తిట్టిందెవరు.. క్షమాపణలు ఎవరివి?
ఊరంతా చాటింపేసినట్లు మైకులో.. బండ బూతులు తిట్టి.. తరువాత తీరిగ్గా నాలుగు గదుల మధ్య సారీ అని చెబితే ఎలా ఉంటుంది? అరికాలి మంట నెత్తికెక్కదా? తప్పు చేసింది ఒకరైతే.. వారి తరఫున మరొకరు సారీ అంటే ఎలా ఉంటుంది. ఈ కోపం రెట్టింపవదా? తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు సరిగ్గా ఇలాగే ఉంది. గతవారం మెదక్ జిల్లా కిష్టాపూర్‌లో జరిగిన బహిరంగ సభ సందర్భంగా.. సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ మీడియా ప్రతినిధులను నానా […]
BY sarvi8 Jun 2016 4:37 AM IST
X
sarvi Updated On: 8 Jun 2016 7:41 AM IST
ఊరంతా చాటింపేసినట్లు మైకులో.. బండ బూతులు తిట్టి.. తరువాత తీరిగ్గా నాలుగు గదుల మధ్య సారీ అని చెబితే ఎలా ఉంటుంది? అరికాలి మంట నెత్తికెక్కదా? తప్పు చేసింది ఒకరైతే.. వారి తరఫున మరొకరు సారీ అంటే ఎలా ఉంటుంది. ఈ కోపం రెట్టింపవదా? తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు సరిగ్గా ఇలాగే ఉంది. గతవారం మెదక్ జిల్లా కిష్టాపూర్‌లో జరిగిన బహిరంగ సభ సందర్భంగా.. సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ మీడియా ప్రతినిధులను నానా మాటలు అన్న సంగతి తెలిసిందే! ఇంకా చెప్పాలంటే.. విలేకరులను ఈ నా కొడుకులు అంటూ బూతులు తిట్టాడు. అంతటితో ఆగారా? అదీ లేదు.. ఈ నా కొడుకులు అమ్ముడుపోయారంటూ.. వ్యాఖ్యానించారు. మరోపక్క దామోదర అనుచరులు వెంటనే అక్కడున్న విలేకరులపై దాడికి పాల్పడ్డారు. పలు కెమెరాలను ధ్వంసం చేశారు. రిపోర్టర్లపై పిడిగుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే. ఇంతా చేస్తే.. కనీసం ఆ తరువాత అయినా.. ఆయన తన వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. కనీసం వివరణ ఇచ్చుకునే ప్రయత్నమూ చేయలేదు. అందుకే, దీనిపై మీడియా ప్రతినిధులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. దామోదర రాజనరసింహ తీరుపై పలువురు రాజకీయ నాయకులు, మేథావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నేత అయిఉండి.. ఇలాంటి భాష మాట్లాడటమేంటని సొంత పార్టీ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆరాతీసినట్లు సమాచారం.
ఉత్తమ్ తోపాటు పలువురు నాయకులు దామోదర్ కామెంట్లను తీవ్రంగానే పరిగణించినట్లు తెలిసింది. వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉత్తమ్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మరో సీనియర్ నేత అయిన మల్లురవి రంగంలోకి దిగారు. ఆరోజు తమ నాయకుడి ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను దురదృష్టకరమని అభివర్ణించిన ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పారు. రాజకీయ నాయకులంతా మీడియా ద్వారానే ప్రజలకు చేరవ అవుతారని మేం కూడా నమ్ముతున్నామన్నారు. ఈ విషయంపై ఉత్తమ్ కుమార్ అమెరికా నుంచి రాగానే మరోసారి ప్రకటన చేస్తామని తెలిపారు. ఏదేమైనా.. మల్లు రవి సంజాయిషితో విలేకరులు సంతృప్తిగా లేరు. బండబూతులు తిట్టి, దాడి చేయించినవారే క్షమాపణ చెబితే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
Next Story