంతటితో ఆగలేదు. తొలుత ఎకరం 50లక్షలు అని నిర్ణయించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని 27లక్షలకు తగ్గించామని సెలవిచ్చారు. భూములు వేలం వేయగా 22 కోట్ల 44 లక్షలు వచ్చిందని … అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ఎవరైనా వస్తే తిరిగి వేలం పాట నిర్వహిస్తామన్నారు. ఇదే తాము విసురుతున్న సవాల్ అని మాణిక్యాలరావు ప్రకటించారు. ఇంతలోనే మరో షరతు కూడా పెట్టారు.
వేలంపాట రద్దు చేయాల్సిందిగా విపక్షాలు, ప్రజా సంఘాలు కోరుతుంటే ఆ పని చేయకుండా… 22 కోట్లకు మించి చెల్లించేవారుంటే ఆ మొత్తానికి బ్యాంకు గ్యారెంటీ చూపించిన తర్వాతే వేలంలో పాల్గొనాలని షరతు పెట్టారు. వచ్చిన 22 కోట్ల సొమ్ముతో ప్రభుత్వానికి సంబంధం లేదని దాన్ని ధర్మకర్తల మండలికే అప్పగిస్తామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన మాణిక్యాలరావు కూడా ఆలయ భూముల విషయంలో ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే…
చెన్నైలో భూమి కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే 50లక్షల నుంచి ఎకరం ధరను 27లక్షలకు తగ్గించామని చెప్పడం ఆశ్చర్యమే. ఎకరం 27లక్షలంటే… సెంటు భూమి 27వేల రూపాయలన్నమాట. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా?. చెన్నై నగరం వరకు ఎందుకు ఏపీ ఏ మండలస్థాయి గ్రామంలోనైనా ఆ ధరకు భూమి ఇప్పించగలరా?. పైగా బహిరంగవేలం వేశామంటున్నారు. కుంభకోణం గురించి పత్రికల్లో వచ్చే వరకు ఆ విషయం టీడీపీ పెద్దలకు మినహా ఆ పార్టీ నేతలకే తెలియదు. సత్రం నిర్వాహణ ధర్మకర్తలమండలి ఆధీనంలో ఉందని వచ్చిన డబ్బు వారికే ఇస్తామంటున్నారు. నిజంగా అదే జరుగుతుంటే మధ్యలో ఇంత హడావుడిగా రహస్యంగా వేలం వేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందో?. ఇక బ్యాంక్ గ్యారెంటీ చూపించి 22 కోట్లకు మించి చెల్లించే వారుంటే ముందుకు రావాలంటున్నారు. ప్రభుత్వం ఇంత బరి తెగించి వ్యవహారం నడుపుతున్న తర్వాత ప్రభుత్వానికి ఎదురు నిలిచి వేలం పాటలో ఎవరైనా పాల్గొనే సాహసం చేయగలరా?. ఇక సదావర్తి అంతే సంగతి.
Click on Image to Read: