బ్రెడ్‌లో క్యాన్సర్ కారకాలు...కాదంటున్న తయారీ కంపెనీలు!
బ్రెడ్ పలురూపాల్లో ఇప్పుడు మన ఆహారంలోనూ, చిరుతిండిలో వచ్చి చేరింది. అనారోగ్యాల బారినపడి కోలుకుంటున్నవారికి సైతం దీన్ని ఆహారంగా ఇస్తుంటాము. కానీ అలాంటి బ్రెడ్లోనే అనారోగ్యాలను తచ్చిపెట్టే రసాయనాలు అధికంగా ఉన్నాయని తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. షాపుల్లో చాలా ఎక్కువగా అందుబాటులో ఉండే 38 రకాల బ్రెడ్డులను, వాటితో తయారైన చిరుతిళ్లను వీరు పరిశీలించారు. బన్నులు, పావ్‌లు, బర్గర్, పిజ్జాల్లో రెడీ టు ఈట్గా […]
బ్రెడ్ పలురూపాల్లో ఇప్పుడు మన ఆహారంలోనూ, చిరుతిండిలో వచ్చి చేరింది. అనారోగ్యాల బారినపడి కోలుకుంటున్నవారికి సైతం దీన్ని ఆహారంగా ఇస్తుంటాము. కానీ అలాంటి బ్రెడ్లోనే అనారోగ్యాలను తచ్చిపెట్టే రసాయనాలు అధికంగా ఉన్నాయని తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. షాపుల్లో చాలా ఎక్కువగా అందుబాటులో ఉండే 38 రకాల బ్రెడ్డులను, వాటితో తయారైన చిరుతిళ్లను వీరు పరిశీలించారు. బన్నులు, పావ్‌లు, బర్గర్, పిజ్జాల్లో రెడీ టు ఈట్గా దొరికే ఈ 38 రకాల బ్రెడ్లలోంచి సేకరించిన 84శాతం నమూనాల్లో పొటాషియం బ్రోమేట్, పొటాషియం ఐయోడేట్ ఉండటం గమనించారు. ఈ రెండింటినీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే హానికారకాలుగా గుర్తించి చాలా దేశాలు నిషేధించాయి. ఇందులో మొదటిది క్యాన్సర్ ముప్పుని తెచ్చే ప్రమాదమున్న రసాయనంగా గుర్తించబడిందని, రెండవది థైరాయిడ్ సమస్యలకు కారణమవుతుందని సీఎస్‌ఈ పేర్కొంది. అయితే థైరాయిడ్కి కారణమయ్యే రసాయనాన్ని మనదేశంలో నిషేధించలేదు.
సీఎస్‌ఈ పరిశీలించినవాటిలో బ్రిటానియా, హార్వెస్ట్ గోల్డ్, కెఎఫ్సి, పిజ్జా హట్, డోమినోస్, సబ్వే, మెక్డోనాల్డ్ తదితర ప్రముఖ కంపెనీల తాలూకూ బ్రెడ్ నమూనాలు ఉన్నాయి. అయితే తమ ఉత్పుత్తుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయన్న వార్తలను బ్రిటానియా, కేఎఫ్సీ, డోమినోస్, మెక్ డోనాల్డ్స్ తోసిపుచ్చాయి. ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలను తాము నూరుశాతం పాటిస్తున్నట్టుగా బ్రిటానియా పేర్కొంది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలను తాము పాటిస్తున్నామని, వినియోగదారుల ఆరోగ్య సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని కేఎఫ్సీ, డోమినోస్ తెలిపాయి. ఆరోపణలన్నీ నిరాధారమైనవని మెక్డోనాల్స్ చెప్పగా, తాము ఆ రెండు రసాయనాలను ఉపయోగించడం లేదని సబ్వే పేర్కొంది. బ్రెడ్లలో ఉపయోగించే పదార్థాల జాబితా నుంచి పొటాషియం బ్రోమేట్ను పూర్తిగా తొలగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని, పొటాషియం అయోడేట్ విషయంలో పరీక్షలు చేపడుతున్నామని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం త్వరలో ఈ విషయంపై సంపూర్ణ నివేదికను వెల్లడించనుంది.