ముగ్గురు గుడ్డివాళ్లు
మహేష్ శివభక్తుడు. ఉదయమే లేచి శివాలయానికి వెళ్ళి పూజలు చేసి భక్తితో శివార్చన చేసి భక్తులు కోరిన పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించేవాడు. పూజారిగా ఆచుట్టుపట్ల ప్రాంతాల్లో మంచిపేరు సంపాదించాడు. రోజూ చీకటిపడిన తరువాత ఇంటికి వెళ్ళేవాడు. భక్తులు ఇచ్చిన కానుకలు, బియ్యం వంటివే అతని ఆదాయం. దాంతోనే కాలం గడిపేవాడు. అతను, అతని భార్య ప్రశాంత జీవితం గడిపేవారు. అత్యాశాపరులు కారు. ఒకరోజు ఆ ప్రాంత జమీందారు ఆ ఆలయంలో అర్చనలు జరిపించడానికి వచ్చాడు. మహేష్ […]
మహేష్ శివభక్తుడు. ఉదయమే లేచి శివాలయానికి వెళ్ళి పూజలు చేసి భక్తితో శివార్చన చేసి భక్తులు కోరిన పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించేవాడు. పూజారిగా ఆచుట్టుపట్ల ప్రాంతాల్లో మంచిపేరు సంపాదించాడు. రోజూ చీకటిపడిన తరువాత ఇంటికి వెళ్ళేవాడు.
భక్తులు ఇచ్చిన కానుకలు, బియ్యం వంటివే అతని ఆదాయం. దాంతోనే కాలం గడిపేవాడు. అతను, అతని భార్య ప్రశాంత జీవితం గడిపేవారు. అత్యాశాపరులు కారు.
ఒకరోజు ఆ ప్రాంత జమీందారు ఆ ఆలయంలో అర్చనలు జరిపించడానికి వచ్చాడు. మహేష్ అంత పెద్దమనిషి వచ్చినందుకు ఆనందించాడు. ఆహ్వానించాడు. జమీందారు నాకు పిల్లలు లేరు. అందుకని శివార్చన కోసం వచ్చాను. దక్షిణగా ఈ వంద ఉంచండి అన్నాడు. వంద నాణేలు ఇచ్చాడు. మహేష్ పూజాదికాలు నిర్వర్తించి ‘అయ్యా! మీరు ఇచ్చిన ఈ ధనంలో పాతిక రూపాయలు ఒక పేదవాడికి ఇస్తాను’ అన్నాడు. జమీందారు సరేనన్నాడు.
మహేష్‌కు ఎప్పుడూ ఒక్కసారిగా అంత డబ్బు రాలేదు. అది చాలా పెద్దమొత్తమే. ఆ నాణేల సంచిని మోసుకుంటూ ఆ శుభవార్తను వివరించడానికి, భార్యను సంతోషపెట్టడానికి ఇంటికి బయల్దేరాడు. దారిలో అతనికి ఎదురుగా ఒక గుడ్డి బిచ్చగాడు వచ్చాడు.
మహేష్‌కు అతన్ని చూసి జాలి కలిగింది. వెంటనే అతన్ని ఆగమని ‘బాబూ! ఈరోజు గుడిలో ఒక పెద్ద మనిషి పూజ చేయించి వంద నాణేలు ఇచ్చాడు. దాంట్లోపాతిక రూపాయలు పేద వ్యక్తికి ఇస్తానని చెప్పాను. అందుకని నీకిస్తున్నాను, తీసుకో’ అన్నాడు.
ఆ గుడ్డివాడు ఆశ్చర్యపోయాడు. పాతిక నాణేలు తీసుకుని పరవశంతో తడిమాడు. అతనికీ జీవితంలో ఎప్పుడూ అన్ని రూపాయలూ ఒక్కసారిగా దొరకలేదు.
మహేష్ వెళ్ళబోతోంటే గుడ్డివాడి మనసులో ఈర్ష్య కలిగింది. నా దగ్గర పాతిక నాణేలే ఉన్నాయి. అతని దగ్గర డెబ్బయి ఐదు రూపాయలున్నాయి. అవన్నీ నాకే వస్తే ఎంత బావుంటుంది! ఈ ఆలోచన కలిగిన మరుక్షణం ఆ డబ్బును చేజిక్కించుకునే మార్గం వెతికాడు. మహేష్‌తో ‘అయ్యా! ఏం లేదు. మీ సంచిలో ఒకసారి చెయ్యిపెట్టి అన్ని రూకల్నీ ఒకసారి తడిమిచూస్తాను’ అన్నాడు. మహేష్ నవ్వుకుని ‘దాందేముంది, అలాగే కానీ అన్నాడు. గుడ్డివాడు తనని మోసం చేస్తాడని మహేష్ ఊహించనైనా లేదు.
గుడ్డివాడు మహేష్ సంచిలో చేయి పెట్టి ‘దొంగ దొంగ కాపాడండి’ అని అరిచాడు. చుట్టుపక్కల జనాలు పరిగెట్టుకుంటూ వచ్చారు. గుడ్డివాడు చూడండి ఇతను నా డబ్బులు తీసుకుని పారిపోదామనుకుంటున్నాడు’అన్నాడు.
మహేష్ విషయం వివరించడానికి ప్రయత్నించాడు.కానీ వినేదెవరు? ‘బుద్ధి లేదయ్యా పెద్దమనిషీ! పాపం గుడ్డివాడి డబ్బులు దోచుకోడానికి మనసెట్లా ఒప్పింది నీకు’ అని చీవాట్లు పెట్టి సంచి గుడ్డివాడికిచ్చి పంపారు.
ఈ హఠాత్ సంఘటనతో మహేష్ నివ్వెరపోయాడు. పుణ్యానికి పోతే పాపం వచ్చినట్లు ఉన్న డబ్బంతా పోగొట్టుకుని నివ్వెరపోయాడు. ఇంటికి వెళ్లాడు. అతని భార్య భర్తవాలకం చూసి ఏదో జరిగిందనుకుంది. మహేష్ జరిగిన కథ వివరించాడు.
అంతా విని అతని భార్య అతన్ని ధైర్యంగా ఉండమంది. ఆమె వివేకవంతురాలు. ‘ఇక్కడ బాధపడడానికేమీ లేదు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడు. పరీక్ష పెట్టాలనుకుని తీసుకున్నాడు. కానీ నువ్వు గుడ్డివాణ్ని వదలకు. వాడికి తగిన బుద్ధి చెప్పు’ అంది.
గుడ్డివాడు వంద నాణేల సంచితో ఊరి చివర పాడుపడిన భవనం దగ్గరికి వెళ్లాడు. మహేష్ మొత్తానికి అతని జాడ కనిపెట్టాడు. గుడ్డివాడికి ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్లూ గుడ్డివాళ్ళే. అతను తమ్ముళ్ళతో ఈ డబ్బును భద్రంగా ఎట్లా దాచాలో నాకు తోచడం లేదు. మీరిద్దరూ సగం సగం తీసుకుని భద్రపరచండి అన్నాడు. ఇద్దరికీ రెండుకోట్లు ఉన్నాయి. ఆ కోట్ల లోపల జోబులున్నాయి. వాటిల్లో చెరొక యాభయి రూపాయలు దాచి సూదిలో కుట్టేశారు. ఇక నిశ్చింతగా ఉండవచ్చనుకున్నారు. రాత్రయింది. ముగ్గురూ గాఢంగా నిద్రపోయారు. మహేష్ సమయంకోసం చూశాడు. బయటకి వెళ్ళి ఒక చీమల పుట్ట దగ్గర చీమల్ని పట్టి సీసాలో వేశాడు. తగినన్ని చీమల్ని సేకరించాకా నిద్రపోతున్న గుడ్డివాళ్ళల్లో చిన్నవాళ్ళయిన తమ్ముళ్ళపై ఆ చీమల్ని వదిలాడు. చీమలు కుట్టాయి. దురదతో వాళ్ళు గీక్కుంటూ లోపలికి వెళ్ళిన చీమల్ని చంపడానికి కోట్లు తీసి పక్కనపెట్టారు. మెల్లగా ఆ కోట్లు తీసుకుని మహేష్ ఉడాయించాడు. గుడ్డివాళ్ళు ఎంత వెతికినా కోట్లు దొరకలేదు. అన్నను లేపారు. అన్న తన డబ్బు పోయినందుకు నెత్తీనోరూ మొత్తుకున్నాడు.
గుడ్డివాడు సోదరులతో న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి ఎవరో తమ డబ్బు దొంగిలించారని, తమకు న్యాయం చెయ్యాలని మొరపెట్టుకున్నాడు. న్యాయాధికారి దొంగిలించిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి నిజానిజాలు వివరిస్తే క్షమాభిక్ష ప్రకటిస్తానని చెప్పాడు. ఆ విషయం చాటింపు వేయించాడు.
మహేష్ సూటిగా న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి జరిగింది వివరించి జమీందారు ఆడబ్బు ఇచ్చినట్లు కావాలంటే మనిషిని పంపి తెలుసుకోమన్నాడు. అన్నీ విచారించిన న్యాయాధిపతి మహేష్ నిరపరాధి అని తీర్మానించడమే కాక ముగ్గురు గుడ్డివాళ్ళని జైల్లో వేశాడు.
– సౌభాగ్య