సీఎం రేసులో... హరీశ్ లేనట్లే!
సీఎం కేసీఆర్ తరువాత అసలు వారసుడు ఎవరు? అన్న వాదనకు తెరపడింది. కేసీఆర్ తరువాత సీఎం రేసు మొదలైతే.. తాను ఉండబోనని పరీక్షంగా భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తనకు మంత్రి పదవి చాలా పెద్దదని.. ఇంతకు మించి పదవి తనకు రాదని హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఉద్యమకాలం నుంచి తనను ఆదరించిన మెదక్ జిల్లా ప్రజల […]
BY sarvi30 Jun 2016 3:47 AM IST
X
sarvi Updated On: 30 Jun 2016 6:00 AM IST
సీఎం కేసీఆర్ తరువాత అసలు వారసుడు ఎవరు? అన్న వాదనకు తెరపడింది. కేసీఆర్ తరువాత సీఎం రేసు మొదలైతే.. తాను ఉండబోనని పరీక్షంగా భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తనకు మంత్రి పదవి చాలా పెద్దదని.. ఇంతకు మించి పదవి తనకు రాదని హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఉద్యమకాలం నుంచి తనను ఆదరించిన మెదక్ జిల్లా ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని, అందుకే కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.
హరీశ్ చేసిన వ్యాఖ్యలు అటు మీడియాలో.. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త చర్చకు దారితీశాయి. ఉద్యమ సమయం నుంచి హరీశ్ రావు పార్టీ అధినేత, తన మేనమామ అయిన కేసీఆర్ వారసుడిగా ప్రాచుర్యం పొందారు. అసెంబ్లీలో తన వాగ్దాటితో మామకు తగ్గ అల్లుడని, మాటతీరు, ముక్కుసూటితనంలో మామను మించిపోయాడని పార్టీశ్రేణులు, రాజకీయ ప్రత్యర్థులే ఆయన్ను అభినందించేవారు. పార్టీలో నెం.2గా ఎదిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ దగ్గరుండి సమస్యను పరిష్కరించే వ్యక్తిగా, ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో పార్టీ భారాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించారు. సమైక్య రాష్ట్రంలో 2010 తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ సాధించిన ప్రతి విజయం వెనక హరీశ్‌రావు ఉన్నాడన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య – స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక, తెలుగుదేశం నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -బాన్సువాడ ఉప ఎన్నికలో హరీశ్ రావు కుర్చీవేసుకుని మరీ పార్టీని గెలిపించుకుని వచ్చారు. కొండాసురేఖ రాజీనామా చేసిన శాయంపేట ఉప ఎన్నికలోనూ కారు పార్టీని గెలిపించడంలో, కొండా సురేఖను ఓడించడంలో హరీశ్‌దే కీలక పాత్ర.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, పార్టీ అధికారంలోకి వచ్చాక హరీశ్ కు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం మొదలైంది. పార్టీలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు కొంత ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తున్నాడన్న విమర్శలు ఊపందుకున్నాయి. వీటికి ఊతమిచ్చేలా వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో హరీశ్ పరిమితిని తగ్గించారు. పాలేరుకు దూరం పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్‌లోనూ పక్కనబెట్టారు. ఒక్క నారాయణఖేడ్ ఉప ఎన్నికలో మాత్రమే పూర్తి బాధ్యతలు అప్పగించారు. వీటన్నింటిని బేరీజు వేసిన అనంతరం పార్టీలో హరీశ్ ప్రాధాన్యం తగ్గుతోందని.. రాజకీయ విశ్లేషకులు, ఆయన అనుచరులు అనుమానించడం మొదలు పెట్టారు. మొత్తానికి తన జీవితంలోనే ఇదే అతిపెద్ద పదవి అని హరీశ్ చెప్పడంతో సీఎం రేసుపై చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదించారు హరీశ్.
Next Story