వైమానిక యుద్ధ దళంలో… తొలి వనితలు వీరు!
భారత వైమానిక దళంలోకి మొట్టమొదటిసారిగా ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు అధికారికంగా ప్రవేశించారు. 83ఏళ్ల ఇండియన్ ఎయిర్‌ఫోర్సు చరిత్రలో యుద్ధ విమానాలకు మహిళా పైలట్లు ఎంపిక కావటం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పెరేడ్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయాన్ని ప్రకటించారు. అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్ అనే ఈ ముగ్గురు యువతులు వైమానిక శిక్షణని పూర్తి చేసుకున్నారు. వీరు త్వరలో యుద్ధ […]
భారత వైమానిక దళంలోకి మొట్టమొదటిసారిగా ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు అధికారికంగా ప్రవేశించారు. 83ఏళ్ల ఇండియన్ ఎయిర్‌ఫోర్సు చరిత్రలో యుద్ధ విమానాలకు మహిళా పైలట్లు ఎంపిక కావటం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పెరేడ్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్ అనే ఈ ముగ్గురు యువతులు వైమానిక శిక్షణని పూర్తి చేసుకున్నారు. వీరు త్వరలో యుద్ధ విమాన ఫైటర్ పైలట్లుగా కదనరంగంలో తమ సత్తా చాటనున్నారు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో వీరిని అధికారికంగా ఎయిర్ఫోర్సులోకి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్సు లోని వివిధ విభాగాల ఫ్లైట్ కేడట్ల ద్వారా వైమానిక శిక్షణని పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు యువతులకు ముందుగా బీదర్ (కర్ణాటక)లో అడ్వాన్స్డ్ జెట్ ట్రైనింగ్ ఇస్తారు. దాంతో వారికి సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను నడిపేందుకు అర్హత లభిస్తుంది. తాము విమానాల్లో ఒంటరిగా వెళ్లేందుకు తగిన శిక్షణని పొందామని, అలాంటి సాహసాలను ఆస్వాదించగలమని ఆ ముగ్గురు యువతులు తెలిపారు.
వీరిలో భావనా కాంత్ బెంగలూరులోని బిఎమ్ఎస్ ఇంజినీరింగ్ కాలేజిలో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో బిఇ చదివింది. మొదటి దశ శిక్షణ తరువాత ఫైటర్ విభాగంలోకి వెళ్లింది. మంచి సైనికురాలిగా పేరుతెచ్చుకుని దేశానికి పేరు తెస్తానంటోంది భావనా కాంత్. ఇక మోహనా సింగ్‌ది రాజస్థాన్. ఎయిర్‌ఫోర్సు స్కూల్లో చదువుకుంది. ఈమె తాతగారు ఏవియేషన్ రీసెర్చిలో పనిచేశారు. తనకు ఈ అవకాశం రావటం పట్ల తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని, దేశానికిసేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని మోహన చెబుతోంది. అవని చతుర్వేది జైపూర్‌లోని బనస్థలి యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌తో బెటెక్ పూర్తి చేసింది. కాలేజి రోజుల్లోనే ఫ్లయింగ్ క్లబ్లో మెంబర్‌గా ఉన్న ఆమె, ఆ స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరింది. దేశం తరపున పోరాడే అవకాశం రావటం తన అదృష్టంగా అవని పేర్కొంది. భారత వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్లుగా ఈ ముగ్గురి పేర్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి. వీరి ధైర్యసాహసాలు విజయాలు మరింత మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిద్దాం.