వైద్యోనారాయణ హరీ...అంటే
వైద్యుడూ…నారాయణుడు ఇద్దరూ కనబడరని! భారత్‌లో వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇప్పటికే పలు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా-వైద్యుల నిష్పత్తిని బట్టి చూస్తే భారత్‌లో ప్రతి 1681మంది పౌరులకు ఒక్క వైద్యుడు చొప్పున ఉన్నారు. అది కూడా, ఇందులో కనీసం 80శాతం మంది డాక్టర్లు అవసరమైనపుడు అందుబాటులో ఉంటారనే అంచనాతో లెక్కవేసిన గణాంకాలు ఇవి. ఇందులో అలోపతి వైద్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకు తగినట్టుగా మనదేశం నుండి విదేశాలకు వెళుతున్న వైద్యుల సంఖ్య బాగా పెరుగుతోంది. […]
వైద్యుడూ…నారాయణుడు ఇద్దరూ కనబడరని!
భారత్‌లో వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇప్పటికే పలు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా-వైద్యుల నిష్పత్తిని బట్టి చూస్తే భారత్‌లో ప్రతి 1681మంది పౌరులకు ఒక్క వైద్యుడు చొప్పున ఉన్నారు. అది కూడా, ఇందులో కనీసం 80శాతం మంది డాక్టర్లు అవసరమైనపుడు అందుబాటులో ఉంటారనే అంచనాతో లెక్కవేసిన గణాంకాలు ఇవి. ఇందులో అలోపతి వైద్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకు తగినట్టుగా మనదేశం నుండి విదేశాలకు వెళుతున్న వైద్యుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఏప్రిల్ 2013 నుండి మార్చి 2016 వరకు 4,701 మంది వైద్యులు, ఇక్కడ డాక్టరు డిగ్రీని సంపాదించుకుని విదేశాలకు వెళ్లిపోయారు. కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ విదేశాలకు వెళ్లిపోయే వైద్యులను ఆపే ప్రయత్నాలు చేయకపోవటం కూడా ఇందుకు ఒక కారణం.
దీనివలన దేశవ్యాప్తంగా డాక్టర్లు అందుబాటులో లేని ఆసుపత్రులు ఉంటున్నాయి. సరైన వైద్యం సమయానికి అందని పేషంట్లు లెక్కలేనంతమంది ఉంటున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధుల నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. వీరంతా బెంగలూరికి వైద్యంకోసం వెళుతున్నారు. వసతి సదుపాయాలు లేక నానా బాధలు పడుతున్నారు. ఇండియన్ పీడియాడ్రిక్ న్యూరాలజీ అసోసియేషన్ వారు అందిస్తున్న వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం కేవలం 65 మంది చిన్నపిల్లల నరాలవ్యాధి నిపుణులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందలకొద్దీ డాక్టరు పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 83 సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల పోస్టులు ప్రకటిస్తే అందులో కేవలం 31 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాల సంఖ్య 968. కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఆసుపత్రుల్లో 381 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీస్ బలాగాల కోసం కేటాయించిన 480 డాక్టరు పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. తాజా కాగ్ నివేదిక సైతం కర్ణాటక, గుజరాత్‌లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని వెల్లడించింది. 2015 వరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకున్న వైద్యుల సంఖ్య 9.5 లక్షలకు కాస్త ఎక్కువగా ఉంది. ఇందులో గత నాలుగేళ్లుగా నమోదు అయిన వైద్యుల సంఖ్య 98,831. వైద్యో నారాయణ హరి అన్నారు…దీనికి మనం దేవుడిలాగే డాక్టరూ కనబడడు అనే నిర్వచనం ఇచ్చుకోవచ్చు.