వాళ్లు వెలివేశారు...అతను సాధించాడు!
నాగపూర్‌లో ఒక దళితుడు సాధించిన విజయం…నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. నిజానికి విజయం అంటే ఒళ్లు పులకరించడం…అనే మాటనే వాడాలి. కానీ అతని దృఢనిశ్చయం…చేసిన పని ఒక మనిషికి సాధ్యమా…అనిపించేవే. బాపూరావ్ తాంజే నాగపూర్‌లోని వాషింజిల్లా, కలంబేశ్వర్ గ్రామంలో కూలిపనులు చేసుకుని బతుకుతున్నాడు. ఒకరోజు మంచినీళ్లకోసం అతను ఒక ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి యజమాని తమ బావినుండి నీరు తోడుకునేందుకు నిరాకరించాడు. అతని భార్య బాపూరావ్ పట్ల అవమానకరంగా మాట్లాడింది. బాపూరావ్ ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. […]
నాగపూర్‌లో ఒక దళితుడు సాధించిన విజయం…నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. నిజానికి విజయం అంటే ఒళ్లు పులకరించడం…అనే మాటనే వాడాలి. కానీ అతని దృఢనిశ్చయం…చేసిన పని ఒక మనిషికి సాధ్యమా…అనిపించేవే. బాపూరావ్ తాంజే నాగపూర్‌లోని వాషింజిల్లా, కలంబేశ్వర్ గ్రామంలో కూలిపనులు చేసుకుని బతుకుతున్నాడు. ఒకరోజు మంచినీళ్లకోసం అతను ఒక ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి యజమాని తమ బావినుండి నీరు తోడుకునేందుకు నిరాకరించాడు. అతని భార్య బాపూరావ్ పట్ల అవమానకరంగా మాట్లాడింది. బాపూరావ్ ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. దాదాపు ఏడుపు తన్నుకువచ్చింది. అయితే అతను బాధపడి ఊరుకోలేదు. మంచినీళ్లకోసం ఎవరిమీదా ఆధారపడకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అంతే వెంటనే మార్కెట్‌కి వెళ్లి బావి తవ్వడానికి ఏం కావాలో ఆ సామగ్రి మొత్తం తెచ్చుకున్నాడు. నలభై రోజులు నిరంతరాయంగా శ్రమించాడు. నలుగురునుండి అయిదుగురు కలిసి శ్రమపడితే కానీ కానిపనిని ఒక్కడే సాధించాడు. అతని శ్రమ ఫలించి బావిలో నీళ్లు పడ్డాయి.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అంతకుముందు ఆ సమీపంలో బావులు, బోర్లకోసం తవ్విన వారికి నీళ్లు పడలేదు. అతను చేస్తున్నది పిచ్చిపని అనే ఉద్దేశంతో ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అతను ఆ నలభై రోజులు తన రోజువారీ పని మానలేదు. పనికి వెళ్లేముందు నాలుగుగంటలు, వెళ్లివచ్చాక రెండు గంటలు తవ్వేవాడు. నీళ్లు పడినాక గ్రామంలోని దళితులంతా ఇప్పుడు ఆ బావినీళ్లే వాడుతున్నారు. తాము కులం కారణంగా అవమానం పొందకూడదనే బాపూరావ్ కోరిక నెరవేరింది. తమని అవమానించిన వ్యక్తి పేరుని సైతం అతను బయటపెట్టలేదు. బావి తవ్వడానికి అతను ఏ నిపుణుల సలహా తీసుకోలేదు. తన మనసు చెప్పిన ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పాడు. తమ బాధలు తీర్చమని దేవుడిని ప్రార్థించి పని మొదలుపెట్టానని చెప్పాడు. తన రోజువారీ పనితో కలిసి రోజుకి 14 గంటలు కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని వర్ణించలేనని, అయితే తాము వెళ్లి ఇతర కులాల వారి ఇంటిముందు నిలబడి నీటికోసం ప్రాథేయపడకూడదు… అనే తన కోరిక నెరవేరిందని
బాపూరావ్ తెలిపాడు. అతను బిఎ వరకు చదువుకున్నాడు.