Telugu Global
Family

ముగ్గురు దొంగల వ్యవసాయం

ముగ్గురు దొంగలు వుండేవాళ్ళు. వాళ్ళు కలిసే దొంగతనం చేసేవాళ్లు, సంపాదించింది ముగ్గురు కలిసే దాచేవాళ్ళు. యిట్లా ఎన్నో ఏళ్ళు గడిచాయి, ఈ మధ్య ఎన్నోమార్లు జైలుకు వెళ్ళడం, తిరిగిరావడం, మళ్ళీ కారాగారం యిలా కాలం సాగింది. కొన్నాళ్లకు వాళ్ళకు దొంగతనమంటే విసుగుపుట్టింది. అందరితో ఛీకొట్టించుకుంటూ ఆ దొంగబతుకు మానేద్దామనే నిర్ణయానికి వచ్చారు.’ఐతే ఏం చేద్దాం? అన్న ప్రశ్న వచ్చింది. మొదటి దొంగ, మన గ్రామంలో చూడండి అందరూ వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు. ఎవరికీ భయపడకుండా జీవనం […]

ముగ్గురు దొంగలు వుండేవాళ్ళు. వాళ్ళు కలిసే దొంగతనం చేసేవాళ్లు, సంపాదించింది ముగ్గురు కలిసే దాచేవాళ్ళు. యిట్లా ఎన్నో ఏళ్ళు గడిచాయి, ఈ మధ్య ఎన్నోమార్లు జైలుకు వెళ్ళడం, తిరిగిరావడం, మళ్ళీ కారాగారం యిలా కాలం సాగింది.

కొన్నాళ్లకు వాళ్ళకు దొంగతనమంటే విసుగుపుట్టింది. అందరితో ఛీకొట్టించుకుంటూ ఆ దొంగబతుకు మానేద్దామనే నిర్ణయానికి వచ్చారు.’ఐతే ఏం చేద్దాం? అన్న ప్రశ్న వచ్చింది.

మొదటి దొంగ, మన గ్రామంలో చూడండి అందరూ వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు. ఎవరికీ భయపడకుండా జీవనం గడుపుతున్నారు మనమూ అట్లా జీవిద్దాం అన్నారు.

రెండోదొంగ, ఏమిటి? మనం వ్యవసాయమా! చేయగలమా అన్నాడు మూడో అతను, ఎందుకు చెయ్యలేం పొలం కొందాం. గోధుమలు పండిద్దాం అన్నాడు. మొదటి దొంగ వ్యవసాయం చేద్దాం కానీ అందరూ చేసినట్లు మనం గోధుమల్నే ఎందుకు పండించాలి? యింకేదయినా పండిద్దాం అన్నాడు. వాళ్ళకు వ్యవసాయం చేతకాదు, ఏది ఎక్కడ పండుతుందో ఎలా వస్తుందో కూడా వాళ్ళకు తెలీదు.

రెండో దొంగ, అయితే మనం ఏది పండిస్తున్నామో ఎవరికీ తెలీకూడదు. తెలిస్తే రైతులు అదే పండిస్తే మనకు గిరాకీ వుండదు, ఈ విషయాన్ని రహస్యంగా వుంచుదాం, అన్నాడు.

మొదటి దొంగ, మనకు వుప్పు ఎంతో విలువైంది మనం వుప్పు పంటను వేస్తే ఎలా వుంటుంది? అన్నాడు,

మిత్రుని ఆలోచనెంతో భేషుగ్గా వుందని తక్కిన యిద్దరూ అనుకున్నారు. కానీ ఈ విషయం రహస్యంగా వుంచుతాము. దాచిన డబ్బు తీసి పొలం కొన్నారు, దున్నారు. అదినల్లరేగడి, సారవంతమయిన భూమి. ‘ఏ పంటపండిస్తున్నారు’ అని చుట్టుపట్ల రైతులు అడిగారు, ‘మీకెందుకు? ఏదో పంట పడిస్తాం’ అన్నారు. రైతులు దొంగలతో మనకెందుకులే అని వూరుకున్నారు.వుత్సాహం మాత్రం తగ్గలేదు.

దొంగలు రహస్యంగా బస్తాలలో ఉప్పు తరలించారు. రైతులు దూరం నించి చూస్తున్నారు కానీ అవి ఏమి బస్తాలో అంతుబట్టలేదు.

గింజలు నాటి వాళ్లు రాత్రింబవళ్ళు శ్రమించి ఉప్పు రాళ్లను నాటారు. మట్టి కప్పి పెట్టారు. పంట బ్రహ్మాండంగా పండుతుందని కలలు కన్నారు. రోజులు గడుస్తున్నాయి. ఎక్కడిపొలం అక్కడే వుంది. మొదట దొంగలు నిరాశ పడ్డారు. రెండు నెలలు గడిచిపోయాయీ.

చలికాలం వచ్చింది. మంచుపొగ వుదయాన్నే పరిసరాలు కమ్మేసేది. పొలం పై తెల్లటి మంచు బిందువులు పేరుకుని వుండేవి. దొంగలు ఒక ఉదయాన్నే పొలాన్ని చూసి పొంగిపోయారు. తమ కష్టం ఫలించ బోతోందని సంబర పడిపోయారు. ఎందుకంటే నల్లరేగడి పొలమంతా తెల్లటి మంచు బిందువులతో తళతళలాడుతోంది, ఉప్పుపంట పెరుగుతోందని దొంగలు ఉత్సాహపడ్డారు.

ఒకరోజు మధ్యాహ్నం పొలం దగ్గరికి వచ్చి చూసేసరికి పొలం తెల్లగా లేదు మంచుబిందువులన్నీ సూర్యకిరణాలకు మాయమయ్యాయి. ఆవిరయిపోయాయి కానీ తెలివి తక్కువ దొంగలు యిదంతా ఎవరో తాము లేనప్పుడు చేస్తున్నారని, తమ ఉప్పు పంటను రహస్యంగా వేసుకుపోతున్నారని అనుకున్నారు.

ఈ సంగతి కనిపెట్టి దొంగల్ని పట్టుకోవాలని దొంగ లనుకున్నారు. ఒక రోజు

ఉదయాన్నే తుపాకితో సిద్ధమై వచ్చారు. పావురాలు గుంపుగా పొలంలో వాలాయి. అయితే ఉప్పుదొంగలు యివన్నమాట అని మొదటి దొంగ తుపాకీ సిద్థం చేశాడు. అలికిడికి అవి ఎగిరాయి, ఒక పావురం రెండోదొంగ భుజం మీద వాలింది. మొదట దొంగ తుపాకీ పేలిస్తే అది రెండోదొంగ భుజానికి తగిలింది. పావురం ఎగిరిపోయింది. రెండోదొంగని యిద్దరూ మోసుకుని డాక్టరు దగ్గరకు వెళ్ళారు.

ఈ విషయం తెలిసిరైతులు వచ్చారు. దొంగల ఉప్పు సేద్యం గురించి తెలిసి రైతులు నవ్వుకున్నారు.

వ్యవసాయం తమవల్ల జరగదని తీర్మానించుకుని దొంగలు తిరిగి తమ వృత్తిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

– సౌభాగ్య

First Published:  2 Jun 2016 6:32 PM IST
Next Story