బీసీల కడుపుమండితే టీడీపీని పెకలిస్తారు: కేఈ ప్రభాకర్
రాజ్యసభ టికెట్ కేటాయింపులు టీడీపీలో చిచ్చు రాజేశాయి. తమకు బాబు తప్పకుండా సీట్లు కేటాయిస్తాడని ఇంతకాలం ఎదురుచూసిన కొందరు క్రమంగా తమ అసమ్మతిని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ… కర్నూలు జిల్లా సీనియర్ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ గురువారం కర్నూలు టీడీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బీసీలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. డిప్యూటీ సీఎం […]
BY sarvi2 Jun 2016 8:02 AM IST
X
sarvi Updated On: 2 Jun 2016 9:31 AM IST
రాజ్యసభ టికెట్ కేటాయింపులు టీడీపీలో చిచ్చు రాజేశాయి. తమకు బాబు తప్పకుండా సీట్లు కేటాయిస్తాడని ఇంతకాలం ఎదురుచూసిన కొందరు క్రమంగా తమ అసమ్మతిని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ… కర్నూలు జిల్లా సీనియర్ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ గురువారం కర్నూలు టీడీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బీసీలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి స్వయాన సోదరుడైన ప్రభాకర్ ధర్నాకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. ఈ సందర్భంగా ప్రభాకర్ చంద్రబాబును ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి చేరాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా పార్టీ కార్యకర్తలు నిస్తేజానికి గురికాకుండా అందరినీ ఒకగాటన తెచ్చామని, అలాంటిది ఇప్పుడు పదవులను మాత్రం ఎవరో కొట్టుకుపోతుంటే బీసీలు చూస్తూ ఊరుకోరని ఆయన మండిపడ్డారు. కర్నూలులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా తానే కట్టించానని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం తనకే కాదు.. బీసీ జాతికి అన్యాయం జరిగిందని అన్నారు. పార్టీలు మారితే పదవులు వస్తాయంటే.. ఈపాటికి ఎన్నో పార్టీలు మారేవాడినని, ఆ విషయం ఇప్పుడే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు
దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని కాదని, నిన్న గాక మొన్న వచ్చిన వారికి రాజ్యసభ టికెట్ ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారికి చంద్రబాబు మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల మూటలు అప్పజెప్పిన వారికి సీట్లు అప్పజెప్పారని వాపోయారు. ఇదే జిల్లాకు చెందిన బీసీ నేత బీటీ నాయుడికి రాజ్యసభ సీటు తప్పక వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో అనూహ్యంగా ఆ సీటును టీజీ వెంకటేశ్ ఎగరేసుకుపోయాడు. దీనిపై బీటీ నాయుడు మౌనంగానే ఉన్నారు. కానీ, ఆయన అనుచరులు, జిల్లా పార్టీ బీసీ నేతలు మాత్రం చంద్రబాబుపై భగ్గుమన్నారు. ఇది కచ్చితంగా బీసీలకు జరిగిన అన్యాయంగానే వారు భావిస్తున్నారు. ఇప్పటిదాకా దీనిపై బీటీ నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. కర్నూలు జిల్లాలో ఉన్న అసమ్మతిని మాత్రం తాజా రాజ్యసభ కేటాయింపులు బయటపెట్టాయి.
Next Story