ఉషోదయాలే కాదు...రాత్రులూ మనవే!
మనమెప్పుడూ ఉదయాల గురించే మాట్లాడుకుంటాం కానీ, సాయంత్రం దాటాక మనచేతుల్లో ఉండే రాత్రి సమయం గురించి ఎక్కువగా పట్టించుకోము. అలసత్వంగా, బద్ధకంగా గడిపేస్తూ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ పెట్టము. ఆఫీస్‌నుండి బయటకు వచ్చేస్తే చాలు…చాలామంది తమ స్వేచ్ఛకు రెక్కలు వచ్చేసినట్టుగా ఫీలవుతారు. ఆరోగ్యాన్నిచ్చేవి కాదని తెలిసినా కొన్ని పనులు మానలేరు. కానీ రాత్రి కూడా మన జీవితంలో భాగమేనని గుర్తించి కాస్త క్రమశిక్షణని పాటించాల్సిందే. లేకపోతే రాత్రి తెచ్చే అనారోగ్యాలు ఉంటాయి మరి- -ఆఫీస్‌నుండి ఇంటికి రాగానే, […]
మనమెప్పుడూ ఉదయాల గురించే మాట్లాడుకుంటాం కానీ, సాయంత్రం దాటాక మనచేతుల్లో ఉండే రాత్రి సమయం గురించి ఎక్కువగా పట్టించుకోము. అలసత్వంగా, బద్ధకంగా గడిపేస్తూ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ పెట్టము. ఆఫీస్‌నుండి బయటకు వచ్చేస్తే చాలు…చాలామంది తమ స్వేచ్ఛకు రెక్కలు వచ్చేసినట్టుగా ఫీలవుతారు. ఆరోగ్యాన్నిచ్చేవి కాదని తెలిసినా కొన్ని పనులు మానలేరు. కానీ రాత్రి కూడా మన జీవితంలో భాగమేనని గుర్తించి కాస్త క్రమశిక్షణని పాటించాల్సిందే. లేకపోతే రాత్రి తెచ్చే అనారోగ్యాలు ఉంటాయి మరి-
-ఆఫీస్‌నుండి ఇంటికి రాగానే, పగలంతా పడిన శ్రమ ఫీలింగ్ పోవాలంటే ఆ దుస్తులను వదిలేసి సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్లోకి మారాలి. వెంటనే స్నానం చేస్తే మరింత మంచిది. ఇది శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకి ఎంతో అవసరం.
-శక్తి, ఉత్సాహం కోసమంటూ చక్కెర మోతాదు ఎక్కువ ఉన్న రుచికరమైన డ్రింకులు తాగేస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసులో శరీరానికి కావలసినంత నీరు తాగే అవకాశం ఉండదు. సాయంత్రం ఆ నీటిని భర్తీ చేయకుండా డ్రింకులతో కడుపు నింపేస్తే శరీరానికి తగినంత నీరూ అందదు, పైగా ఆ డ్రింకులు చేసే హానీ భరించాలి.
-సాయంత్రం కాగానే కడుపులో ఏదోఒకటి పడేయకపోతే ఇక శరీరం, మనసు పనిచేయలేమని మొరాయిస్తాయి. ఇలాంటపుడే ఆరోగ్యానికి హానిచేసే రుచికరమైన ఫుడ్ ఎక్కువగా తింటాం. ఈ సమయంలో నట్స్, పళ్లు లాంటివాటితో ఆకలిని తగ్గించుకుని, త్వరగా భోజనం చేసేయాలి.
-మనలో చాలామందికి విశ్రాంతి అంటే టివి ముందు కూర్చోవడమే. ఎన్ని గంటలయినా అలా ఛానల్స్ మారుస్తూ కూర్చుండిపోతారు. కానీ ఆ రోజుకి ఇక చేతిలోంచి జారిపోయే ఆ సమయాన్ని మన మనసుకి నచ్చినపనికి, ఎప్పటినుండో వాయిదా వేస్తున్న చిన్నపాటి పనులకు కేటాయిస్తే…ఆ రాత్రి మరింత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం..
-అంతా కలిసి తినేది రాత్రే కనుక రాత్రి పూట వంటలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు కొందరు. కానీ నిద్రపోయే వేళ మన జీర్ణవ్యవస్థకి ఎంత తక్కువ పని చెబితే అంత మంచిది. నిద్రపోవడానికి మరీ తక్కువ సమయం ముందు తినేవారు ఈ సుత్రాన్ని మరింతగా గుర్తుపెట్టుకోవాలి. రాత్రులు ఫోన్ మాట్లాడుతూ, సిస్టమ్ ముందు కూర్చుని చిరుతిండి, జంక్ ఫుడ్ తినేవారిలో రక్తంలో చక్కెర శాతం పెరగటంతో పాటు కొవ్వు పెరిగి గుండె సమస్యలకు దారితీస్తుంది. రాత్రులు తినే జంక్‌ఫుడ్ చిరుతిళ్లవలన మెదడు ఒత్తిడికి గురవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.
-అన్నం తినగానే అలాగే టివి ముందునుండి బెడ్ మీదకు చేరుతున్నారా…అయితే ఇది వినండి. రాత్రి ఆహారం తిన్నాక 100 అడుగులు వేస్తే ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చు. అరుగుదల శక్తి, మెటబాలిజం రేటు పెరుగుతాయి. రక్త ప్రసారం మెరుగై ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రాత్రి భోజనం తరువాత పావుగంట నడిస్తే బరువు తగ్గటంలో అది సహాయపడుతుంది. వీటన్నింటితో పాటు రాత్రులు బ్రష్ చేసు కోవటం మర్చిపోకూడదు.