పాలమూరుకు పట్టిసీమకు లింక్ పెడుతున్న తెలంగాణ వాదులు
పాలమూరు ప్రాజెక్టు విషయంలో టీడీపీ- టీఆర్ ఎస్ పార్టీలు మాటల కత్తులు దూసుకుంటున్నాయి. ఈ విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోవడం లేదు. పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేయడాన్ని కేసీఆర్ తో సహా తెలంగాణ మంత్రులందరూ ఖండిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం అక్రమమంటున్న ఏపీ దాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ… కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాయడానికి సిద్ధమవడంతో రెండు పార్టీల మధ్య వేడి మరింత రాజుకుంది. దీనిపై ఎవరి […]
పాలమూరు ప్రాజెక్టు విషయంలో టీడీపీ- టీఆర్ ఎస్ పార్టీలు మాటల కత్తులు దూసుకుంటున్నాయి. ఈ విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోవడం లేదు. పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేయడాన్ని కేసీఆర్ తో సహా తెలంగాణ మంత్రులందరూ ఖండిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం అక్రమమంటున్న ఏపీ దాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ… కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాయడానికి సిద్ధమవడంతో రెండు పార్టీల మధ్య వేడి మరింత రాజుకుంది. దీనిపై ఎవరి వాదన ఎలా ఉందంటే..?
ఏపీ టీడీపీ నేతల బాటలోనే తెలంగాణ తమ్ముళ్లు..
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో దీనిపై తెలుగుదేశం రెండు రాష్ర్టాల పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీ నేతలంతా పాలమూరు ప్రాజెక్టును ఏకగ్రీవంగా ఖండించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలని తీర్మానించారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరాలు వివరిస్తూ… కేంద్రానికి లేఖరాయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ నేతలంతా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగితే.. తెలంగాణ నేతలు ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగాగానీ, వ్యతిరేకంగాగానీ నోరు విప్పలేదు. వారు చాలా విచిత్రమైన వాదన తెరపైకి తీసుకువచ్చారు. జగన్ – కేసీఆర్ లు ఈ విషయంలో పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు బురద జల్లు కుంటున్నారని ఆరోపించారు. అంతేకానీ, ప్రాజెక్టును నిర్మించాలని, దానిపై తెలంగాణ సర్కారు ఏపీతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలనే తీర్మానం గానీ, అసలా ప్రస్తావనగానీ తీసుకురాకపోవడం గమనార్హం. అంటే వీరు పరోక్షంగా ఏపీ టీడీపీ నేతలకు వంతపాడుతున్నారని తేటతెల్లమైంది.
పాలమూరు అక్రమమా? మరి పట్టిసీమ సంగతేంటి?
పాలమూరు అక్రమమని వాదిస్తోన్న ఏపీమాటలను తెలంగాణ సర్కారు కూడా దీటుగానే ఖండిస్తోంది. మాది అక్రమ ప్రాజెక్టు కాదని స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడి 1300 టీఎంసీల పరిధిలోనే మా ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అని వాదిస్తోంది. ఉమ్మడి ఏపీలో ప్రతిపాదించిన ప్రాజెక్టునే తాము ఇప్పుడు కడుతున్నామని, ఇదేం కొత్త ప్రాజెక్టు కాదని అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టిసీమ కట్టినప్పుడు అక్రమ ప్రాజెక్టు అన్న సంగతి గుర్తుకు రాలేదా? అని మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నీళ్లను రాయలసీమకు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు మీరు చేస్తూ.. మమ్మల్ని మాటలంటేసహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.