టీటీడీపీ కుంభస్థలానికి గాయం.. కారులోకి అధ్యక్షుడు జంప్
వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పుడు టీడీపీ నేతలు కావాలని జగనే పొంగులేటిని టీఆర్ఎస్‌లోకి పంపించారని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ కారెక్కేందుకు రెడీ అయ్యారు. దీంతో సైకిల్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఇప్పటికే మరో ఎమ్మెల్యే, ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసిన సండ్ర వెంకట వీరయ్య కూడా కారెక్కుతారన్న […]
BY sarvi10 May 2016 10:25 PM GMT
X
sarvi Updated On: 10 May 2016 11:43 PM GMT
వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పుడు టీడీపీ నేతలు కావాలని జగనే పొంగులేటిని టీఆర్ఎస్‌లోకి పంపించారని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ కారెక్కేందుకు రెడీ అయ్యారు. దీంతో సైకిల్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఇప్పటికే మరో ఎమ్మెల్యే, ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసిన సండ్ర వెంకట వీరయ్య కూడా కారెక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే!.
తెలుగుదేశంలో ఆయన దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఉత్తర తెలంగాణలో టీడీపీలో కీలక నేత, చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉన్న నేత పార్టీ నుంచి జారిపోవడం పార్టీ అధినేతలో కలవరం పెంచింది. ఎల్.రమణ పార్టీ మారే విషయంలో చాలా రోజుల నుంచి మంత్రి హరీశ్‌రావుతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. గులాబీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే ఆయన చేరిక ఇక లాంఛనమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రచారాన్ని ఎల్.రమణ గానీ, సత్తుపల్లి (ఖమ్మం) ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగానీ ఖండించకపోవడం గమనార్హం.
కరీంనగర్‌లో కీలకమైన బీసీ నేత..
జగిత్యాలకు చెందిన ఎల్. రమణ సామాజిక కార్యకర్తగా ప్రజాసేవ ప్రారంభించారు. పద్మశాలి వర్గానికి చెందిన రమణ 1994లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. 1994-96 వరకు చేనేత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో 11వ లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1998లో ఎన్‌డీఏ ప్రభుత్వం కుప్పకూలడంతో ఆయన పూర్తికాలం ఎంపీగా కొనసాగలేకపోయారు. తరువాత ఖాదీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. సుమారు 11 ఏళ్ల తరువాత అంటే.. 2009 తరువాత తిరిగి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈలోగా తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంది. దాదాపు 2014 ఎన్నికల వరకు ప్రజల్లో పెద్దగా తిరగని నేతగా జిల్లాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుంటే.. ఆయన కనీసం దినపత్రికల్లో కూడా కనిపించలేదు. 2014 ఎన్నికల్లో అదే ఆయన ఓటమికి కారణమైంది. మరోవైపు జగిత్యాలను కంచుకోటగా మలుచుకుని దూసుకుపోతున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే.. టీడీపీలో ఉంటే సాధ్యం కాదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు, జీవన్ రెడ్డికి పోటీ ఇచ్చేందుకే ఆయన కారు ఎక్కుతున్నారని జగిత్యాల వాసులు విశ్లేషిస్తున్నారు.
Next Story