ఆ నాన్నకు...472మంది కూతుళ్లు!
ఫాదర్స్ డే రోజున సాధారణంగా తండ్రులకు తమ కూతుళ్ల నుండి శుభాకాంక్షలు, బహుమతులు అందుతుంటాయి. మహేష్ సవానీ అనే తండ్రికి సైతం అలాగే అందుతాయి. కానీ కూతుళ్ల సంఖ్యలోనే ఇతర తండ్రులకు ఆయనకూ తేడా ఉంది. మహేష్‌కి ఏకంగా 472మంది కూతుళ్లున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింతగా పెరుగుతుంది…అందులో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా తండ్రులు లేని ఆడపిల్లలకు సహృదయంతో, మావవత్వంతో పెళ్లిళ్లు చేస్తున్న మహేష్ ఆ యువతులందరి మనసుల్లో తండ్రి స్థానంలో ఉన్నారు. అందుకే ఆయనకు […]
ఫాదర్స్ డే రోజున సాధారణంగా తండ్రులకు తమ కూతుళ్ల నుండి శుభాకాంక్షలు, బహుమతులు అందుతుంటాయి. మహేష్ సవానీ అనే తండ్రికి సైతం అలాగే అందుతాయి. కానీ కూతుళ్ల సంఖ్యలోనే ఇతర తండ్రులకు ఆయనకూ తేడా ఉంది. మహేష్‌కి ఏకంగా 472మంది కూతుళ్లున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింతగా పెరుగుతుంది…అందులో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా తండ్రులు లేని ఆడపిల్లలకు సహృదయంతో, మావవత్వంతో పెళ్లిళ్లు చేస్తున్న మహేష్ ఆ యువతులందరి మనసుల్లో తండ్రి స్థానంలో ఉన్నారు. అందుకే ఆయనకు వందలమంది కూతుళ్లున్నారు.
పదేళ్ల క్రితం తన సోదరుడు మరణించడంతో అతని ఇద్దరు కుమార్తెలకు తండ్రిస్థానంలో ఉండి కన్యాదానం చేశారు మహేష్. అప్పుడు ఆయన వయసు 37ఏళ్లు. ఆ సమయంలో… ఇలా తండ్రులు లేని ఆడపిల్లలు ఎంతో మంది ఉంటారు కదా…అనే ఆలోచన వచ్చింది మహేష్‌కి. దాంతో 2008 నుండి అలాంటి అమ్మాయిలకు అండగా నిలవటం మొదలుపెట్టారు. తండ్రిలేని అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయటమే కాకుండా, వారి వైవాహిక జీవితం సజావుగా ఉందా.. లేదా అనేది కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. గుజరాత్‌లోని రాపర్దా అనే గ్రామం మహేష్ స్వస్థలం. ఇతనికి వజ్రాల వ్యాపారం ఉంది. తాను జరిపించే ప్రతి పెళ్లికీ నాలుగు లక్షల రూపాయిలు ఖర్చుపెడుతుంటారాయన.
భర్తని కోల్పోయిన ఒక స్త్రీకి… తనకూతురి పెళ్లిచేయటం చాలా కష్టమని, ఆడపిల్ల పెళ్లంటే బంగారం వెండి, నూతన వస్త్రాలు, వంట సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు…ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయని….మహేష్ అంటున్నారు. ఈ పెళ్లిళ్లు చేయటంలో తనకెంతో ఆనందం, మానసిక తృప్తి ఉన్నాయంటున్నారు.
ఈ 2016వ సంవత్సరంలో 216మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలనే ప్రణాళికతో ఉన్నారు. కులమతాల ప్రసక్తి లేకుండా అవసరంలో ఉన్న ఆడపిల్లలకు ఆయన అండగా నిలుస్తున్నారు. 2014లో మహేష్ పెళ్లి చేసిన నహేదా బాను అనే యువతికి చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. ఆమె తనకు మహేష్ పప్పా తండ్రికంటే ఎక్కువని అంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయికి అలాంటి తండ్రి ఉండాలని ఆమె కోరుకుంటోంది. హీనా కథిరియా, మహేష్ గత ఏడాది వివాహం చేసిన యువతుల్లో ఒకరు. ఈమెకు ఆరేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. తమకు ఏ అవసరమున్నా మహేష్ నాన్న ఒక్క మెసేజ్ పెడితే చాలు పలుకుతారని ఆమె తెలిపింది.
తండ్రికి అర్థంగా నిలిచే గొప్పనాన్నలు చాలామంది ఉండవచ్చు కానీ తండ్రితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న మహేష్ నిజంగా అభినందనీయుడు.