ప్రేమ మందిరం
వేదవేదాంగాలు చదివిన పండితుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టాడు. ఎంతో శ్రద్ధగా ఎన్నో గ్రంథాల్ని సేకరించాడు. వాటిలోంచి విలువైనవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాడు. ఆ విలువైనవి కూడా అన్నీ కలిపితే ఒక బరువైన సంచి నిండుగా ఉండేవి. ఎక్కడికి వెళ్లినా ఆ పండితుడు వాటిని మోసుకెళ్లేవాడు. అది చాలా కష్టంగా ఉండేది కానీ ఆయన ఆ సంచిని వదిలి పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఏళ్ల తరబడి శ్రమించి, సాధించిన సంపద అది. ఎంతో […]
వేదవేదాంగాలు చదివిన పండితుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టాడు. ఎంతో శ్రద్ధగా ఎన్నో గ్రంథాల్ని సేకరించాడు. వాటిలోంచి విలువైనవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాడు. ఆ విలువైనవి కూడా అన్నీ కలిపితే ఒక బరువైన సంచి నిండుగా ఉండేవి. ఎక్కడికి వెళ్లినా ఆ పండితుడు వాటిని మోసుకెళ్లేవాడు. అది చాలా కష్టంగా
ఉండేది కానీ ఆయన ఆ సంచిని వదిలి పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఏళ్ల తరబడి శ్రమించి, సాధించిన సంపద అది. ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ పండితుడికి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది. తన జ్ఞానం తనకు ఎంతో ఆనందాన్ని వివేకాన్ని ఇస్తోంది. తన అధ్యయనం కావలసినంత పాండిత్యాన్ని ఇస్తోంది. ఎన్నో వాదోపవాదాల్లో తనని విజేతగా నిలిపింది. కానీ ఇవేవీ తనకు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని చూపడం లేదు. దైవసాక్షాత్కారానికి ఇవి ఉపయోగపడడం లేదు. దేవుణ్ణి చూడకుండా ఎంత జ్ఞానముండి ఏమి లాభం? అనుకున్నాడు.
ఆవూరి చివర ఒక గుడిసెలో ఒక సన్యాసి ఉన్నాడని దేవుడి గురించి అతనికి ఎంతో తెలుసునని, అతన్ని దర్శిస్తే సందేహాలన్నీ పటాపంచలవుతాయని ఎవరో చెప్పారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పండితుడికి ఆ సన్యాసిని దర్శిస్తే తనకు మార్గం దొరుకుతుందని ఆశ కలిగింది. ఎప్పట్లాగా తన గ్రంథాల సంచిని నెత్తిన పెట్టుకుని చెమటలు కక్కుకుంటూ ఆ సన్యాసి గుడిసె దగ్గరకి వెళ్లాడు. సన్యాసి ఆ పండితుణ్ణి చూసి ‘ఏమిటా సంచి?’ అన్నాడు. ‘మహా గ్రంథాల సారాంశం’ అన్నాడు. పండితుడు. ‘ఎందుకంత బరువు మోస్తావు? కిందకు దించు’ అన్నాడు సన్యాసి. పండితుడు కష్టపడి కిందకు దించాడు. కానీ ఆ సంచిపై చేయిపెట్టి కూచున్నాడు. సన్యాసి ‘ఎందుకు దానిపై చేయిపెట్టడం? చేయి కూడా తీసెయ్…’ అన్నాడు. పండితుడు సత్యాన్వేషి గనక చేయి తేసేశాడు. సన్యాసి ‘నీకేం కావాలి?’ అన్నాడు. పండితుడు ‘నేను దైవాన్ని దర్శించా’లన్నాడు. సన్యాసి ‘నీకు ప్రేమ గురించి తెలుసా? దాని మందిరాన్ని అన్వేషించు. దాన్ని కనిపెట్టు. తరువాత నా దగ్గరకి వచ్చావంటే నీకు దైవాన్ని చూపిస్తాను. అయితే ఆ అన్వేషణలో ఈ గ్రంథాలేవీ నీకు ఉపయోగపడవు’ అన్నాడు. పండితుడు సరేనని ఆ సంచిని సన్యాసి దగ్గరే వదిలేసి వెళ్లాడు. దేన్నయినా వదులుకోవచ్చు. కానీ జ్ఞానాన్ని వదులుకోవడం కష్టం. కానీ ఆ పండితుడు దాన్ని కూడా వదిలి పెట్టి వెళ్లాడు. అతను సాహసి. సంవత్సరం గడిచినా పండితుడు రాకపోయేసరికి అతణ్ణి వెతుక్కుంటూ సన్యాసి వెళ్లాడు.
పండితుడు కనిపించాడు. ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నాడు. ‘ఎందుకు నువ్వు దేవుణ్ణి తెలుసుకోడానికి మళ్లీ రాలేదు?’ అన్నాడు సన్యాసి. పండితుడు ‘స్వామీ! మన్నించండి. మీరు ప్రేమను అన్వేషించమన్నారు. నా హృదయమే ‘ప్రేమమందిరమని’ తెలుసుకున్నాను. దాంట్లోనే నేను దైవాన్ని దర్శించాను . అందుకని నేను మీ దగ్గరకు రాలేదు. నా జ్ఞానం నాకు అవసరం లేదు. ప్రేమస్వరూపులైన మనుషుల్లో దైవాన్ని చూస్తూ గడుపుతున్నాను’ అన్నాడు. సన్యాసి అతని పరివర్తనకు సంతోషించాడు.
-సౌభాగ్య