Telugu Global
NEWS

కోమ‌టిరెడ్డి కాదు.. నేనే సీఎం!

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం అన్నాడంట వెన‌క‌టికి ఎవ‌రో! పార్టీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేకున్నా.. ఎవ‌రికి వారు ముఖ్యమంత్రి అభ్య‌ర్థుల‌మంటూ ప్ర‌క‌టించుకుంటున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు. మొన్న‌టికి మొన్న ఢిల్లీ నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థి హామీ దక్కినందుకే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కారెక్కే కార్య‌క్ర‌మం మానుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా పెద్ద‌లు జానారెడ్డి కూడా తాను సీఎం రేసులో ఉన్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2019లో కాంగ్రెస్ […]

కోమ‌టిరెడ్డి కాదు.. నేనే సీఎం!
X
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం అన్నాడంట వెన‌క‌టికి ఎవ‌రో! పార్టీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేకున్నా.. ఎవ‌రికి వారు ముఖ్యమంత్రి అభ్య‌ర్థుల‌మంటూ ప్ర‌క‌టించుకుంటున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు. మొన్న‌టికి మొన్న ఢిల్లీ నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థి హామీ దక్కినందుకే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కారెక్కే కార్య‌క్ర‌మం మానుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా పెద్ద‌లు జానారెడ్డి కూడా తాను సీఎం రేసులో ఉన్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. తానే సీఎం అని ఆయ‌న‌కు ఆయ‌నే ప్ర‌క‌టించుకున్నారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ క‌దా! ఇలాంటి కామెంట్ల‌కు కొదువ లేదు. అందుకే, పార్టీ అధికారంలోకి రాగానే తానే సీఎం బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని చెప్పేశారు.
జానారెడ్డిపై కొంత‌కాలంగా పార్టీలో వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న కారెక్కే ప్ర‌య‌త్నాలు చేశార‌ని, రాజ్య‌స‌భ సీటు అడిగితే టీఆర్ ఎస్ ఇవ్వ‌నంద‌ని, అందుకే ఆయ‌న కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ వ్యాఖ్య‌ల‌పై జానారెడ్డి తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ట్లు స‌మాచారం. త‌న ప్ర‌మేయం లేకుండా కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని ఇలాంటి దుష్ప్ర‌చారాల‌కు దిగుతున్నారంటూ ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయారు. అందుకే, త‌న‌పై వ‌స్తోన్న అర్థంపర్థంలేని ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.
అందుకే, ముస్లింల రిజ‌ర్వేష‌న్ల అమ‌లు చేస్తే.. తాను అధికార పార్టీకి ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తాను అని స‌వాలు విసిరారు. తాజాగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తాను సీఎంనంటూ ప్ర‌క‌టించి త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు హెచ్చ‌రిక‌లు పంపారు. దీనివ‌ల్ల ఆయ‌న‌కు రెండు లాభాలు ఉంటాయి. మొద‌టిది త‌న‌ను టీఆర్ ఎస్ కోవ‌ర్టు అని ఆరోపించేవారికి అడ్డుక‌ట్ట వేయ‌డం. రెండోది పార్టీలో త‌న ప‌ట్టును నిలుపుకునేందుకు ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెట్టడం. అందుకే, జానారెడ్డి ఇలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప‌నిలోప‌నిగా…ఇటీవ‌ల త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన సొంత‌పార్టీ నేత‌ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపైనా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. సీఎం రేసులో తాను ఇప్ప‌టికే క‌ర్చీఫ్ వేసుకుని ఉన్నాన‌ని సంకేతాలు పంపారు. సీఎం అభ్య‌ర్థుల జాబితా వీరిద్ద‌రితోనే ఆగుతుందా.. క‌ర్చీఫ్‌లు వేసుకున్న వారి జాబితా మ‌రింత పెరుగుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
First Published:  24 Jun 2016 8:55 PM GMT
Next Story