కొడుకుతోనే జ్యోతులకు చెక్‌పెట్టేందుకు మంత్రుల మాస్టర్ ప్లాన్
టీడీపీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ చేయడంతో (మంత్రి పదవిపై హామీ విషయం జ్యోతులే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు) వైసీపీని వీడిన జ్యోతుల నెహ్రుకు చెక్ పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా నేతలు అప్పుడే పావులు కదుపుతున్నారు. జ్యోతులకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పక్కా ప్లాన్ చేస్తున్నారు. జ్యోతులకు మంత్రి పదవి ఇస్తే తప్పకుండా తన పదవికి గండం తప్పదని చినరాజప్ప భావిస్తున్నారు. పైగా ఆ మధ్య అసెంబ్లీ […]
టీడీపీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ చేయడంతో (మంత్రి పదవిపై హామీ విషయం జ్యోతులే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు) వైసీపీని వీడిన జ్యోతుల నెహ్రుకు చెక్ పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా నేతలు అప్పుడే పావులు కదుపుతున్నారు. జ్యోతులకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పక్కా ప్లాన్ చేస్తున్నారు.
జ్యోతులకు మంత్రి పదవి ఇస్తే తప్పకుండా తన పదవికి గండం తప్పదని చినరాజప్ప భావిస్తున్నారు. పైగా ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల సమయంలో “మీరు టీడీపీలో కొనసాగి ఉంటే నా ప్లేస్‌లో మీరు హోంమంత్రి అయ్యేవారు” అని ఉండబట్టలేక చినరాజప్ప నేరుగా జ్యోతులతోనే చెప్పారు. అలాఅన్న కొద్ది రోజులకే జ్యోతుల టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు జ్యోతుల వర్గం తమ నేతకు మంత్రి పదవి ఇస్తే చినరాజప్ప కూడా అభ్యంతరం చెప్పబోరంటూ గతంలో రాజప్ప చేసిన వ్యాఖ్యలను కనిపించిన నేతలందరి దగ్గర ప్రస్తావిస్తున్నారు. దీంతో రాజప్ప గుర్రుగా ఉన్నారు. ఏదో మాట వరుసకు అన్న మాటలు పట్టుకుని ఏకంగా తన పదవికే ఎసరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన మంత్రి యనమలకు జ్యోతులకు తొలి నుంచి కూడా పొసగదు. దీంతో ఆయన కూడా జ్యోతులకు పదవి దక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
జ్యోతులకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం కోసం జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబును టార్గెట్ చేశారు ఇద్దరు మంత్రులు. పదవిపై పట్టుసాధించలేకపోతున్నారంటూ రాంబాబును పదవి నుంచి తొలగించి ఆ పదవిలో జ్యోతుల కుమారుడు జ్యోతుల నవీన్‌ను కూర్చోబెట్టేందుకు మంత్రులిద్దరు పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. వీరికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమ అండ కూడా ఉందని చెబుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగానే ఇటీవల జిల్లాకు వచ్చిన దేవినేని ఉమ… రాంబాబును పిలుచుకుని చైర్మన్ పదవి నుంచి విముక్తి కల్పించి ఏకంగా జిల్లా అధ్యక్షుడిని చేస్తామని చెప్పారట. అదే జరిగితే జిల్లా చైర్మన్ పదవిలో జ్యోతుల నవీన్‌ను కూర్చోబెడుతారట.
అలా చేసిన తర్వాత కుటుంబానికి ఒకే పదవి పేరుతో జ్యోతులకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం చాలా ఈజీ అని యనమల, చినరాజప్ప భావిస్తున్నారు. పైగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఇచ్చే అవకాశమే ఉండదంటున్నారు. మంత్రుల ప్లాన్ తెలుసుకున్న జ్యోతుల కూడా కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
తన కొడుక్కు పదవి వద్దని ఇస్తే తనకే మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ పెద్దలను కోరుతున్నారట. పైగా మంత్రి పదవి విషయంలో టీడీపీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టడంలో భాగంగా .. ఇటీవల జ్యోతుల ఏ టీవీ చానల్ ఇంటర్వ్యూ చేసినా తనకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబే స్వయంగా చెప్పారంటూ బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మంత్రి పదవి తప్పని సరిగా ఇచ్చే అనివార్యతను చంద్రబాబుకు కల్పించాలని భావిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు మిగిలిన సీనియర్ నేతలు కూడా పార్టీలు తిరిగి వచ్చిన జ్యోతులకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం మంత్రి పదవి రాదు ఏమీ రాదు… కొద్ది కాలం ఆగితే జ్యోతులే ఏదో ఒక కార్పొరేషన్ పదవి చాలనే పరిస్థితి వస్తుందంటున్నారు.
Click on Image to Read: