రంజాన్ పవిత్రమాసంలో...ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని..!
పదేళ్ల వైవాహిక జీవితం తరువాత… జీవితమంటే భర్త పిల్లలే అనుకుంటున్న మహిళ…హఠాత్తుగా భర్తనుండి విడిపోవాల్సి వచ్చింది. మూడుసార్లు తలాక్ చెప్పి, ఇక నీకూ నాకూ సంబంధం లేదు అని…అతను చెబుతుంటే ఆమెకేం చేయాలో పాలుబోలేదు. ఆమె పేరు రుబీనా. తలాక్ వ్యతిరేక ఆన్‌లైన్ పోరాటంలో భాగంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ఒక సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. రంజాన్ నెలంతా తలాక్ విధానానికి బలైపోయిన ఒక్కో ముస్లిం మహిళ జీవిత కథని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి […]
పదేళ్ల వైవాహిక జీవితం తరువాత… జీవితమంటే భర్త పిల్లలే అనుకుంటున్న మహిళ…హఠాత్తుగా భర్తనుండి విడిపోవాల్సి వచ్చింది. మూడుసార్లు తలాక్ చెప్పి, ఇక నీకూ నాకూ సంబంధం లేదు అని…అతను చెబుతుంటే ఆమెకేం చేయాలో పాలుబోలేదు. ఆమె పేరు రుబీనా. తలాక్ వ్యతిరేక ఆన్‌లైన్ పోరాటంలో భాగంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ఒక సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. రంజాన్ నెలంతా తలాక్ విధానానికి బలైపోయిన ఒక్కో ముస్లిం మహిళ జీవిత కథని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నది. నెలంతా సోషల్‌మీడియా ద్వారా వెలుగులోకి రానున్న 30 మంది తలాక్ బాధితుల్లో రుబీనా మొదటి వ్యక్తి.
రంజాన్ పవిత్ర మాసంలో, తలాక్ విధానానికి బలైపోతున్న మహిళలు, పిల్లల గురించి ఆలోచించాలని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ కోరుతున్నది. తమ ప్రచార ఉద్యమంతో ప్రభుత్వం స్పందించి తలాక్ విధానానికి స్వస్తి పలుకుతుందని దాని నిర్వాహకులు ఆశిస్తున్నారు. భార్య ప్రమేయం లేకుండా కేవలం నోటితో మూడుసార్లు తలాక్ అని చెప్పడంతోనే వివాహం ముగిసిపోయే ఈ ప్రక్రియ ముస్లిం మహిళలను ఎంతటి అభద్రతా భావంలోకి, దుస్థితిలోకి నెట్టివేస్తుందో వీరు చెబుతున్నారు. వాట్సప్, ఎస్ఎమ్ఎస్, స్కైప్, ఫేస్ బుక్ ల ద్వారా కూడా విడాకులు ఇచ్చేస్తున్న సందర్భాలు పెరుగుతుండగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున దీనిపై వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు.
రుబీనా విషయమే తీసుకుంటే…ఆమెకు 22 ఏళ్ల వయసులో పదేళ్ల క్రితం కరీంతో వివాహమైంది. పెళ్లయ్యాక అతను మెకానిక్ ఉద్యోగ నిమిత్తం దోహా వెళ్లాడు. ఆమె తన ఇద్దరు పిల్లలతో ముంబయిలోని బాంద్రాలో తన అత్తమామలతో కలిసి ఉండేది. వారి నుండి నిరంతరం హింస ఉన్నా భర్త ఆర్థికంగా కుదురుకుంటున్నాడనే ఆనందంతో భరించేది. రెండేళ్లకొకసారి అతను ఇండియా వస్తుండేవాడు. గత ఏడాది డిసెంబరులో భారత్ వచ్చిన కరీం, మూడుసార్లు తలాక్ చెప్పి, ఇక నీకూ నాకూ సంబంధం లేదన్నాడు. రుబీనాకు ఒక్కసారిగా జీవితం తల్లకిందులైనట్టుగా అనిపించింది. కానీ తరువాత ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఒక్కసారిగా తననుండి జీవితాన్ని లాగేసుకున్న తలాక్ విధానంపై పోరాడాలనుకుంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో తనూ ఓ బాగమైంది. తన భర్త ఎవరికీ ఏ సంజాయిషీ చెప్పకుండా, ముఖ్యంగా తన పిల్లలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తమని ఎలా వదిలేస్తాడని ఆమె ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం రుబీనా భర్త మరొక డబ్బున్న మహిళను వివాహం చేసుకుని ఆనందంగా ఉండగా ఆమె మాత్రం కష్టపడి తన పిల్లలను పోషించుకుంటోంది.