హైదరాబాద్‌లో ముష్టియా!
ఖైరతాబాద్ చౌరస్తా.. ఆబిడ్స్.. బాలానగర్.. గచ్చిబౌలి సెంటర్.. పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల.. బిచ్చగాళ్లను చూసే ఉంటారు. ఒంటినిండా గాయాలతో.. మాసిన దుస్తులతో చూడగానే జాలివేసి చేతిలో ఉన్నది తోచినకాడికి దానం చేస్తాం. అయితే, అలా అడుక్కుంటున్నవారిలో ఎంతమంది అసలు బిచ్చగాళ్లు ఉన్నారు? అయినా… అడ్డుక్కోవడమే మనిషి దయనీయ స్థితికి పరాకాష్ట. అందులో అసలు నకిలీలేంటి? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఎందుకంటే నగరంలో ఉన్న బిచ్చగాళ్లలో నూటికి 98 శాతం నకిలీలేనట. వీరంతా సులువుగా డబ్బు సంపాదించాలన్న […]
BY sarvi23 Jun 2016 6:15 AM IST
X
sarvi Updated On: 23 Jun 2016 6:50 AM IST
ఖైరతాబాద్ చౌరస్తా.. ఆబిడ్స్.. బాలానగర్.. గచ్చిబౌలి సెంటర్.. పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల.. బిచ్చగాళ్లను చూసే ఉంటారు. ఒంటినిండా గాయాలతో.. మాసిన దుస్తులతో చూడగానే జాలివేసి చేతిలో ఉన్నది తోచినకాడికి దానం చేస్తాం. అయితే, అలా అడుక్కుంటున్నవారిలో ఎంతమంది అసలు బిచ్చగాళ్లు ఉన్నారు? అయినా… అడ్డుక్కోవడమే మనిషి దయనీయ స్థితికి పరాకాష్ట. అందులో అసలు నకిలీలేంటి? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఎందుకంటే నగరంలో ఉన్న బిచ్చగాళ్లలో నూటికి 98 శాతం నకిలీలేనట. వీరంతా సులువుగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతోనే బిచ్చమెత్తుకుంటున్నారట.. ఇంకా వీరిలో కోటీశ్వరులు కూడా ఉన్నారట.. వింటుంటే.. కళ్లు బైర్లు తిరుగుతున్నాయి కదా! ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలా.. చదవండి మరీ..!
బిచ్చగాళ్ల వార్షికాదాయం రూ.24 కోట్లు.. ఇది ఇటీవల విడుదలైన బిచ్చగాడు సినిమా వసూళ్ల లెక్క కాదు. హైదరాబాద్ నగరంలో ఏటా బిచ్చమెత్తుకుంటున్నవారి మొత్తం వార్షికాదాయం. వింటేనే..అమ్మో! అనిపిస్తోంది కదూ! మీరు నమ్మినా.. నమ్మకున్నా ఇది నిజం! నగరంలో బిచ్చమెత్తుకోవడం మంచి ఆదాయమార్గంగా మారింది. అందుకే, పేద, మధ్య, ధనిక (బిచ్చమెత్తుకుని ధనికులైనవారు) తరగతివారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారట. ముఖ్యంగా వీరిలో వికలాంగులు, చిన్నారులు తమ అవిటితనాన్ని, దయనీయ స్థితిని ఇతరులకు చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంతలేదన్నా… నగరంలో ప్రతి బిచ్చగాడు రోజుకు రూ.1,000-2000పైనే సంపాదిస్తున్నాడని జీహెచ్ఎంసీ అధికారుల గణాంకాలే చెబుతున్నాయి.
ముష్టియా.. ఈ పదం పోకిరి సినిమాలో బిచ్చగాడైన ఆలీ చెప్పే డైలాగ్ గుర్తొచ్చిందా..! నగరంలో బిచ్చగాళ్లు.. ఒకరకంగా మాఫియాను తలపిస్తున్నారు. ఏరియా వారీగా పంచుకుని, పాడుకుని సరిహద్దులు గీసుకున్నారు. అలా అని వీరు.. ఒక్క యాచక వృత్తికే పరిమితం కాలేదు. రోజంతా అడుక్కుని వచ్చాక.. ఆ డబ్బుని చీటీలు కడుతున్నారు. వడ్డీలకు తిప్పుతున్నారు. ఇంకా వ్యభిచారం, పంచాయతీలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరికి పునరావాసం కల్పిస్తామని జీహెచ్ ఎంసీ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తే.. ఒక్కరూ రావడం లేదంటే.. వీరు ఆదాయానికి ఎంతలా రుచిమరిగారో తెలిసిపోతుంది. అందుకే నగరంలో ఏ బిచ్చగాడికీ దానం చేయవద్దని మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బిచ్చగాళ్లు కనిపిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని.. కోరారు. నకిలీ బిచ్చగాళ్లను ఏరివేయడం, అసలైనవారికి పునరావాసం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరి మేయర్ కోరిక నెరవేరుతుందో ? లేదో? చూడాలి!
Next Story