ఆ గ్రామంలో వితంతువులే ఉండరు!
మధ్య ప్రదేశ్, మాండ్లా జిల్లాలో నివసించే గోండు జాతివారిలో అసలు వితంతువులైన స్త్రీలే కనిపించరు. అందుకు కారణం, ఏ స్త్రీకైనా భర్త మరణించగానే ఆమె అత్తవారింట్లో భర్త తరువాత ఉన్న పురుషుడితో ఆమెకు వివాహం చేస్తారు. భర్త తరువాత ఆ కుటుంబంలో ఆమెకు మనవడి వయసున్న వ్యక్తి ఉన్నా అతనితోనే వివాహం జరిపిస్తారు. ఒకవేళ అలా కుటుంబంలోని మగవారు ఆమెని వివాహం చేసుకునేందుకు ఒప్పుకోకపోయినా, అందుబాటులో లేకపోయినా వితంతు మహిళకు ఏ కుల పెద్ద ఇంటి నుండి […]
మధ్య ప్రదేశ్, మాండ్లా జిల్లాలో నివసించే గోండు జాతివారిలో అసలు వితంతువులైన స్త్రీలే కనిపించరు. అందుకు కారణం, ఏ స్త్రీకైనా భర్త మరణించగానే ఆమె అత్తవారింట్లో భర్త తరువాత ఉన్న పురుషుడితో ఆమెకు వివాహం చేస్తారు. భర్త తరువాత ఆ కుటుంబంలో ఆమెకు మనవడి వయసున్న వ్యక్తి ఉన్నా అతనితోనే వివాహం జరిపిస్తారు. ఒకవేళ అలా కుటుంబంలోని మగవారు ఆమెని వివాహం చేసుకునేందుకు ఒప్పుకోకపోయినా, అందుబాటులో లేకపోయినా వితంతు మహిళకు ఏ కుల పెద్ద ఇంటి నుండి అయినా పాటో అనే సిల్వర్ గాజులు అందుతాయి. ఆ గాజులు వేసుకున్నాక ఆమెకు తిరిగి పెళ్లి అయినట్టుగానే భావిస్తారు. ఏ ఇంటి మహిళ అయితే ఆమెకు గాజులు పంపిందో ఆ ఇంటికి వెళ్లి ఆమె జీవించవచ్చు.
పరీరామ్ వార్ఖడే అనే వ్యక్తికి ఆరేళ్ల వయసు ఉన్నపుడు అతని తాత మరణించాడు. దాంతో పరీరామ్‌కి తన బామ్మని ఇచ్చి వివాహం చేశారు. ఇలా మనుమడితో వివాహం జరిగితే దాన్ని నాతి పాటో అంటారు. తరువాత వారు అన్ని మతపరమైన కార్యక్రమాల్లో భార్యాభర్తల్లా పాల్గొంటారు. పరీరామ్ పెద్దయ్యాక తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మైనర్లు తప్పనిసరై వివాహం చేసుకున్నపుడు ఇలాంటి అవకాశం ఉంటుంది. అయితే పెద్ద భార్యగా అతని గ్రాండ్ మదరే ఉంటుంది. తరువాత పెళ్లి చేసుకున్న అమ్మాయికి రెండవభార్య హోదానే ఉంటుంది. అలాగే ఇంటి పెద్దావిడని పెళ్లిచేసుకున్న మైనర్ కుర్రాడికి ఇంటి పెద్ద హోదా వచ్చేస్తుంది.
ఇలా వివాహం చేసుకున్న వారిలో వయోభేదం ఎక్కువగా ఉంటుంది కనుక వారి మధ్య శారీరక సంబంధం ఉండకపోవచ్చు. అందుకు ఎవరూ ఏమీ అనరు. ఒకవేళ వారిద్దరూ భార్యాభర్తల్లా జీవించినా ఎవరూ అభ్యంతరం పెట్టరు. సుందరో బాయి కుర్వతి భర్త మరణించాక తనకంటే పదేళ్లు చిన్నవాడయిన మరిది సంపత్‌ని వివాహం చేసుకుంది. వారిద్దరూ కొన్ని దశాబ్దాలు అన్యోన్యంగా కాపురం చేశారు. ఇప్పుడు వారు 75, 65 ఏళ్ల వయసుకు చేరారు. కృపాల్ సింగ్ (55) తన కంటే ఐదేళ్లు పెద్దదయిన తన వదినను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. తమజాతిలో ఒక మహిళ వితంతువుగా ఉండటాన్ని అంగీకరించమని కృపాల్‌సింగ్ అన్నాడు.
కొంతమంది మహిళలు రెండవవివాహానికి ఇష్టపడరు. అలాంటివారికి గ్రామపెద్దలు… భర్త ఉన్న మహిళకు ఉన్న హోదానే కల్పిస్తారు. పాంచ్ పాటో అనే సంప్రదాయం ప్రకారం గ్రామ పెద్దలకు అలాంటి అధికారం ఉంటుంది. గోండులు తమ గ్రామాన్ని విడిచి బయట ఊళ్లకు వెళ్లినా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. భోపాల్‌లో బిహెచ్ఇఎల్‌లో ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఇద్దరు గోండుజాతి యువకులు ఇదే సంప్రదాయాన్ని బట్టి తమ వదినలను వివాహం చేసుకున్నారు. ఏదిఏమైనా ఇందులో ఉన్న తప్పొప్పుల సంగతి పక్కనుంచితే, ఒక మహిళ జీవితంలో ఒంటరిగా మిగిలిపోకూడదనే వారి ఆశయం మాత్రం మంచిదే.