Telugu Global
Cinema & Entertainment

అద్భుత నటి నిహారిక... కానీ కథ..?

టైటిల్ :  “ఒక మనసు” సినిమా రివ్యూ రేటింగ్: 2.75 తారాగణం :  నాగ శౌర్య, నిహారిక  తదితరులు సంగీతం : సునీల్ కాష్యాప్ దర్శకత్వం : రామరాజు గొట్టిముక్కల నిర్మాత : మదురా శ్రీధర్‌ రెడ్డి బాలివుడ్‌లో పెద్ద నటుల కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్లు చాలామంది వున్నారు. వాళ్లలో కరినా కపూర్‌, సోనం కపూర్‌, సోనాక్షి సిన్హాలకి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. వీళ్లు కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. నటనలో కూడా తీసిపోమని నిరూపించుకున్నారు. అయితే […]

అద్భుత నటి నిహారిక... కానీ కథ..?
X

టైటిల్ : “ఒక మనసు” సినిమా రివ్యూ
రేటింగ్: 2.75
తారాగణం : నాగ శౌర్య, నిహారిక తదితరులు
సంగీతం : సునీల్ కాష్యాప్
దర్శకత్వం : రామరాజు గొట్టిముక్కల
నిర్మాత : మదురా శ్రీధర్‌ రెడ్డి

బాలివుడ్‌లో పెద్ద నటుల కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్లు చాలామంది వున్నారు. వాళ్లలో కరినా కపూర్‌, సోనం కపూర్‌, సోనాక్షి సిన్హాలకి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. వీళ్లు కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. నటనలో కూడా తీసిపోమని నిరూపించుకున్నారు. అయితే వీళ్లంతా మొదటి సినిమాగా గ్లామర్‌ ఓరియంటెడ్‌నే ఎంచుకున్నారు. నాగబాబు కూతురు నిహారిక గ్లామర్‌ని కాకుండా నటననే మొదటి సినిమాలో ఎంచుకుంది.

తెలుగులో చిరంజీవి కుటుంబం నుంచి తొలి హీరోయిన్‌గా నిహారిక వచ్చింది. ఒక మనసు సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నిహారిక ఎంత గొప్పగా చేసిందంటే తెలుగు తెరకు మరో అద్భుతమైన నటి దొరికిందని చెప్పచ్చు. హీరోయిన్లుగా తెలుగు అమ్మాయిలు కనుమరుగై పోయిన కాలంలో చక్కటి తెలుగమ్మాయిగా నిహారిక వచ్చింది. కానీ ఈ సినిమా బావుందా అంటే బాలేదు. నిరాశపరిచింది. దీనికి కారణం డైరెక్టర్‌కి సినిమాపై పట్టులేకపోవడం.

భావుకత్వం అనేది పాయసంలాంటిది. కొద్దిగా తీసుకుంటే రుచిగా వుంటుంది. చెంబెడు తాగితే వెగటు పుడుతుంది. డైరెక్టర్‌ రామరాజు కూడా కథని మరిచిపోయి భావుకత్వంలో కొట్టుకుపోయి సినిమాని ముంచేసాడు. నిహారిక నాగశౌర్య ఎంత బాగా నటించినా సినిమా ఇబ్బందుల్లో పడింది.

కథలో పాయింట్‌ చాలా బలమైంది. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమ, అబ్బాయిది కూడా. అబ్బాయి రాజకీయాల్లో పైకి రావాలనుకుంటూ సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అబ్బాయి హింసాత్మక ధోరణి అమ్మాయికి నచ్చదు. ఒక కేసులో అబ్బాయి జైలుకెళతాడు. కథలోని సంఘర్షణ ఇది.

మద్రాస్‌ అని తమిళ సినిమా వుంది. హీరో రాజకీయాల్లో తిరుగుతూ వుంటాడు. హీరోయిన్‌కి అది ఇష్టముండదు. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగే కథ కాకుండా అనేక పాత్రలు వస్తూ వుంటాయి. అందుకే హిట్టయ్యింది.

ఒక మనసు సినిమాలో అసలు పాత్రలే వుండవు. ఇద్దరి మధ్యే కథ. అనేక సన్నివేశాల్లో ఇద్దరూ రిపీట్‌ విషయాలు మాట్లాడుతూ వుంటారు ఇది మైనస్‌. రావురమేష్‌, అవసరాల శ్రీనివాస్‌ వున్నా సినిమాకి ప్లస్‌ కాలేకపోయారు. ముగింపుకూడా చాలామందికి నచ్చదు.

మొదటి అరగంట సినిమా అద్భుతంగా వుంది. కథనం వేగంగా నడిచుంటే ఫలితం ఇంకోలా వుండేది. కానీ కథ ఆగిపోయి సహనానికి పరీక్షగా నిలుస్తుంది. వైజాగ్‌ అందాల్ని కెమెరా అద్భుతంగా చూపించింది. ఫొటోగ్రఫి, మ్యూజిక్‌ ఈ సినిమాకి ఎస్సెట్స్‌.

హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాల్లో వాళ్ళిద్దరూ ఎంత బావుంటారో బ్యాగ్రవుండ్‌ కూడా అంతే బావుంటుంది. అన్నీ బావున్నాయి కానీ లేనిదే వేగం. దీనికి దర్శకుడు రామరాజే కారకుడు.

ఇష్టంగా, స్వచ్ఛంగా ప్రేమించిన ఒక అమ్మాయి పడే సంఘర్షణని నిహారిక అద్భుతంగా చూపించింది. కళ్ళలోనే అనేక భావాలు ప్రకటించింది. చివరి సన్నివేశంలో కంటతడి పెట్టిస్తుంది. సరైన పాత్రలు ఎంచుకుంటే నిహారికకు అద్భుతమైన భవిష్యత్తుంది. సినిమా కొంచెం బోర్‌కొట్టినా నిహారిక నటనకోసం ఈ సినిమా చూడవచ్చు.

– జి.ఆర్‌. మహర్షి

First Published:  24 Jun 2016 9:38 AM IST
Next Story