త్యాగం " లోభం
పేరు ప్రతిష్టలు పొందిన ఒక చక్రవర్తి ఉండేవాడు. అంతులేని సంపద ఉన్న ఒక వ్యక్తి చక్రవర్తికి ఎంతో స్నేహితుడుగా ఉండేవాడు. చక్రవర్తి, సంపన్నుడు మంచి మిత్రులు. కానీ వాళ్ళతత్వంలో చాలా భేదముండేది. చక్రవర్తి గొప్పదానశీలి. ఉదార గుణమున్నవాడు. ఆయన దానధర్మాలవల్ల ఎంతో కీర్తి గడించాడు. దేశ విదేశాల కవులు, కళాకారులు ఆయన దాతృత్వాన్ని వేనోళ్ల పొగడారు. అందరూ చక్రవర్తిని ఆకాశానికెత్తారు. దాంతో చక్రవర్తి తనను మించిన దానశీలి ప్రపంచంలో ఎవరూ లేరని విర్రవీగాడు. ఆ మత్తులో మునిగిపోయాడు. […]
పేరు ప్రతిష్టలు పొందిన ఒక చక్రవర్తి ఉండేవాడు. అంతులేని సంపద ఉన్న ఒక వ్యక్తి చక్రవర్తికి ఎంతో స్నేహితుడుగా ఉండేవాడు. చక్రవర్తి, సంపన్నుడు మంచి మిత్రులు. కానీ వాళ్ళతత్వంలో చాలా భేదముండేది. చక్రవర్తి గొప్పదానశీలి. ఉదార గుణమున్నవాడు. ఆయన దానధర్మాలవల్ల ఎంతో కీర్తి గడించాడు. దేశ విదేశాల కవులు, కళాకారులు ఆయన దాతృత్వాన్ని వేనోళ్ల పొగడారు. అందరూ చక్రవర్తిని ఆకాశానికెత్తారు. దాంతో చక్రవర్తి తనను మించిన దానశీలి ప్రపంచంలో ఎవరూ లేరని విర్రవీగాడు. ఆ మత్తులో మునిగిపోయాడు. లోకంలో పేరు తెచ్చుకోవడం చాలా సులభం. కానీ భగవంతుని దృష్టిలో పడడం చాలా కష్టం. తన త్యాగశీలంతో ఒళ్ళు మరిచిన చక్రవర్తి వయసు పెరిగే కొద్దీ దేవుడికి దూరంగా అహంకారానికి దగ్గరగా చేరాడు. తను జీవితంలో ఇక చేయాల్సింది ఏమీ లేదని, స్వర్గద్వారాలు తన కోసం తెరిచి ఉంటాయని తీర్మానించుకున్నాడు.
చక్రవర్తి మిత్రుడయిన సంపన్నుడు పరమలోభి. ఎవరికీ ఎర్రఏగానీ దానం చేసేవాడు కాడు. ఖచ్చితంగా చెప్పాలంటే కాకికి కూడా చెయ్యి విదిలించేవాడు కాడు. అట్లా కూడబెట్టీ కూడబెట్టీ కోట్లు గడించాడు. కాలం సాగుతోంది కదా! చక్రవర్తి, సంపన్నుడు. ఇద్దరూ ముసలి వాళ్ళయ్యారు. చక్రవర్తేమో తన త్యాగమనే మత్తులో అహంకారం అంచులో మునిగి తనను తాను మరచిపోయాడు. సంపన్నుడేమో అంతులేని సంపద ఉన్నా అశాంతిలో మునిగిపోయాడు. ఏదో కావాలని ఆరాటపడ్డాడు. అది ధనం కాదు. అది తనకు కావలసినంత ఉంది. దేనికోసమో వెతుకులాట మొదలయింది. ఏదో కావాలని ఆరాటపడడం కూడా అహంకారంలో భాగమే. ఆ కారణం వల్లే భోగి యోగి అవుతాడు. లోభి దానశీలిగా మారతాడు. క్రూరుడు దయాళువు అవుతాడు. కానీ వాళ్ళ అంతరంగంలో ఎట్లాంటి మార్పు ఉండదు.
ఆ సంపన్నుడు ఆ వెతుకులాటలో ఒక గురువును ఆశ్రయించాడు. తనకు శాంతి కావాలని కోరాడు. ‘ ఇంత సంపద ఉన్న నీకు అన్నీ ఉన్నాయి కదా? ఇంకేం కావాలి?” అన్నాడు గురువు. సంపన్నుడు ”స్వామీ! ధనంవల్ల అశాంతి తప్ప యింకేమీ దొరకదని అనుభవంవల్ల తెలుసుకున్నాను. నాకు శాంతి దొరికే మార్గం చెప్పండి” అన్నాడు. గురువు వెంటనే ”వెళ్లి నీదగ్గరున్న సమస్త సంపదనీ దానధర్మాలు చేసిరా. నీ దగ్గర చిల్లిగవ్వ కూడా మిగలకూడదు. అన్నీ వదలుకుని నువ్వు వస్తే నీకు శాంతి మార్గం చెబుతాను” అన్నాడు. ఆ సంపన్నుడు వెళ్లి తన సమస్త సంపదను దాన ధర్మాలు చేసి కట్టు బట్టలతో గురువు ఆశ్రమానికి వచ్చాడు. తాను చాలా గొప్పపని చేశానన్న గర్వం సంపన్నుడి కళ్ళలో కనిపించింది. తనకు మించిన గొప్పవాడు లోకంలో లేడన్న అహంకారం కనిపించింది. అతన్ని చూస్తూనే గురువు ”ఎందుకొచ్చావు. వెళ్లు. నీకిక్కడ స్థానం లేదు. నాకు నీ ముఖం చూపించకు వెళ్ళు” అని అతన్ని బయటకు తోసి తలుపు వేసుకున్నాడు. గురువు చర్యతో సంపన్నుడు హతాశుడయ్యాడు. ”నేనేం చేశాను. గురువు చెప్పినట్లే అన్నీ వదులుకుని వచ్చాను కదా! ఇప్పుడు నా దగ్గర ఇల్లు లేదు. డబ్బు లేదు. వట్టి చేతుల్తో ఉన్నాను. ఇట్లాంటి నిస్సహాయ స్థితిలో గురువు నన్ను వెళ్లమన్నాడు. అనుకుని ఒక చెట్టుకింద కన్నీళ్లు పెట్టుకుని అలసి పడుకున్నాడు. ఇప్పుడు అతనిలో తాను సంపన్నుడని, తన దగ్గరవున్నదంతా దానం చేశానని అన్న భావన కూడా ఎగిరిపోయింది. కేవలం తనకి తానొక్కడే తోడన్న భావన ఒక్కటే మిగిలింది. ధనాన్ని వదులుకోవచ్చు. త్యాగలక్షణాన్ని వదులుకోవడం కష్టం.
సంపన్నుడు నిద్రలేచేసరికి అతని మనసంతా ఉల్లాసంతో ఆనందంతో నిండి ఉంది. ఏదో పోగొట్టుకునాన్నని, ఏదో పొందానని అతనికి అనిపించలేదు. కానీ ఏదో సత్యం తనకు అవగాహనయింది అనుకున్నాడు. లేచి గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుందామని బయల్దేరడంతో గురువే వచ్చి అతన్ని చూసి అతనిలో పరివర్తన గ్రహించి అతన్ని కౌగలించుకున్నాడు.
– సౌభాగ్య