నారా వారూ! కోతలు కాదు, బయటకు రండి!
చంద్రబాబు ఏ టీడీపీ కార్యక్రమం జరిగినా ఒకటే చెబుతుంటారు. కార్యకర్తలు నాకు ప్రాణంతో సమానం. వారి కోసం ఏమైనా చేస్తా.. ఎంత దూరమైనా పోరాడుతా అంటూ కార్యకర్తలు నిజంగా నమ్మిపోయేలా మాట్లాడుతుంటారు. మనమంతా ఒక కుటుంబం అని పదేపదే చెబుతుంటారు. ఈ మాటలు నమ్మి లక్షలాది మంది కార్యకర్తలు టీడీపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య తండ్రికి తోడుగా తనయుడు లోకేష్ కూడా రంగప్రవేశం చేశారు. కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఏ […]
చంద్రబాబు ఏ టీడీపీ కార్యక్రమం జరిగినా ఒకటే చెబుతుంటారు. కార్యకర్తలు నాకు ప్రాణంతో సమానం. వారి కోసం ఏమైనా చేస్తా.. ఎంత దూరమైనా పోరాడుతా అంటూ కార్యకర్తలు నిజంగా నమ్మిపోయేలా మాట్లాడుతుంటారు. మనమంతా ఒక కుటుంబం అని పదేపదే చెబుతుంటారు. ఈ మాటలు నమ్మి లక్షలాది మంది కార్యకర్తలు టీడీపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య తండ్రికి తోడుగా తనయుడు లోకేష్ కూడా రంగప్రవేశం చేశారు. కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అర్థరాత్రి అయినా వచ్చి ఆదుకుంటానంటూ దిగివచ్చిన దేవుడిగా తనకు తానే లోకేష్ చెప్పుకుని తిరుగుతున్నారు. కానీ నారావారు చెబుతున్న మాటల్లో నిజమెంతుందో ఫోటోలోని తండ్రికొడుకుల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.
కడప జిల్లాకు చెందిన ప్రభాల వెంకటరమణకు తెలుగుదేశం అంటే ప్రాణం. పార్టీ కోసం చిన్నప్పటి నుంచి జెండామోస్తూనే ఉన్నాడు. టీడీపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ఇతడి సేవలను కూడా టీడీపీ స్థానిక నేతలు బాగానే వాడేశారు. కానీ ఇప్పుడు వెంకటరమణ జీవితం తలకిందులైంది. భార్యను పోగొట్టుకున్నాడు. కొడుకును బతికించుకునేందుకు జీవన పోరాటం చేస్తున్నాడు.
నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన ఆరేళ్ల కుమారుడు చైతన్యను కాపాడుకునేందుకు తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. హైదరాబాద్లోని లోటస్ ఆస్పత్రిలో తన శక్తిమేర కాసులు కుమ్మరించాడు. కానీ చైతన్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పుడు ఆరేళ్ల బిడ్డ బతకాలంటే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం ఆరు లక్షలు తీసుకురావాలన్నారు. అంత మొత్తాన్ని ఏకకాలంలో కూడా చూడని పేదవాడు వెంకటరమణ. అయినా కొడుకును కాపాడుకోవాలనుకున్నాడు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కార్యకర్తలు తన ప్రాణం అన్న చంద్రబాబు ఆదుకుంటారని నమ్మాడు.
కానీ ఇప్పటికి ఆరు నెలలైంది. మనంతా ఒక కుటుంబం అని చెప్పిన చంద్రబాబును కలిసి తన సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు వెంకటరమణ. ముఖ్యమంత్రి మనసు కరగలేదు. ఆరు నెలలుగా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వెంకటరమణ ఆర్థికంగా చితికిపోయాడు. అందుకే విజయవాడ వచ్చిన ప్రతిసారి విజయవాడ నెహ్రు బస్‌స్టేషన్‌లో అనారోగ్యంతో ఉన్న కొడుకుతో కలిసి రాత్రివేళల్లో నిద్రిస్తున్నాడు వెంకటరమణ. పగలు సీఎం క్యాంపు ఆఫీస్ దగ్గర సీఎం పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఆ ఒక్క పిలుపు కోసం దీనంగా ఎదురుచూస్తుంటాడు. అయినా సీఎం అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. ఒకసారి సీఎం అడిషినల్ సెక్రటరీ రామసుబ్బయ్య .. వెంకటరమణ దగ్గర వినతిపత్రం తీసుకున్నారు. కానీ అది ఏమైందో బాబుగారి గుడ్ గవర్నెన్స్ కే తెలియాలి.
సరే సామాన్యుల సమస్యలు పట్టించుకునేంత తీరిక సీఎంకు లేదనుకుందాం. ఆయన కుమారుడు నారా లోకేష్‌ను కూడా వెంకటరమణ ఒకసారి కలిశాడు. వెంకటరమణ కుమారుడి పరిస్థితి తెలుసుకున్న లోకేష్ తప్పకుండా సాయం చేస్తాం అని కడపలోనే ప్రకటించి వెళ్లారు. అది జరిగి కూడా నెలలు గడిచిపోయింది. కాని చంద్రబాబు నుంచి గానీ, లోకేష్ నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదు. లోకేష్‌ను మరోసారి కలుద్దామంటే ఆయన ఇప్పుడు సీఎం కన్నా బీజీ అయిపోయారు.
కనీసం సీఎం సాయం చేస్తారో లేదో కూడా వెంకటరమణకు వివరించే నాథుడే లేడు. విజయవాడలో బాబు గారి క్యాంపు ఆఫీస్ వద్ద పాలన అలా ఉంది. కొద్దికాలం క్రితం వెంకటరమణ భార్య కూడా చనిపోయారు. దీంతో ఇద్దరు పిల్లల బాధ్యతలను వెంకటరమణే చూసుకుంటున్నారు. టీడీపీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నా వెంకటరమణకు ఈ పరిస్థితి రావడం ఆశ్చర్యంగానే ఉందని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని చెప్పిన లోకేష్ ఆ నిధుల నుంచి ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. టీవీల ముందు కార్యకర్తలంతా మా కుటుంబసభ్యులు, వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేం చూసుకుంటామని కోతలు కోసే నారా పెద్దలు .. వెంకటరమణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఇతర కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా టీడీపీ కార్యకర్త కోటాలోనైనా ప్రభుత్వ పెద్దలు వెంకటరమణకు సాయం చేసి చిన్నారిని కాపాడితే మంచిదే.
Click on Image to Read: