ఎంత మంచివాడో!
తన ఆటోలో ప్రయాణించినవారు మర్చిపోయిన బ్యాగుని, వారికి అందించడానికి ఆ డ్రైవరు రెండుగంటలు శ్రమించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. గుడ్డు గుప్తా (24) అనే ఆటో డ్రైవర్ శనివారం సాయంత్రం తన ఆటోలో ఎవరో బ్యాగుని మర్చిపోయారని గుర్తించాడు. అందులో మూడువేల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు, బ్యాంకు పత్రాలు, ఇన్సూరెన్స్ కాగితాలు తదితర విలువైన వస్తువులు ఉన్నాయి. వెంటనే దాన్ని దాని యజమానికి అందించాలని అనుకున్నాడు. కుర్లా రైల్వే టెర్మినస్‌నుండి బాంద్రా […]
తన ఆటోలో ప్రయాణించినవారు మర్చిపోయిన బ్యాగుని, వారికి అందించడానికి ఆ డ్రైవరు రెండుగంటలు శ్రమించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. గుడ్డు గుప్తా (24) అనే ఆటో డ్రైవర్ శనివారం సాయంత్రం తన ఆటోలో ఎవరో బ్యాగుని మర్చిపోయారని గుర్తించాడు. అందులో మూడువేల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు, బ్యాంకు పత్రాలు, ఇన్సూరెన్స్ కాగితాలు తదితర విలువైన వస్తువులు ఉన్నాయి. వెంటనే దాన్ని దాని యజమానికి అందించాలని అనుకున్నాడు.
కుర్లా రైల్వే టెర్మినస్‌నుండి బాంద్రా –కుర్లా కాంప్లెక్స్కి తన ఆటోలో ప్రయాణించిన జంటదే ఆ బ్యాగు అయివుండవచ్చని భావించి వారిని వెతకటం మొదలుపెట్టాడు. ఆ ప్రాంత పరిధిలోని పోలీసులకు సైతం సమాచారం అందించాడు. వారి సహకారంతో వెతగ్గా చివరికి పదింటికి ఆ జంటని పట్టుకోగలిగాడు. బ్యాగుతో పాటు కళ్లముందు ప్రత్యక్ష్యమైన ఆటో డ్రైవర్ని చూసి బ్యాగు సొంతదారులు ముక్తర్ అహ్మద్ ఇద్రిసి ఆయన భార్య ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఇంటికి రాగానే బ్యాగు పోయిందని తాము గుర్తించామని, అయితే తిరిగి దొరుకుతుందని అనుకోలేదంటూ వారు ఆటో డ్రైవర్ గుప్తాకి కృతజ్ఞతలు తెలిపారు. అతని నిజాయితికి బహుమతిగా డబ్బు కూడా ఇవ్వబోయారు కానీ, గుప్తా నిరాకరించాడు. బ్యాగుని వదిలేసిన జంట ఆటో దిగగానే వెంటనే ఆటోలో ఎక్కిన వ్యక్తి బ్యాగుని గుర్తించినట్టుగా గుప్తా తెలిపాడు. బ్యాగు సొంతదార్లు దొరకటం పట్ల అతను ఆనందం వ్యక్తం చేశాడు.