హైదరాబాద్ మగవారికి బిపి ఎక్కువ...!
హైదరాబాద్‌లో నివసించే మగవారిలో, దేశంలోని ఇతర నగరాల్లో నివసించే మగవారిలో కంటే హైపర్‌టెన్షన్ అధికంగా ఉన్నట్టు ఒక జాతీయ సర్వే తేల్చింది. బిపి అధికంగా పెరిగిపోవడాన్ని హైపర్‌టెన్షన్ అంటారు. మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16)లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో నివసించే మగవారిలో 4.5శాతం మందిలో వెరీ హై హైపర్ టెన్షన్ (విహెచ్‌హెచ్) పరిస్థితి ఉందని ఈ సర్వే చెబుతోంది. […]
హైదరాబాద్‌లో నివసించే మగవారిలో, దేశంలోని ఇతర నగరాల్లో నివసించే మగవారిలో కంటే హైపర్‌టెన్షన్ అధికంగా ఉన్నట్టు ఒక జాతీయ సర్వే తేల్చింది. బిపి అధికంగా పెరిగిపోవడాన్ని హైపర్‌టెన్షన్ అంటారు. మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16)లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో నివసించే మగవారిలో 4.5శాతం మందిలో వెరీ హై హైపర్ టెన్షన్ (విహెచ్‌హెచ్) పరిస్థితి ఉందని ఈ సర్వే చెబుతోంది. ముంబయి, చెన్నై, బెంగలూరు, కోల్‌కతా, డెహ్రాడూన్, భోపాల్, పాట్నా, తదితర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఈ విషయంలో ముందుంది. చైన్నైలో 3శాతం మంది మగవారిలో వెరీ హై హైపర్ టెన్షన్ ఉంది. కోల్‌కతా పాట్నాల్లో 0.5శాతం మంది, గోవాలో 0.1శాతం మంది, బెంగలూరులో 0.7శాతం మంది, డెహ్రాడూన్‌లో 1.1శాతం మంది వెరీ హై హైపర్ టెన్షన్‌కి గురవుతున్నారని సర్వేలో తేలింది. 17 రాష్ట్రాల్లో 20వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. రక్తపోటు స్థాయి 180/110గా ఉండటాన్ని హైపర్‌టెన్షన్‌గా గుర్తించారు. ఆరోగ్యవంతులైనవారిలో 140/90 వరకు బిపి ఉండవచ్చని, మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో 135/85 వరకు మాత్రమే బిపి ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాలు వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇతర నగరాలతో పోల్చినపుడు ఏ అంశాలు ఇక్కడి మగవారికి ముప్పుగా మారుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అధిక రక్తపోటు సమస్య అధికంగా ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాల్లో ఈ విషయం రుజువైంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం తదితర అంశాలు హైదరాబాద్‌లో అధిక రక్తపోటుని పెంచుతున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. యువతలో కూడా ఇటీవల ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. ఐటీ, ఇతర ఒత్తిడితో కూడిన రంగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో ఎక్కువమంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. నియమిత పనివేళలు లేకపోవటం, ఉప్పు మసాలాలతో కూడిన ఆహారం, ధూమపానం వంటివి ఈ సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ రోజు ప్రపంచ అధిక రక్తపోటు దినం.