పట్టపురాణి
ఒక రైతు దంపతులకు ఒకమ్మాయి. ఆ అమ్మాయి వయసు సంవత్సరం. ఒకరోజు పొలం దగ్గర ఉంటూ రైతు భార్య ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొస్తానని భర్తతో చెప్పి బిడ్డను చూసుకోమంది. రైతుబిడ్డ నిద్రపోయాక దగ్గరున్న రైతులతో మాట్లాడ్డానికి వెళ్ళాడు. కింద నిద్రపోతూ మెరిసిపోతున్న ముత్యంలా వున్న పాపను చెట్టుపైని ఒక కాకి చూసింది. ముచ్చటపడింది. కిందికి దిగి ముక్కున కరచుకుని దగ్గరి అడవిలోని తన గూటికి వెళ్ళింది. ఒక అరగంటలో అనుకూలమయిన ఒక గూడుకట్టి అందులో ఆ […]
ఒక రైతు దంపతులకు ఒకమ్మాయి. ఆ అమ్మాయి వయసు సంవత్సరం. ఒకరోజు పొలం దగ్గర ఉంటూ రైతు భార్య ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొస్తానని భర్తతో చెప్పి బిడ్డను చూసుకోమంది. రైతుబిడ్డ నిద్రపోయాక దగ్గరున్న రైతులతో మాట్లాడ్డానికి వెళ్ళాడు.
కింద నిద్రపోతూ మెరిసిపోతున్న ముత్యంలా వున్న పాపను చెట్టుపైని ఒక కాకి చూసింది. ముచ్చటపడింది. కిందికి దిగి ముక్కున కరచుకుని దగ్గరి అడవిలోని తన గూటికి వెళ్ళింది. ఒక అరగంటలో అనుకూలమయిన ఒక గూడుకట్టి అందులో ఆ పాపను పెట్టింది.
కాకి ఆ పాపను ఎంతో అపురూపంగా చూసుకుంది. అడవిలోని పళ్ళు, కాయలు ఎన్నెన్నో రుచికరమయినవి ఆపాపకు తెచ్చి పెట్టేది. ఆ పాప ఆనందంగా పెరిగింది. పెద్దదయింది. కొండల్లో, పుట్టల్లో, చెట్లలో ఉల్లాసంగా పెరిగింది. ఆపిల్ చెట్లు, ఆరంజి చెట్లు ఇంకా ఎన్నో అందమయిన చెట్టెక్కుతూ పిట్టల్తో, జంతువుల్తో కలిసి జీవితం హాయిగా గడిపింది.
ఆ అమ్మాయి గొంతు కోకిల స్వరం. ఎంతో ఉల్లాసంగా పాటలు పాడుతూ కొండలు తిరిగేది. ఒకరోజు ఆ ప్రాంతానికి వచ్చిన రాజు ఆమె పాటవిని ఆశ్చర్యపోయి చూశాడు. అద్భుతమయిన పువ్వులాంటి ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. తనను పెళ్ళి చేసుకుంటావా? అన్నాడు. ఆమె అంగీకరించింది. నగరానికి వచ్చింది. వాళ్ళ వివాహం గొప్పగా జరిగింది.
రాజుకు అప్పటికే ఇద్దరు భార్యలున్నారు. అందరూ అందమయినవాళ్ళే. పట్టపురాణి ఎవరు? అని రాజుకు సమస్య వచ్చింది. రాజకార్యాల్లో ప్రధాన స్థానం వున్న రాణి అవసరం.
అందుకని రాజు ముగ్గురురాణుల్ని పిలిచి మీరు ముగ్గురు అందమైన వాళ్ళే. మీరు ముగ్గురన్నా నాకు ఇష్టమే. ఐతే రాజకార్యాలు నిర్వహించడానికి ఒక పట్టపు రాణి స్థానముంటుంది. ఆ స్థానానికి మీ ముగ్గుర్లో ఒకరిని ఎంపిక చేయాలి. అది నా వల్లకాని పని. అందుకని మీ ముగ్గురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నాను. దాంట్లో ఎవరు నెగ్గితే వాళ్ళను పట్టపురాణిగా నియమిస్తానన్నాడు.
రాణులు ఏమిటా పరీక్ష అన్నారు.
రాజు “మీకు నెలరోజుల సమయం ఇస్తాను. ఈనెలరోజుల్లో మీరు మీకు సరిపోయే అందమయిన కిరీటాన్ని తయారుచేయించుకుని రండి. అదిచూసి అన్నిట్లో ఎవరి కిరీటం అందంగా ఉంటుందో చూసి నేను నిర్ణయిస్తా”నన్నాడు. రాణులు సరేనన్నారు.
మొదటి రాణి వజ్రాలతో ధగధగలాడే పనితనంతో నిండిన కిరీటం తయారుచేయమని నిపుణుల్ని నియమించింది. రెండోరాణి కెంపులు, మరకతాలతో కలిసిన కిరీటాన్ని తయారుచేయమని పురమాయించింది.
మూడోరాణి ఇంట్లో దిగులుగా కూచుంది. ఎందుకంటే ఆమెకు నగలు, కిరీటాలు వీటికి సంబంధించిన జ్ఞానం లేదు. ఏంచెయ్యాలో తోచలేదు. తన ‘తల్లి’కాకిని తలచుకుంది.
వెంటనే కాకి వచ్చి విషయం తెలుసుకుని అడవిలోకి వెళ్ళి ఎన్నో ఔషధాల్ని సేకరించుకుని వచ్చి ఇచ్చింది. అవన్నీ వనమూలికలు, వాటితో ఒక కాగితం మీద కిరీటం చిత్రించమంది.
రాజు మొదటి ఇద్దరు రాణుల కిరీటాల్ని పరిశీలించాడు. వజ్రాలు, కెంపుల, మరకతాల కిరీటాలు దీపపు కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాయి.
మూడవరాణి ఇంట్లో కాగితంపై ఆమె చిత్రించిన కిరీటకాంతులే ఇల్లంతా నిండాయి. అది చూసి ఆశ్చర్యపోయి రాజు ఆమెను పట్టపురాణిని చేశాడు.
దాంతో తక్కిన ఇద్దరు రాణులు ఆమె మీద కసిపెంచుకున్నారు. సమయంకోసం ఎదురుచూశారు. ఒకరోజు ముగ్గురు ఒక నదీతీరంలో తిరుగుతూ ఆమెను నదిలోకి తోశారు. నదిలో కొట్టుకుపోతూ ఆమె తన తల్లి కాకిని తలచుకుంది. కాని తన కాకి మూకతో వచ్చి ఆమెను నదినుంచి అడవిలోకి తీసుకొచ్చి ఇల్లుకట్టి పెట్టింది. అక్కడ ఆమె ప్రశాంతంగా ఉంది.
ఇద్దరు రాణులు మూడోరాణి నదిలో పడికొట్టుకుపోయిందని రాజుతో అబద్ధాలు చెప్పారు. రాజు కన్నీరుమున్నీరుగా విలపించాడు. రాజుకు ఆమె ఎప్పుడూ గుర్తుకు వచ్చేది. చివరకు ఒకరాజు ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒకచోట ఆమె స్వరం విని ఆశ్చర్యపోయాడు. ఒక కుటీరంలో వున్న ఆమెను చూశాడు. ఆనందించాడు. ఆమె జరిగిన విషయమంతా వివరించింది. రాజు ఆగ్రహించి మొదటి ఇద్దరు భార్యల్ని ఖైదులో వేయించాడు. పట్టపురాణితో ప్రశాంతంగా జీవించాడు.
– సౌభాగ్య