తెల్లటి దుప్పటితో...ఆమె ఆత్మగౌరవాన్ని తుడిచేశారు!
ఆలోచనలు, అభిప్రాయాలు, వివిధ విషయాల పట్ల మన దృక్పథం…ఇవే మనుషుల మధ్య బంధాలను బలపరచేవి, బలహీనపరచేవి. ఇవన్నీ సరిగ్గా లేకుండా…రెండు ఉంగరాలు మార్పించాం…మూడు ముళ్లు వేయించాం…ఇక నూరేళ్లు వాళ్లిద్దరూ హాయిగా బతికేస్తారు అనుకోవటం….మూర్ఖత్వమే అవుతుంది. మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని ఒక గ్రామంలో కులపెద్దలు కుల పంచాయితీ నిర్వహించి, ఒక నూతన వధువుపై ఆమె కన్య కాదంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాదు, ఆమెతో వివాహ బంధాన్ని తెంచేసుకోవచ్చని భర్తకి అనుమతి కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ […]
ఆలోచనలు, అభిప్రాయాలు, వివిధ విషయాల పట్ల మన దృక్పథం…ఇవే మనుషుల మధ్య బంధాలను బలపరచేవి, బలహీనపరచేవి. ఇవన్నీ సరిగ్గా లేకుండా…రెండు ఉంగరాలు మార్పించాం…మూడు ముళ్లు వేయించాం…ఇక నూరేళ్లు వాళ్లిద్దరూ హాయిగా బతికేస్తారు అనుకోవటం….మూర్ఖత్వమే అవుతుంది.
మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని ఒక గ్రామంలో కులపెద్దలు కుల పంచాయితీ నిర్వహించి, ఒక నూతన వధువుపై ఆమె కన్య కాదంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాదు, ఆమెతో వివాహ బంధాన్ని తెంచేసుకోవచ్చని భర్తకి అనుమతి కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇవీ-
తన భార్య కన్య కాదనే అనుమానంతో ఒక వరుడు పెళ్లయిన నలభై ఎనిమిది గంటలకే ఆమెతో అనుబంధానికి తెంచుకునేందుకు సిద్ధపడ్డాడు. అంతకుముందు అతను, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆత్మగౌరవాన్ని కించపరచేలా ఊరందరి ముందు తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టాడు. ఆ ప్రబుద్దుడి మాటకు వంత పలుకుతూ కుల పంచాయితీ పెద్దలు ఓ సలహా ఇచ్చారు. వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి ఓ తెల్లని దుప్పటిని ఇచ్చి, తెల్లవారి తెచ్చి చూపించమన్నారు. ఆ దుప్పటిపై ఏర్పడే రక్తపు మరకే ఆమె కన్యా, కాదా అనేదాన్ని నిర్ణయిస్తుందని వారు భావించారు.
అయితే తెల్లవారి ఆ దుప్పటిపై ఎలాంటి రక్తపు మరక లేకపోవడంతో, తన భార్య కన్య కాదంటూ అతను పంచాయితీలో తెల్లదుప్పటిని చూపించాడు. దాంతో అతను వైవాహిక బంధాన్ని తెంచుకోవడానికి కులపెద్దలు అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. దీనిపై సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల వాళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నూతన వధువు ప్రస్తుతం పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, రన్నింగ్, లాంగ్‌జంప్, సైక్లింగ్ తదితర శారీరక ఫిట్‌నెస్‌ని పెంచే వ్యాయామాలు చేస్తోందని, ఈ సందర్భంలో కన్యత్వ పొరగా చెబుతున్నది చీట్లిపోయే అవకాశం ఉన్నదని, వైద్యులే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారంటూ సామాజిక కార్యకర్తలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. గురువారం తాము కులపెద్దలను కలవబోతున్నామని, ఈ విషయంలో అమ్మాయికి అన్యాయం జరిగితే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.