పురందేశ్వరి పర్యటనతో బాబుకు చిక్కులేనా?
ఏపీలో ప్రత్యేక హోదా అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవ్వడం సాధ్యం కాదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. మిత్రపక్షం బీజేపీ కూడా ఇదే మాట అంటోంది. విభజనకు ముందు నుంచి రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు హోదా వద్దంటూ ఆయనే కొత్త పాట పాడుతున్నారు. ఆయన తన డిమాండ్ ను ఎందుకు మార్చుకున్నారో గానీ.. ఈ విషయంతో ప్రజాకోర్టులో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టడంలో మాత్రం వైసీపీ సఫలీకృతమైంది. దీనికితోడు […]
BY sarvi2 Jun 2016 7:35 AM IST
X
sarvi Updated On: 2 Jun 2016 4:10 PM IST
ఏపీలో ప్రత్యేక హోదా అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవ్వడం సాధ్యం కాదని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. మిత్రపక్షం బీజేపీ కూడా ఇదే మాట అంటోంది. విభజనకు ముందు నుంచి రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు హోదా వద్దంటూ ఆయనే కొత్త పాట పాడుతున్నారు. ఆయన తన డిమాండ్ ను ఎందుకు మార్చుకున్నారో గానీ.. ఈ విషయంతో ప్రజాకోర్టులో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టడంలో మాత్రం వైసీపీ సఫలీకృతమైంది. దీనికితోడు బీజేపీ నాయకులు రాష్ట్రంలో మెల్లగా తామూ ఉన్నామంటూ అప్పుడప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు జేసేలా వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు తీవ్ర చికాకు కలుగజేస్తున్నాయని సమాచారం. తాజాగా ఇదే అంశంపై బీజేపీ నేత పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం.. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అంతేనా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్‌డీఏ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు చేసిన సహాయాలను గణాంకాలతో సహా చెబుతూ… రాష్ట్రంలో ఏడుచోట్ల పర్యటించనున్నట్లు ప్రకటించారు.
పురందేశ్వరి రాష్ట్రంలో ఏడు చోట్ల పర్యటించాలని ప్రకటించగానే.. తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. పురందేశ్వరి యాత్రలో కేంద్రం గురించి చెబితే పరవాలేదుగానీ, ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే మాత్రం తమ పార్టీకి చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చంద్రబాబుపై వైసీపీ మాటలదాడి మొదలు పెట్టింది. ఈ విషయంలో ఏం సమాధానం ఇవ్వలేక తెలుగుదేశం నేతలు నీళ్లు నములుతున్నారు. ఈ సందర్భంగా పుండుమీద కారం చల్లినట్లు పురందేశ్వరి తన రాజకీయ పర్యటనలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌లో ఆగ్రహ జ్వాలలు రేగుతాయని ఆందోళన పడుతున్నారు. రాష్ట్రంలో తమ పొత్తుతో గెలిచిన నాయకులు తమ వైఫల్యాలను పదే పదే ఎత్తి చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. పురందేశ్వరి పర్యటనలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మాత్రం… ఇరుపార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడే అవకాశం లేకపోదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Next Story